రాహుల్‌ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం

12 May, 2017 04:40 IST|Sakshi

సీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
విజయనగరం ఫోర్ట్‌: దేశంలో 2019లో జరగనున్న ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి అన్నారు. స్థానిక డీసీసీ కార్యాలయంలో గురువారం జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో బూత్‌స్థాయి నుంచి అలిండియా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి వరకు అన్ని ఎన్నికలు ప్రజాస్వామ్య యుతంగా జరుగుతాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 70 ఏళ్లు కష్టపడి దేశాన్ని అభివృద్ధి చేస్తే బీజేపీ, టీడీపీలు మూడేళ్ల కాలంలో కుక్కలు చింపిన విస్తరిగా మార్చాయని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి లౌకికవాదానికి కట్టుబడిన వ్యక్తిగా పేర్కొన్నారు.

రాష్ట్ర  విభజన నేపథ్యంలో జీరోగా మారిన కాంగ్రెస్‌ పార్టీ 2019లో ఏ విధంగా ముందుకు వెళ్తుందని విలేకరులు ప్రశ్నించగా ప్రత్యేకహోదాయే ప్రజా అజెండాగా సాగుతామన్నారు. బీజేపేతర శక్తులన్నింటితో కాంగ్రెస్‌ పార్టీ బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉందన్నారు. రాహుల్‌ గాంధీ ప్రచారం చేస్తే ఓట్లు రావడం లేదని సొంత పార్టీ నాయకులే అంటున్నారని ప్రశ్నించగా రాహుల్‌ గాంధీ చాలా గొప్ప వ్యక్తిగా పేర్కొన్నారు. ప్రధాని పదవిని త్యాగం చేశారన్నారు. ప్రత్యేకహోదా కోసం 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టామన్నారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కిల్లి రామ్మోహనరావు, ఎమ్మెల్సీ విశ్వప్రసాద్, ద్రోణంరాజు శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు