మహత్తరి మురికి చిత్రం మ్యాచ్‌ ఫిక్సింగ్‌

29 Sep, 2013 01:59 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజకీయంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను దెబ్బతీయటమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అధిష్టానం సరికొత్త నాటకానికి తెరతీస్తోంది. టీడీపీతో కుమ్మక్కయి డబుల్‌ గేమ్‌ ఆడేందుకు ప్రణాళిక రచించింది. ఈ ప్రణాళికను రెండు భాగాలుగా అమలు చేస్తోంది. రాష్ట్ర విభజన అనివార్యమని, విభజనపై వెనకడుగు లేదని ఇప్పటి వరకూ కరాఖండిగా చెప్పిన కాంగ్రెస్‌ అధినాయకత్వం.. అదే సమయంలో హైకమాండ్‌పై ‘తిరుగుబాటు’ చేస్తూ ఉండాలని ఇప్పటికే పార్టీ సీమాంధ్ర నేతల్లో ఒక వర్గానికి నిర్దేశించింది. ఈ వర్గానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సారథ్యం వహిస్తారు. రాష్ట్రంలో తమ స్థానాన్ని, పార్టీని బలోపేతం చేసేందుకు ఇంతవరకూ కొంత సమయం అడిగి తీసుకున్న ఇతర నేతలు కూడా ఇప్పటికే ఈ ‘పథకం’అమలు చేయటం మొదలుపెట్టారని పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి.

‘రాష్టప్రతి పాలన’కు జగన్‌ను బాధ్యునిగా చూపాలి
మరోవైపు సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల్లోని మరో బృందానికి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపైన, ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపైన విమర్శల దాడికి పదునుపెట్టాలని అధిష్టానం ఆదేశించినట్లు చెప్తున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ వైఖరిని అనుసరిస్తూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలపై అదే తరహాలో దాడి చేయాలని ఈ బృందానికి నిర్దేశించినట్లు తెలుస్తోంది. అంటే.. రాజీనామాలు చేసినట్లయితే రాష్టప్రతి పాలన విధించి రాష్ట్రాన్ని విభజించటం కాంగ్రెస్‌కు సులువవుతుందని.. అందుకు జగన్‌మోహన్‌రెడ్డే బాధ్యులని ఆరోపించాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

దీంతో తాము టీడీపీ నేతల వైఖరిని అనుసరిస్తూ జగన్‌పై తీవ్ర దాడి మొదలుపెడతామని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు అంగీకరించారు. ఇలా టీడీపీ తరహాలో తాము కూడా దాడిచేయటం వల్ల.. ఒకవేళ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతల నుంచి విభజనకు ప్రతిఘటన నాటకం రక్తికట్టి రాష్టప్రతి పాలన విధించే పరిస్థితే వస్తే.. తమకు లాభిస్తుందని వారు వాదిస్తున్నారు.

జగన్‌పై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేయాలి...
అదే కాంగ్రెస్‌ నేతలు అదే సమయంలో జగన్‌ కాంగ్రెస్‌ అధిష్టానంతో ఒప్పందం కుదుర్చుకున్నారని.. దానిని తాము తర్వాత బయటపెడతామని విమర్శలు గుప్పిస్తారు. ఇలాచేయటం.. ఇదే తరహా విమర్శలు చేస్తున్న టీడీపీ వాదనకు బలం చేకూరుస్తుందనేది ప్రణాళిక. ఈ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ ఆరోపణలను అందిపుచ్చుకుని.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ నేతల వర్గం ఇటు జగన్‌ను, అటు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని తీవ్రంగా విమర్శిస్తుంది. అదే సమయంలో కిరణ్‌ బృందాన్ని సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న హీరోలుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. టీడీపీ, చంద్రబాబునాయుడులపై విమర్శలను తప్పించి.. అన్ని వైపుల నుంచీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌, జగన్‌లపై ఆరోపణలు, విమర్శలను కేంద్రీకరిస్తుంది.

వేరే వారు పెట్టే పార్టీలో చేరాలన్నారు...
 కాంగ్రెస్‌ - టీడీపీల సుదీర్ఘ కుమ్మక్కు యాత్రలో ఇది మరో డబుల్‌ గేమ్‌ అని విశ్వసనీయ వర్గాలు అంగీకరిస్తున్నాయి. అలాగే.. సీమాంధ్ర నాయకులను కూడా నేరుగా కొత్త పార్టీని ప్రారంభించవద్దని.. విభజన ప్రక్రియను వేగవంతం చేసిన తర్వాత ‘ఎవరైనా పౌర సమాజం సభ్యులు / ఏపీ ఎన్‌జీవో నేతలు వంటి వారు ప్రారంభించే’ పార్టీలో చేరాలని కూడా సూచించినట్లు చెప్తున్నారు. ‘ఇందుకోసం మాకు మరో నెల గడువుంది. ఈ విషయంలో మా ప్రయత్నాల్లో భాగంగా టీడీపీతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్దేశించారు’ అని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీ ఒకరు వెల్లడించారు.

మరిన్ని వార్తలు