'కాంగ్రెస్ జేజమ్మలు దిగొచ్చినా రాయల తెలంగాణను తేలేరు'

4 Dec, 2013 23:14 IST|Sakshi
'కాంగ్రెస్ జేజమ్మలు దిగొచ్చినా రాయల తెలంగాణను తేలేరు'

హైదరాబాద్: ఎంఐఎం పార్టీ రాయల తెలంగాణను అడిగిందని తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలిపెడతారా? అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. పూటకో డ్రామా ఆడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ఇప్పుడీ సరికొత్త రాగమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నేతలు యెండల లక్ష్మీనారాయణ, యన్నం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.రాజేశ్వరరావు, అరుణా జ్యోతి, బండారు దత్తాత్రేయ తదితరులు బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు.

వందల ఏళ్ల చరిత్ర, సంస్క­ృతి ఉన్న రాయలసీమ సెంటిమెంటును దెబ్బతీస్తారాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బ్రేకులు, లీకులతో ప్రజలను గందరగోళపరుస్తారా? కబడ్దార్’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ జేజమ్మలు దిగొచ్చినా రాయల తెలంగాణను తేలేరన్నారు. జేఏసీ భాగస్వామ్య పార్టీగా గురువారం నాటి బంద్‌కు మద్దతిస్తున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే, కర్నూలుకు చెందిన డీ భీమలింగేశ్వరరావు నాయకత్వంలో పలువురు బీజేపీలో చేరారు. ప్రపంచ రోలర్ స్కేటింగ్ చాంపియన్ పోటీలో పసిడి పతకాన్ని సాధించిన హైదరాబాద్ యువకుడు అనూప్ కుమార్ యామాను నేతలు ఘనంగా సత్కరించారు.

>
మరిన్ని వార్తలు