తప్పు సరిదిద్దుకుందాం

14 Feb, 2015 01:19 IST|Sakshi
తప్పు సరిదిద్దుకుందాం

కాంగ్రెస్ మేధోమథనంలో దిగ్విజయ్
కోటి సంతకాలను ముమ్మరం చేయాలి
తొలి రోజు నాలుగు గ్రూపుల చర్చ
నేడు కూడా కొనసాగనున్న సదస్సు
 

విజయవాడ సెంట్రల్ : రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ తొలి మేధోమథన సదస్సు నగరం కేంద్రంగా జరిగింది. శుక్రవారం హనుమాన్‌పేటలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సదస్సును ఎపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సదస్సు మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. అనంతరం ఒక గంట బ్రేక్ ఇచ్చారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ అన్ని పార్టీలు కోరిన తర్వాతే కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిందని చెప్పారు. మిగిలిన పార్టీలు విభజన వల్ల రాజకీయ లబ్ధిపొందితే, కాంగ్రెస్ చేయని తప్పుకు నింద మోస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని నాయకులకు సూచించారు. పార్టీ విధి విధానాలు, భవిష్యత్ వ్యూహం తదితర అంశాలపై ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు వివరించారు. సదస్సుకు హాజరైన ప్రతినిధులను ఆరు గ్రూపులుగా చేశారు. మొదటి నాలుగు కమిటీలు తొలిరోజు చర్చలు సాగించాయి. మిగిలిన రెండు కమిటీలు శనివారం చర్చలు సాగించనున్నాయి.

ముమ్మరంగా కోటి సంతకాలు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం రాజకీయాలకు అతీతంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించినట్లు శాసనమండలి ఫ్లోర్‌లీడర్ సి.రామచంద్రయ్య వెల్లడించారు. సాయంతం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సదస్సు వివరాలను తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నామని చెబుతున్న సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజాప్రతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు.

మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ పార్టీకి దూరమైన వర్గాలను ఆకట్టుకొనేందుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.  కోటి సంతకాలకు మద్దతు తెలుపుదామనుకొనే వారు 7842434121 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకుడు తిరువనక్కరసు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, కనుమూరి బాపిరాజు, కొండ్రు మురళీ, పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ, సిటీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు, బుచ్చిబాబు, నేతలు కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాస్‌కుమార్, అవినాష్, మీసాల రాజేశ్వరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు