కాంగ్రెస్‌కు పల్లెదెబ్బ!

2 Aug, 2013 04:36 IST|Sakshi

సాక్షి, కొత్తగూడెం: పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. పల్లె ఓటర్లు ఇచ్చిన  తీర్పుతో ఆపార్టీ కంగుతింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెంది  మంత్రి, డిప్యూటీ స్పీకర్, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా ఫలితాల్లో మాత్రం రెండు విడతల్లోనూ మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది. భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా.. ఐదో స్థానంలోకి పడిపోవడం గమనార్హం. రాజకీయాల్లోకి కొత్తగా అడుగిడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  నాలుగు నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. మరో నాలుగు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచి హవా కొనసాగించింది.
 
 జిల్లాలో కాంగ్రెస్ నేతలకు పల్లె ఓటర్లు చుక్కలు చూపించారు. మధిర, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాలలో ప్రథమస్థానంలో నిలిచినా మొత్తంగా వెనుకంజలో ఉంది. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం నిర్వహించినా ఫలితాలు మాత్రం ఆశాజనకంగా రాలేదు. ఎర్రుపాలెం మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి తప్పలేదు. అక్కడ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ప్రభంజనం సృష్టించారు. పాలేరులో కూడా వైఎస్సార్‌సీపీ అత్యధిక పంచాయతీలను దక్కించుకొని ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి విసృ్తతంగా ప్రచారం చేసినా భంగపాటు తప్పలేదు. భద్రాచలంలో ఆపార్టీ తక్కువ పంచాయతీలు దక్కించుకొని ఐదో స్థానంలో నిలిచింది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ఐదో స్థానం చేరుకోవడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకున్నారు. ఇక పినపాక నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రథమ స్థానంలో నిలిస్తే.. కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. అశ్వారావుపేటలో కూడా కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. సత్తుపల్లి, వైరాలో కూడ ఆ పార్టీది ఇదే పరిస్థితి. కొత్తగూడెం నియోజకవర్గంలో ఆపార్టీకి సీపీఐ మద్దతుదారులు గట్టి పోటీనిచ్చారు.
 
 మూడుతోనే సరిపెట్టుకున్న టీడీపీ..: టీడీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నా.. కేవలం సత్తుపల్లి, అశ్వారావుపేట, వైరాలో మాత్రమే ఈ పార్టీ అధిక పంచాయతీలను దక్కించుకుంది. ఖమ్మం, ఇల్లెందు నియోజకవర్గాలలో పార్టీ ఎమ్మెల్యేలున్నా  రెండో స్థానంలో నిలిచింది. సత్తుపల్లి, అశ్వారావుపేటలో టీడీపీ మద్దతుదారులకు వెస్సార్‌సీపీ మద్దతుదారులు గట్టిపోటీ నిచ్చి బెంబేలెత్తించారు.  ఇల్లెందు నియోకజవర్గంలో ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రచారం చేసినా అక్కడ టీడీపీకి ఓటర్లు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.


 వైఎస్సార్‌సీపీకి అనూహ్య స్పందన..:వైఎస్సార్ సీపీకి పల్లెల్లో  అనూహ్యరీతిలో స్పందన వచ్చింది.  ఖమ్మం, పాలేరు, భద్రాచలం, పినపాక  నియోజకవర్గాల్లో అత్యధిక పంచాయతీలు దక్కించుకొని ైవె ఎస్సార్‌సీపీ ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే మధిర, సత్తుపల్లి, వైరా, అశ్వారావుపేటలో రెండో స్థానంలో ఉంది. మిగతా నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఇతర పార్టీల అభ్యర్థులతో నువ్వా..నేనా అన్నట్లు తలపడ్డారు. నియోజకవర్గాల్లో అన్ని పార్టీలను పోలిస్తే.. ఎక్కువ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ముందంజలో ఉంది.

మరిన్ని వార్తలు