సమైక్య ద్రోహులను తరిమికొట్టండి

3 Oct, 2013 02:43 IST|Sakshi
నంద్యాల, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న వారిని తరిమికొట్టాలని ప్రజలకు వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమానాగిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్ ఆర్చి వద్ద నంద్యాల నియోజకవర్గానికి చెందిన 65 మంది వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల 48 గంటల దీక్షను భూమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్‌లపై విరుచుకపడ్డారు. ఈ పార్టీలన్నీ సమైక్యవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, ఆ పార్టీలను  తరిమికొడితే తప్ప సీమాంధ్రకు న్యాయం జరగదని పేర్కొన్నారు.
 
 ఆ పార్టీ నాయకులను జేఏసీ నాయకులు నిలదీయాలని కోరారు. రాష్ట్రాన్ని విభజించాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు చూస్తున్నారని, జేఏసీ నాయకులు ఆయన వలలో పడొద్దని సూచించారు. ఒకవైపు కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుంటూనే మరోవైపు 10 జిల్లాలతో కూడిన తెలంగాణాను హైదరాబాద్‌ను రాజధానిగా కలిపి ప్రకటించాలని బహిరంగంగా చంద్రబాబు ప్రకటిస్తున్నారని గుర్తు చేశారు. స్వార్థం కోసం ఏ పనిచేయడానికైనా ఆయన సిద్ధహస్తుడని ఆరోపించారు. బాబు..అత్యంత ప్రమాదకరమైన రాజకీయ నాయకునిగా గుర్తించి దూరం ఉంచాలని భూమా అన్నారు. సీమాంధ్ర ప్రజల శ్రేయస్సును కోరుతున్నదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. 
 
 తమ పార్టీకి అండదండలు అందిచాల్చిన బాధ్యత జేఏసీతో పాటు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. భారతదేశంలోనే ఇంత వరకు విభజన కోసం ఆందోళనలు చేశారో తప్ప సమైక్యతకోసం ఎన్నడూ ఉద్యమం జరగలేదన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తే తప్ప సీమాంధ్రకు న్యాయం జరగదన్నారు. టీడీపీ అధినేతకు పదవీ వ్యామోహం పట్టిందని అందుకే కాంగ్రెస్, బీజేపీలపై ఆయన పార్టీ యూ టర్న్ తీసుకుందన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు జాతీయ, 
 
 అంతర్జాతీయ స్థాయి వ్యాపారులు ఉండడంతో వారు కేంద్రానికి భయపడి సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరించలేక పోతున్నారని విమర్శించారు. అలాంటి వారికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతల బాగోతాలను ప్రజలకు వివరించడానికి వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు. గత వారం రోజుల నుండి వైఎస్‌ఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ రెండు పార్టీలు వ్యూహాన్ని రూపొందించుకుంటున్నాయని భూమా ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల రిలే దీక్షలకు విశేష స్పందన లభించింది. నంద్యాల, గోస్పాడు మండలాల నుంచి ప్రజలు తరలివచ్చారు.
 
 
మరిన్ని వార్తలు