కాంగ్రెస్, టీడీపీదే విభజన పాపం

29 Aug, 2013 00:57 IST|Sakshi

విజయవాడ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రపై ఢిల్లీలో ఒకమాట, రాష్ట్రంలో మరో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ టీడీపీలకు ఉద్యమించే నైతిక హక్కు లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. తెలుగు ప్రజలందరికీ సమన్యాయం చేయాలని లేకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్షకు దిగిన వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహనరెడ్డికి మద్దతుగా నగర పాలక సంస్థ స్థాయీ సంఘం మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ నేత జవ్వాది సూర్యనారాయణ (రుద్రయ్య) చేపట్టిన నిరవధిక దీక్ష బుధవారం మూడో రోజుకు చేరింది.  

దీక్షా శిబిరాన్ని సందర్శించిన వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ  చాలా నిసిగ్గుగా వ్యవహరిస్తున్నాయన్నారు. చంద్రబాబునాయుడు ఒకవైపు తెలంగాణాకు మద్దతుగా లేఖ ఇచ్చారని, మరోవైపు ఆ పార్టీ నేతలు ఇక్కడ ప్రజలను మభ్యపెట్టేందుకు పాకులాడుతున్నారని విమర్శించారు.   తమ పార్టీ ప్రజాప్రతినిధులు కేంద్ర పాలకుల కుయుక్తులను గమనించి ముందుగానే రాజీనామా చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.  పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో నిరవధిక దీక్షకు దిగితే అత్యంత దారుణంగా ఆ దీక్షను భగ్నం చేశారని చెప్పారు.

నేడు తెలుగు ప్రజల ఆకాంక్షను నిలబెట్టేందుకు జగన్‌మోహనరెడ్డి జైలులో ఆమరణ దీక్ష  ప్రారంభించారని తెలిపారు. ఆయనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పారు. విజయవాడలో జవ్వాది రుద్రయ్య ఆమరణ దీక్షకు దిగడం అభినందనీయమన్నారు.  పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, సెంట్రల్ నియోజకవర్గ కన్వీనర్ పీ.గౌతంరెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజలను విడదీయడానికి కాంగ్రెస్, టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయన్నారు.

పార్టీ అధికార ప్రతినిధి దాసీజయప్రకాష్‌కెనడీ, ప్రచార విభాగ కన్వీనర్ కంది గంగాధరరావు, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ విశ్వనాధ రవి, వాణిజ్య విభాగ కన్వీనర్ కొనిజేటి రమేష్,  నాయకులు దాడి అప్పారావు, కంపా గంగాధరరెడ్డి, మనోజ్‌కొఠారి, వరకాల జోషి, కరిముల్లా, గౌరి, రామిరెడ్డి, మాడెం దుర్గారావు, సుందర్‌పాల్, ముంతాజ్, కడవకొలు కుమారి, మేకల రాణి  పాల్గొన్నారు.
 
పలువురి మద్దతు...
 జవ్వాది రుద్రయ్య దీక్షకు పలువురు సంఘీభావం ప్రకటించారు. విజయవాడ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ నేతలు, వ్యాపారులు భారీ ప్రదర్శనగా దీక్షా శిబిరానికి తరలివచ్చారు. ఆ సంఘం నేతలు ఆరుమళ్ళ వెంకటేశ్వరరెడ్డి, పిన్నిటి రామారావు తదితరులు రిలేదీక్షలో పాల్గొన్నారు.   విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతాడ బ్రహ్మనందం జవ్వాదిని పరామర్శించి సంఘీభావాన్ని తెలిపారు. వారితో పాటుగా రిలేదీక్షల్లో మనోజ్‌కొఠారి, దాడి తేజోకుమార్, సరోజనమ్మ, రమణమ్మ , ఆడి సింహచలం, పీ.సత్యనారాయణ, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు