రచ్చబండలో రచ్చ..రచ్చ..

26 Nov, 2013 05:34 IST|Sakshi

డిచ్‌పల్లి, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమం రచ్చ..రచ్చగా సాగింది. నియోజకవర్గ ఎమ్మెల్యే మండవ వె ంకటేశ్వరరావు ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. వారికి పోటీగా టీడీపీ కార్యకర్తలు ప్రతి నినాదాలు చేయడంతో సుమారు అరగంట పాటు సభకు అంతరాయం కలిగింది. పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, ఎంపీ మధుయాష్కీగౌడ్ తో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, అరికెల నర్సారెడ్డి, మండవ తదితరులు పలుసార్లు విజ్ఞప్తి చేసినా ఇరువర్గాల వారు శాంతించకపోవడంతో రచ్చబండ రసాభాసాగా కొనసాగింది. మధ్యలో డీఎస్ తన స్థానం నుంచి  లేచి వేదిక చివరకు వచ్చి మరీ ఇరువర్గాల వారికి నచ్చజెప్పాల్సి వచ్చింది. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కార్యకర్తల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
 కార్యకర్తలను సైగలతో రెచ్చగొడుతున్నావంటూ ఏఎంసీ చైర్మన్ నగేశ్‌రెడ్డితో ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే మండవలు వాగ్వాదానికి దిగారు. చివరకు కలెక్టర్ ప్రద్యుమ్న మైక్‌లో ఇది రాజకీయ పార్టీల సమావేశం కాదని, ప్రభుత్వ కార్యక్రమం అని ఇష్టం లేని వారు ఇక్కడి నుంచి వెళ్లి పోవచ్చని పదే పదే చెప్పాల్సి వచ్చింది. డీఎస్పీ అనిల్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.  కాంగ్రెస్ కార్యకర్తలను లాఠీల తో చెదరగొడుతున్న పోలీసులపై ఏఎంసీ చైర్మన్‌తో పాటు డీసీసీబీ డైరక్టర్ గజవాడ జైపాల్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారం భం కావాల్సిన కార్యక్రమం అరగంట ఆలస్యంగా ప్రార ంభం కావడంతో పాటు మధ్యలో రచ్చరచ్చ కావడం వల్ల రాత్రి 6 గంటలకు ముగిసింది. సభ ముగిసిన తర్వాత కౌంటర్ల వద్ద సుమారు రెండు గంటల పాటు వేచిఉండి ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారు.  దూర ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ముఖ్యంగా  మహిళలు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర  ఇబ్బందులు పడ్డారు.

మరిన్ని వార్తలు