పవన్కళ్యాణ్కు కాంగ్రెస్ ఆహ్వానం:14న మీడియా సమావేశం

8 Mar, 2014 20:03 IST|Sakshi
పవన్ కళ్యాణ్

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో పలు పార్టీల నేతలు ఆయనను ఆహ్వానిస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ కూడా  పవన్ కళ్యాణ్ను  కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ తమ పార్టీలో చేరితే సంతోషిస్తామని చెప్పారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున ప్రచారం చేసే సమయంలో కాంగ్రెస్ నేతలను పంచెలు ఊడదీసి తరమాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీలో చేరతారా?  పవన్ కళ్యాణ్  రాజకీయాల్లోకి రాబోతున్నారని పది రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దాంతో  పవన్ కళ్యాణ్కు  లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ,  తెలుగు దేశం పార్టీ నేతలు కూడా ఆహ్వానం పలికారు. అయితే  పవన్ మనసులో ఏముందో  ఇంతవరకు బయటకు వెల్లడికాలేదు.

వచ్చే ఎన్నికలకు పవన్ ఏదో ఒక రాజకీయా పార్టీలో చేరతారని - కొత్త పార్టీ పెడతారని -  అతను పెట్టే  పార్టీ పేరు పవన్ రిపబ్లికన్ పార్టీ (పీఆర్పీ) లేక యువరాజ్యం అని - ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని - లోకసత్తా పార్టీ తరపున పోటీ చేస్తారని - మల్కాజిగిరి లేక ఏలూరు  నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని ...ఇలా అనేక రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరో పక్క రాజకీయాలలోకి రావద్దని కొందరు ఆయనకు సలహాలు ఇస్తున్నారు.  ఈ నేపధ్యంలో రాజకీయాలకు సంబంధించి తన ఆలోచనలను బయట పెట్టేందుకు పవన్ కళ్యాణ్ ఈ నెల 14న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో తన రాజకీయ ఆలోచనలను, కార్యచరణను వెల్లడిస్తారు.  రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక పుస్తకం రాశారు. రాజకీయాలు - ప్రజాస్వామ్య  హక్కులు, విధులు -   ప్రజలతో ప్రభుత్వం సత్సంబంధాలు ... తదితర అంశాలను ఆ పుస్తకంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.ఆ పుస్తకాన్ని కూడా ఆ రోజున విడుదల చేస్తారని తెలుస్తోంది. 14న ఆయన చేసే కీలక ప్రకటన కోసం ఆయన అభిమానులతోపాటు సినిమా పరిశ్రమ, రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు