నిమ్స్ అమ్మేందుకు కుట్ర

24 Jan, 2014 03:38 IST|Sakshi

 బీబీనగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నిర్మించిన నిమ్స్ యూనివర్సిటీని అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర చేసిందని, ఉద్యమాలు చేపట్టడంతో దానిని అమ్మనివ్వకుండా ఆపగలిగామని తెలంగాణ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.  నిమ్స్‌లో వైద్యసేవలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ టీజేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఆ యూనివర్సిటీ ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన  ప్రసంగించారు. తెలంగాణ ప్రాజెక్టులను సీమాంధ్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయన్నారు. షుగర్, ఆల్విన్ పరిశ్రమల అమ్మకాలు జరిపిందన్నారు.
 
 తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న మాదిరిగానే నాలుగేళ్లుగా నిమ్స్ కోసం ఉద్యమం చేయక తప్పడం లేదన్నారు.  2013 జూన్‌లో నిమ్స్‌లో వైద్యసేవలు ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి జరగలేదనడానికి ఈ యూనివర్సిటీయే పెద్ద నిదర్శనమని పేర్కొన్నారు. నిమ్స్ పూర్తయితే బీబీనగర్, భువనగిరిలు అద్భుత వికాస కేంద్రాలుగా మారుతాయన్నారు. తెలంగాణ ప్రాంతం వైద్యరంగంలో పూర్తిగా వెనుకబడిందని, ఇక్కడ మెడికల్ యూనివర్సిటీలను నిర్మించాలని శ్రీకృష్ణ కమిటీయే పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
 
 అయినా ప్రభుత్వం నిమ్స్‌ను అభివృద్ధి చేయకుండా.. అందుకు సంబంధించిన నిధుల జీఓ అమలు కాకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. అదే విధంగా సీసీఎంబీ నిర్మాణం, ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ప్రాణహిత-చేవెళ్లకు తరలించేలా నిధులు ఖర్చు చేస్తే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తే తప్ప పరిష్కారం లభించడం లేదన్నారు. పోరాట దిశగా వెళ్తే తప్ప నిమ్స్ పూర్తి కాదన్నారు. వైద్యసేవలు ప్రారంభమయ్యే వరకు ప్రజా సంఘాలు, విద్యార్థులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
 
 తెలంగాణ ఆస్తులను దోచుకున్న
 ఆంధ్రా పాలకులు
 ఆంధ్రా పాలకులు తెలంగాణలోని విలువైన భూములను, ఆస్తులను, ఉద్యోగాలను దోచుకొని అన్ని రంగాలలో తీరని అన్యాయం చేశారని కోదండరాం అన్నారు. కమిటీల పేరుతో ఉద్యోగ రంగాలలో అక్రమాలకు పాల్పడుతుండడం వల్లే తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు రావడం లేదని అన్నారు. ముల్కీ రూల్స్ విధానాన్ని రద్దు చేసి ఇక్కడి వేల ఎకరాల విలువైన భూములను ఆంధ్రా పాలకులు స్వాధీన పరుచుకున్నారన్నారు. 610 జీఓ కోసం నిలదీస్తే గ్లిర్‌గ్లానీ కమిటీ వేశారని, కానీ కమిటీకి నిధులు ఇవ్వకుండా జాప్యం చేసిందన్నారు. చివరికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం వల్లే నిధులు మంజూరు చేశారన్నారు.  ఉద్యోగ రిజర్వేషన్ల విషయంలో జరిగిన చేర్పులు, మార్పులను ముఖ్యమంత్రి కిరణ్ కప్పి పెడుతున్నారన్నారు. నిజాం పాలన వల్లే తెలంగాణ వెనుకబడిందని అసెంబ్లీలో ఆంధ్రా పాలకులు బురద చల్లుతున్నారన్నారు. నిజాం సర్కార్ హయాంలో పెట్టిన రూ.2వేల కోట్లు విలువ చేసి చక్కర పరిశ్రమను సీమాంధ్ర ప్రభుత్వం అమ్ముకుందని, అలాగే నిజాం కాలం నాటి విలువైన భూములను ఆంధ్రా పెత్తందారులు కబ్జాలు చేశారని ఆరోపించారు.
 
 తెలంగాణ బిల్లుపై చర్చ జరగనివ్వకుండా అడ్డుకొని కాగితాలను తగులబెట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక  అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్‌యాదవ్, టీజేఎసీ డివిజన్ కన్వీనర్ పూస శ్రీనివాస్, మండల కన్వీనర్ జైపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గాదె నరేందర్‌రెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, స్వాతంత్ర సమరయోధులు కొలను శివారెడ్డి, లక్ష్మినారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు