మనసున్న పోలీస్‌

4 Feb, 2018 13:05 IST|Sakshi
కానిస్టేబుల్‌ కరుణాకరన్‌

కరుణాకరుడు సేవా సంపన్నుడు

అనాథ శవాలకు ఆయనే అండ

అభాగ్యులకు రోజూ అన్నం

కుటుంబం తోడుగా సామాజిక సేవ

మానవత చాటుకుంటున్న పోలీస్‌

పోలీసులను విమర్శించే వారు అతడి గురించి తెలుసుకుంటే మరోసారి నిందలేయరు. పోలీసు యూనిఫాం గర్వపడేలా అరుదుగా కనిపించేవారిలో చిత్తూరు నగరానికి చెందిన కరుణాకరన్‌ ముందు వరసలో ఉంటారు. అందరూ కందా అని పిలుచుకునే ఈయన పెద్ద మనసున్న పోలీసు. అనాథ శవాలను మోస్తుంటారు. అభాగ్యులకు అన్నం పెడుతుంటారు. అంత్యక్రియలకు షెడ్లు కట్టిస్తారు. నమ్మిన దైవం కోసం గుడి కట్టిస్తారు. సంపన్నుడేమీకాదు. ఓ సాధారణ కానిస్టేబుల్‌ మాత్రమే.

చిత్తూరు అర్బన్‌: చిత్తూరులో కరుణాకరన్‌ పేరు చెబితే తెలియనివాళ్లు ఉండరు. ప్రభు త్వాస్పత్రులు, పోలీస్‌ స్టేషన్లు, ఆశ్రమాల్లో, మున్సిపల్‌ కార్యాలయం, నాగాలమ్మగుడి వద్ద ఈయన పేరు చాలా ఫేమస్‌. చేసేది పోలీస్‌ ఉద్యోగమే. ఆర్ముడు రిజర్వు (ఏఆర్‌)లో పనిచేస్తుండడంతో జనరల్‌ డ్యూటీ, బందోబస్తు విధులే ఎక్కువగా ఉంటాయి. నగరంలో అనాథశవం కనిపించినా కరుణాకరన్‌ 9391665281కు ఫోన్‌ వస్తుంది. డ్యూటీ మధ్యలోనే వెళ్లాల్సి వస్తే ఏ ఒక్క అధికారీ అడ్డుచెప్పరు. చివరకు ఎస్పీ అయినా సరే భుజం తట్టి ప్రోత్సహిస్తుంటారు. తాను తయారు చేయించిన బండిలో మృతదేహాన్ని ఉంచి డప్పుల వాయింపులు.. టపాసులు పేలుస్తూ ఆడుతూ పాడుతూ అంత్యక్రియలు చేసేస్తారు. 28 ఏళ్లుగా అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తూనే ఉన్నాడు.

 తొమ్మిది నెలలుగా ప్రతిరోజూ మధ్యాహ్నం అనాథలు, అభాగ్యులకు ఉచితంగా భోజనం పెడుతున్నారు. ఆయన తల్లి, భార్య వంటచేసి అనాథలకు కడుపునిండా అన్నం పెడతారు. పెట్టడమే కాదు వీరితో పాటు కూర్చుని కుటుంబం మొత్తం ఇదే భోజనం తింటారు. ఇక సంతపేటలో తాను నమ్మినదైవం నాగాలమ్మకు చిన్నపాటి గుడికట్టించడం, ఉత్తర క్రియలు (దినాలు) చేసుకోవడానికి ఓ షెడ్డును ఏర్పాటు చేసి అందరికీ ఉచితంగా ఇవ్వడం కరుణాకరన్‌కు మాత్రమే సాధ్యమైన విజయాలు. తన సుదీర్ఘ పయనానికి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు మధుబాబు, గుప్త, ధనలక్ష్మి, దైవశిఖామణి, భద్ర, రవీంద్రారెడ్డి అండగా నిలు స్తున్నారు.

ఇంట్లో అడ్డుచెప్పరు..
అమ్మ ఇంద్రాణి. నాన్న రాధాకృష్ణ. సంతపేటలో ఓ చిన్న టీ అంగడి పెట్టుకుని రాధాకృష్ణ తన ఐదుగురు పిల్లల్ని పోషించేవారు. ఇందులో కంద (కరుణాకరన్‌) చివరివాడు. నాన్న టీ వేస్తూ ఉంటే స్కూల్‌కు వెళ్లొచ్చిన తర్వాత టీ అంగడి వద్దే ఎక్కువ సమయం గడిపేవాడు. 1980వ దశకంలో చుట్టుపక్కల ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని తాకడానికి ఎవరూ ముందుకొచ్చేవారుకారు. ఎవరూ లేకుంటే మున్సిపాలిటీ వారొచ్చి చెత్త ట్రాక్టర్‌లో శవాన్ని వేసుకుని వెళ్లిపోయేవారు. కరుణాకరన్‌ అప్పట్లో చూసిన ఈ ఘటనలు  మనసులో బలమైన ముద్ర వేశాయి. వయస్సు 20 ఏళ్లు చుట్టుపక్కల వాళ్లు ఎవరైనా చనిపోతే శ్మశానం వరకు వెళ్లి పిడికెడు మట్టివేయడం అలవాటయ్యింది.

అలా చేస్తే ఏదో తెలియని ఆనందం. మృతదేహాన్ని మోస్తూ కాటికి తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్న వారిలో మార్పు తీసుకురావాలనుకున్నాడు. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు ఎక్కడ ఎవరు చని పోయినా మంచి బట్టలు వేసుకుని శుభ్రంగా రెడీ అయ్యి వెళ్లడం, అందరి కంటే ముందు మృతదేహాన్ని మోస్తూ వెళ్లడం చేశాడు. ఎవరో చదువుకున్న కుర్రాడిలా ఉన్నాడు.. చూడ్డానికి బాగానే ఉన్నాడు. ఇతనే శవాన్ని మోస్తుంటే మనకేంటీ అనే ఆలోచన ఒక్కొక్కరి నుంచి అందరికీ అనిపిస్తూ సామాజిక మార్పును తెచ్చింది. ఇంటర్‌ వరకు చదివి 24 ఏళ్లకే పోలీస్‌ కానిస్టేబుల్‌గా సెలక్ట్‌ అయ్యాడు కంద. అమ్మా నాన్న చాలా ఆనందపడ్డారు. ఆ మరుసటి ఏడాది నాన్న చనిపోయాడు. ఏడాది తర్వాత దేవితో కందకు పెళ్లి జరిగింది.

 ఇద్దరు పిల్లలు. అమ్మాయి జ్యోతిప్రియ డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ తనకొచ్చే జీతంలో 25 శాతం పేదల కోసం ఖర్చుచేయమని నాన్నకు పంపుతుంటుంది. కొడుకు సాయి ధనుష్‌. ఇతను నగరంలోని ఓ కంపెనీలో పనిచేస్తూ నెలకు రూ.3 వేలు అక్కలాగే సేవా కార్యక్రమానికి ఇచ్చేస్తుంటాడు.  తానూ ఇందులో భాగమై అభాగ్యులకు వంటచేసి పెట్టి, వారి ఆకలి తీరుస్తుండటం భార్య దేవికి సంతోషం కలిగి స్తోంది. పిల్లల భవిష్యత్తు కోసం నాలుగు రూపాయలు దాచి ఉంచారా అని అడిగితే.. అందరికీ పెట్టడం మాత్రమే తెలిసిన తమకు ఎత్తిపెట్టుకోవాలనే ఆలోచన ఏనాడు రాలేదని చెబుతున్నాడీ మనసున్న పోలీసన్న.

ఆ రోజు కంట నీళ్లు..
18 ఏళ్ల క్రితం ఓ అనాథ శవానికి అంత్యక్రియలు చేయాలని కబురొచ్చింది. జేబులో రూపాయి కూడా లేదు.  స్నేహితుడొకడి ఇంటికి వెళ్లాడు. రూ.400 అప్పు ఇమ్మన్నాడు. ఎందుకని అడిగితే విషయం చెప్పాడు. అప్పు ఇచ్చినా కరుణాకరన్‌ చర్యల్ని వ్యతిరేకించాడు. దీంతో మూడు రోజుల తర్వాత డబ్బులు తిరిగిచ్చేసి ఆ స్నేహానికి ఓ దండం పెట్టి మరీ వచ్చేశాడు.

మరిన్ని వార్తలు