జిల్లా ప్రజలకు కానుకగా అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం

24 Aug, 2019 09:01 IST|Sakshi

రూ.5,600 కోట్లతో అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టు

చెన్నై, బెంగళూరు మధ్య ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా నెల్లూరు

కార్గో రవాణా వ్యవస్థ అభివృద్ధి 

నెల్లూరు– ఒంగోలు మధ్య అందుబాటులో అనుకూలం

సింహపురి ప్రజల చిరకాల వాంఛ విమానయానం యోగం త్వరలో నెరవేరనుంది. ఐటీ, పరిశ్రమలకు కేంద్రాలుగా ఉన్న చెన్నై, బెంగళూరుకు కూడలిగా నెల్లూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఉంది. నెల్లూరుకు అతి సమీపంలో కృష్ణపట్నం పోర్టు, పవర్‌ ప్రాజెక్ట్‌లతో పాటు విభిన్న జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల ఇంటిగ్రేటెడ్‌ సెజ్‌లు ఉన్నాయి. ప్రతిపాదిత విమానాశ్రయానికి సమీపంలో భారీ ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రం, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. ఇక్కడ నుంచి దేశ విదేశాలకు ప్రయాణ సౌకర్యం, కార్గో రవాణా వ్యవస్థ అభివృద్ధి సాధించనుంది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదన గత ప్రభుత్వ హయాంలో కేవలం రన్‌ వేగా మారింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లా ప్రజల కల సాకారం అవుతోంది.  

సాక్షి, కావలి: కావలి నియోజక వర్గంలోని దగదర్తి మండలం దామవరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పురుడు పోసుకున్న అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయ నిర్మాణం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా ప్రజలకు కానుకగా ఇవ్వనున్నారు. గత టీడీపీ పాలనలో విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియ క్రమక్రమంగా శల్యమై ఒక దశలో నిర్మాణ ప్రతిపాదనలు రద్దు ప్రకటనలు కూడా వచ్చాయి. అప్పటి ప్రతిపక్షంతో పాటు ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆఖరుకు కేవలం రన్‌వే నిర్మాణానికి అధికారం అంతిమ దశలో శంకుస్థాపన చేసి టీడీపీ చేతులు దులుపుకుంది. ప్రభుత్వం మార్పు జరగడంతో అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయంను అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నాయి.

కేంద్ర విమానాయానశాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ విభాగం దామవరం విమానాశ్రయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండం గమనార్హం. దేశంలో విమానాశ్రయాలను పర్యవేక్షించడం, విమానాల రాకపోకల సమయాలను నిర్ధారించడం, విమానాశ్రయాలకు విమానాలు ల్యాండింగ్‌ వసతి కల్పించడం వంటి కార్యకలాలన్నీ కూడా ‘ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ అధికారికంగా పన్యవేక్షిస్తోంది. దీని వల్ల దామవరం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని అదే సంస్థ చేపడితే అటు విమాన రాకపోకల సంఖ్యను మరిన్ని ఖరారు చేయడానికి, తద్వారా ప్రయాణికులకు సౌలభ్యత పెంచడం ద్వారా విమానాశ్రయం ప్రాధాన్యత పెరగడానికి దోహదపడుతుంది. కార్గో హ్యాండ్లింగ్‌ అంటే సరుకు రవాణా ద్వారా పెద్ద ఎత్తున జరగడానికి మార్గం సుగమం అవడం ద్వారా విమానాశ్రయం ఆర్థికంగా లాభాల బాట పట్టడానికి అవకాశం ఉంది.


దామవరం వద్ద నిర్మించే అంతర్జాతీయ విమానాశ్రయం నమూనా 

ఎయిర్‌ పోర్టు స్వరూపం
అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతానికి ప్లాన్‌ ప్రతిపాదనలను  ‘ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ రూప కల్పన చేసింది. ఈ విమానాశ్రయం కోసం మొత్తం 1379.71 ఎకరాలను భూసేకరణ చేయాల్సి ఉండగా, వాటిలో 1,061.095 ఎకరాల భూమిని భూసేకరణ ప్రక్రియ ముగిసింది. మిగిలిన 318.615 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.  ఈ భూమిపై కొన్ని వివాదాల నెలకొని ఉండటంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకొని అమలు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.
► ఈ  విమానాశ్రయం నెల్లూరుకు 30 కిలో మీటర్లు దూరంలో ఉత్తరం వైపున చెన్నై–విజయవాడ జాతీయ రహదారిపై పక్కనే దామవరం వద్ద నిర్మిస్తున్నారు. కావలికి 32 కిలో మీటర్లు, గూడూరుకు 52 కిలో మీటర్లు, 65 కిలో మీటర్లలో కందుకూరు (ప్రకాశం జిల్లా) పట్టణాలు ఉన్నాయి.
► విమానాశ్రయం నిర్మించే ప్రాంతంలో ఉత్తర–పడమర నడుమ 6 మీటర్ల ఎత్తులో  తిప్పలు ఉన్నాయి. అందుకే రన్‌ వే ను పడమర వైపు క్లోజ్‌ అయ్యేటట్లుగా, విమానాలు  తూర్పు వైపు నుంచి ల్యాండింగ్‌ అయ్యేటట్లుగా రన్‌ వే ను నిర్మించనున్నారు.
► 30 మీటర్లు వెడల్పు, 3,150 మీటర్లు పొడవు ఉండే రన్‌ వే ను నిర్మిస్తారు. 
► 2030 నాటికి ఏడాదికి 5 లక్షల మంది ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగిస్తారని అంచనా.
► 2045 నాటికి ఏడాదికి 19 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకొంటారని అంచనా వేశారు. 
► ప్రధానంగా కార్గో అంటే సరుకులు ఎగుమతి, దిగుమతులు పెద్ద ఎత్తున జరిగే విమానాశ్రయంగా దామవరం విమానాశ్రయం రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉందని నిపుణులు పేర్కొటున్నారు.
► విమానాశ్రయ పరిపాలన ప్రధాన భవనమైన ‘టెర్మినల్‌’ బిల్డింగ్‌ను 4,000 చదరపు మీటర్లు విస్తీర్ణంలో నిర్మిస్తారు. రెండు ప్రధాన గేట్లు ఉండే ఈ విమానాశ్రయంలో చెక్‌ ఇన్‌ కౌంటర్లు–8, బ్యాగ్‌ చెక్‌ కౌంటర్లు– 2 ఏర్పాటు చేయనున్నారు. 
► టెర్మినల్‌ బిల్డింగ్‌లో 1,400 మందికి వసతి ఉండేలా 10,000 చదరపు మీటర్లు ఉండే ఈ భవనాన్ని నిర్మించనున్నారు.
► విమానాశ్రయం చుట్టూ 10,762 మీటర్లు ప్రహరీ 3 మీటర్లు ఎత్తులో నిర్మించనున్నారు.

ప్రత్యేకతలు.. ప్రయోజనాలు
దామవరం వద్ద రూ.5,600 కోట్లతో నిర్మించనున్న భారీ విమానాశ్రయానికి ఎన్నో ప్రత్యేకతలు.. ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాపార రీత్యా లాభసాటిగా ఉంటుందనే విమానయాన రంగ నిపుణుల సూచనలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. జిల్లా కేంద్రమైన నెల్లూరుకు, ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు సమీపంలో ఉంది. దేశంలో విశిష్టత ఉన్న కోల్‌కత్తా– చెన్నై జాతీయ రహదారికి పక్కనే ఈ ఎయిర్‌పోర్టు ఉంది. విశాఖపట్నం–చెన్నై కోస్టల్, పరిశ్రమల కారిడార్‌ పరిధిలో ప్రాధాన్యత ఉన్న ప్రదేశంలో ఉంది. నిత్యం దేశ విదేశాల నౌకలు రాకపోకలతో ప్రైవేట్‌ నౌకాశ్రయాలకు వ్యాపార సవాల్‌ విసురుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్న కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఉంది. జాతీయ, అంతర్జాతీయ విభిన్న పరిశ్రమలతో ఇంటిగ్రేటెడ్‌ సెజ్‌గా ప్రఖ్యాతగాంచిన ‘శ్రీసిటీ’ సెజ్‌కు ఉపయోగపడనుంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో కావలికి సమీపంలోని రామాయపట్నం సముద్రతీరంలో ‘పోర్టు కమ్‌ షిప్‌ యార్డ్‌ (భారీ ఓడరేవు, నౌకా నిర్మాణ కేంద్రం) నిర్మాణ జరగడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అతి సమీపంలో కేవలం 25 కిలో మీటర్ల దూరంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. 

మరిన్ని వార్తలు