లింగాపుట్టులో పీహెచ్‌సీకి కృషి

16 Sep, 2014 00:40 IST|Sakshi
లింగాపుట్టులో పీహెచ్‌సీకి కృషి
  • త్వరలో రక్షిత తాగునీటి పథకం నిర్మాణం
  •  పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి హామీ
  •  మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
  •  బాధిత కుటుంబాలకు పరామర్శ
  • పాడేరు రూరల్ : మండలంలోని లింగాపుట్టు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి హామీ ఇచ్చారు. వరుసగా అంతుచిక్కని మరణాలతో బెంబేలెత్తిపోతున్న లింగాపుట్టు గ్రామాన్ని సోమవారం ఆమె సందర్శించారు. రెండు వారాల వ్యవధిలో మృతి చెందిన గిరిజనుల కుటుంబాలను ఆమె పరామర్శించి ఓదార్చారు.

    తాగునీటి పథకం మూలకు చేరడంతో, కలుషితమైన బావి నీటినే ఉపయోగిస్తున్నామని, రోగాలకు ఇదే కారణమని గిరిజనులు ఎమ్మెల్యే ఈశ్వరి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆమె తాగునీటి బావులను పరిశీలించారు. తోటలగొంది గ్రామం నుంచి పైపులైన్లను ఏర్పాటు చేసి రక్షిత తాగునీరందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

    ఐకేపీ అధికారుల జాడ కరువైందని, గిరిజనులు మృతి చెందుతున్నా ఆపద్బంధు పథకం కింద వారి పేర్లను నమోదు చేయడంలేదని బాధిత కుటుంబాలవారు తెలుపగా అధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే చెప్పారు. పారిశుద్ధ్య మెరుగుపరచాలని వీఆర్వోను ఆదేశించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించటంలో విఫలమైందని, ఫలితంగా ఇప్పుడు గిరిజనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.

    అంతుచిక్కని వ్యాధులతో మృతి చెందిన గిరిజనుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక్కడి మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి వివరిస్తానన్నారు. ఆమె వెంట ఇన్‌చార్జీ ఏడిఎంహెచ్‌వో డాక్టర్ లీలాప్రసాద్, మినుములూరు పీహెచ్‌సీ వైదాధికారి ఒ. గోపాలరావు, ఇన్‌చార్జి ఎంపీడీవో ఎ.వి.వి.కుమార్, పంచాయతీ విస్తరణాధికారి కె. వెంకన్నబాబు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు