ఆ కాస్తా నిర్మిస్తే..

12 Dec, 2013 00:29 IST|Sakshi

 ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ఇబ్రహీంపట్నం సమీపంలో వినోబానగర్ వద్ద ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవన నిర్మాణం పనులను పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భవన సముదాయానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు అవుతున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 126 ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని 2008లో ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో ఇబ్రహీంపట్నం, శంషాబాద్, వికారాబాద్, తాండూరు ప్రాంతాల్లో హాస్టళ్ల భవనాలను నిర్మించాలని సంకల్పించారు.
 
 ఒక్కో హాస్టల్ భవనానికి రూ.కోటీ 60 లక్షలు మంజూరయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర హాస్టళ్లన్నింటినీ ఒకే సముదాయంలో  ఉంచాలన్న ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వినోబానగర్ వద్ద భవన నిర్మాణానికి భూదాన్ భూమిని కేటాయించారు. ఫిబ్రవరి 19, 2009న అప్పట్లో గనుల శాఖా మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవ న నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటికీ అరకొర పనులు జరిగాయి. గ్రౌండ్‌ఫ్లోరులో కొన్ని భవనాల నిర్మాణం పూర్తి కాగా మొదటి ఫ్లోరులో భవనాల నిర్మాణాలు కేవలం స్లాబ్‌కే పరిమితమయ్యాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో, అధికారుల అలసత్వమో తెలియదు గానీ కొన్నాళ్లుగా పనులే జరగడం లేదు.
 
 ఇదిలా ఉండగా గ్రౌండ్‌ఫ్లోర్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాల్లోకి ఇబ్రహీంపట్నంలోని ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టళ్లను తరలించాలని అధికారులు ఇటీవలే నిర్ణయించారు. ఈ రెండు హాస్టళ్లలో దాదాపు 300 మంది బాలికలున్నారు. అయితే వీరికి గదులు సరిపోకపోవడంతోపాటు ఇతరత్రా పలు సమస్యలు ఎదురయ్యాయి. ఈ భవనాలకు ప్రహరీ   నిర్మించకపోవడం సమస్యగా మారింది. బాలికల హాస్టళ్లకు ప్రహరీ గోడలు తప్పనిసరి. దీంతో బాలికల హాస్టళ్ల తరలింపును విరమించుకున్నారు. ఇదిలాఉంటే హాస్టళ్లకు ప్రహరీలు నిర్మాణానికి కలెక్టర్ శ్రీధర్ కొన్నాళ్ల క్రితమే నిధు లు మంజూరు చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఒకరు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రహరీ  నిర్మాణం పనులు పూర్తికాగానే హాస్టళ్లను అక్కడికి తరలించడం జరుగుతుందన్నారు.
 

మరిన్ని వార్తలు