కొనసాగుతున్న టీడీపీ దౌర్జన్యాలు

20 Jul, 2019 08:20 IST|Sakshi
రోడ్డుకు అడ్డంగా మట్టి తోలిన రైతులు, ప్రభుత్వం ఆదేశించినా కొనసాగుతున్న రోడ్డు పనులు 

సొంత భూములకు ప్రత్యేక రోడ్డు నిర్మాణం

పనులు నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశించినా ఫలితం శూన్యం

మాజీ సీఎం చంద్రబాబు పీఏ మనోహర్‌ అనుచరుల దౌర్జన్యం

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినా కుప్పంలో ఆ పార్టీ నేతల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. ప్రధానంగా మాజీ సీఎం చంద్రబాబునాయుడు పీఏ మనోహర్‌ అనుచరులు ఓ రోడ్డు నిర్మాణంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. భూముల్లో అక్రమంగా రోడ్డు వేయరాదంటూ రైతులు అడ్డుపడుతున్నా వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతూ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు.

సాక్షి, కుప్పం: పట్టణ సమీపంలోని గుడుపల్లె మండలం నక్కనపల్లె రెవెన్యూకు సంబంధించి సర్వే నం.80లో మాజీ సీఎం చంద్రబాబునాయుడు పీఏ మనోహర్‌ ప్రధాన అనుచరుడు సుధాకర్‌కు 12 ఎకరాల భూమి ఉంది. దీనికి విలువ పెంచుకునేందుకు శాంతినగర్‌ నుంచి గుడుపల్లె రోడ్డు వరకు రూ.7 కోట్ల వ్యయంతో గత ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ మార్గంలో ఉన్న కొందరు రైతులు దీన్ని వ్యతిరేకించారు. టీడీపీ నేతల స్వలాభం కోసం తమ భూములు లాక్కుంటే సహించేది లేదంటూ గత ఏడాది ఆందోళనకు దిగారు.

అధికారం ఉందన్న అహంతో రోడ్డు నిర్మాణాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఆ 12 ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని నిర్ణయించారు. మనోహర్‌ అనుచరుడు కమతమూరు మాజీ సర్పంచ్‌ ప్రతాప్‌తో కలిసి ఆ పనికి ఉపక్రమించారు. రోడ్డుకు కోల్పోయిన భూములకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రోడ్డును మూసేసిన రైతులు
నష్టపరిహారం చెల్లించకపోగా తమకెలాంటి సమాచారం ఇవ్వకుండా గత ఏడాది రోడ్డు నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ కొందరు రైతులు రోడ్డుకు అడ్డంగా మట్టిపోసి అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనోహర్‌ అనుచరులు బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తోందని చెబుతున్నారు. సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.

ప్రభుత్వం ఆదేశించినా..
కుప్పం నియోజకవర్గంలో అక్రమంగా చేపడుతున్న పనులను నిలిపివేయాలని ప్రస్తుత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవేమీ ఖాతరు చేయకుండా టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి యథాతథంగా పనులు చేపడుతున్నారు. శాంతినగర్‌లో నివాస గృహాల మధ్య రోడ్డు వేస్తుండగా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినా లాభం లేకపోయింది.

వైఎస్సార్‌సీపీ నేతల పేర్లతో బ్లాక్‌మెయిల్‌
రోడ్డు నిర్మాణం చేపట్టకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే తమకు వైఎస్సార్‌ సీపీ నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయని, వారిచేత చెప్పిస్తామంటూ అధికారులను బెదిరించే పనిలో టీడీపీ నాయకులు ఉన్నారు. అధికారులకు కూడా ‘ఏంటిరా ఈ తలనొప్పి’ అనే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రూ.7 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి, కఠినంగా వ్యవహరించాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు