ఉర్దూ వర్శిటీ నిర్మాణంలో నత్తతో పోటీ !

22 Oct, 2019 09:37 IST|Sakshi
శ్లాబ్‌ దశలో ఉన్న అకడమిక్‌ బ్లాక్‌ 

నేటికీ సాగుతున్న ఉర్దూ వర్సిటీ భవన నిర్మాణం 

అద్దె భవనాల్లో కాలేజీని తలపిస్తున్న యూనివర్సిటీ 

సదుపాయాల లేమితో ఎంఎస్‌సీ జువాలజీ కోర్సులకు దూరం

సాక్షి, కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఉర్దూ విశ్వవిద్యాలయ సొంత భవనాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. నిర్మాణంలో జాప్యం జరిగేకొద్దీ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలగనుంది. ఈ ప్రాంతంలో ఎంఎస్‌సీ జువాలజీ కోర్సులకు బాగా డిమాండ్‌ ఉంది. గత విద్యా సంవత్సరంలో అనేక మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే యూనివర్సిటీ అధికారులు వారిని చేర్పించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేటు భవనాల్లో జువాలజీ కోర్సుకు అవసరమైన సదుపాయాలు లేవు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్, సైన్సెస్‌ కోర్సులతోనే విద్యార్థులు సర్దుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రత్యేకమైన క్రీడా మైదానం కూడా లేదు. విద్యార్థులు యూనివర్సిటీ ఆవరణను క్రీడా మైదానంగా ఉపయోగిస్తున్నారు. ఇందుకు నెలకు రూ.1.30 లక్షల సొమ్ము అద్దె చెల్లిస్తున్నా ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. సొంత భవనాల నిర్మాణం పూర్తయితే తప్పా విద్యార్థుల కష్టాలు తీరే మార్గం దరిదాపుల్లో కనిపించడం లేదు. 

నత్తనడకన పనులు 
ఈ విశ్వ విద్యాలయానికి ప్రముఖ విద్యావేత్త, ఉస్మానియా కళాశాల వ్యవస్థాపకుడు డాక్టర్‌ అబ్దుల్‌హక్‌ పేరు పెట్టారు. దీనికి సొంత భవనాలను పద్దెనిమిదవ జాతీయ రహదారిలో రాక్‌ గార్డెన్‌ ఎదురుగా 144 ఎకరాల సువిశాల ప్రదేశంలో నిర్మిస్తున్నారు. 2015 నవంబర్‌ 9న శంకుస్థాపన జరిగింది. నాలుగేళ్లు కావస్తున్నా పనులు ఇంకా నిర్మాణ దశలోనే ఉండడం గమనార్హం. పనులు నత్తనడకన సాగుతుండటంతో భవనాలు వచ్చే విద్యా సంవత్సరానికైనా సిద్ధమవుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అకాడమిక్‌ బ్లాక్‌ను యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.7.92 కోట్ల నిధులతో నిర్మిస్తున్నారు. నిర్మాణం రూఫ్‌ దశలో ఉంది. అలాగే 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 6.4 కోట్ల వ్యయంతో లేడీస్‌ హాస్టల్‌ బ్లాక్‌ నిర్మాణం కొనసాగుతుంది. దీన్ని జీ+2  తరహాలో నిర్మించాల్సి ఉంది.

వర్సిటీలో ఇంటర్నల్‌ రోడ్డు  

అయితే నిర్మాణం ఇంకా బేస్‌మట్టం దశలోనే ఉంది. అకాడమిక్‌ బ్లాక్, లేడీస్‌ హాస్టల్‌ పనులను హైదరాబాద్‌కు చెందిన ఆరో కన్‌స్ట్రక్షన్స్‌ వారు చేపట్టారు. ఆ కంపెనీ పనులను సబ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. సబ్‌కాంట్రాక్ట్‌ విధానం వల్లనే పనులు ఆలస్యమవుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. రూ. 2.4 కోట్ల వ్యయంతో యూనివర్సిటీలో ఆరు ఇంటర్నల్‌ రోడ్లు, డివైడర్ల నిర్మాణం చేపట్టారు. 2020, మే నాటికి భవనం పూర్తి చేసి విశ్వవిద్యాలయానికి అప్పగించాలనేది కాంట్రాక్టర్‌ ఒప్పందం. అదే జరిగితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త భవనంలో తరగతులు ప్రారంభించవచ్చు. 

వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త భవనంలో తరగతులు 
వచ్చేవిద్యాసంవత్సరం (2020–2021)లో తరగతులు కొత్త భవనంలో కొనసాగేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మే నెలలోనే పనులు పూర్తవుతాయి. భవనాన్ని కాంట్రాక్టర్‌ అప్పగించిన వెంటనే పరిపాలన, నిర్వహణ అక్కడే కొనసాగిస్తాం. కొత్త భవనంలో ఇంటిగ్రేటెడ్‌ సైన్స్‌ ఎంఎస్‌సీ కోర్సును ప్రవేశపెడతాం. ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సులో చేరితే ఐదేళ్లలో ఎంఎస్‌సీ పూర్తవుతుంది. 
–ముజఫర్‌అలీ, వీసీ

మరిన్ని వార్తలు