'తాపీ'గా లేరు!

9 Jul, 2020 12:58 IST|Sakshi

కరోనా దెబ్బకు కుదేలైన భవన నిర్మాణ రంగం

ఇతర పనులూ లేక కూలీల ఆకలి కేకలు  

ఉపాధి కోసం ఎదురు చూపులు

కరోనాకు తోడుగా వర్షాకాలం రాకతో పనులు నిల్‌

ప్రభుత్వంపైనే ఆశలు

కూలన్నా నీ ఆకలినెవరు తీర్చేరూ!బేల్దారన్నా నీ దాహమెవరు తీర్చేనూ!పనుల్లోన మేటి అన్నామెళకువల్లో సాటినీవన్నాతలెత్తుకుని నాడు బతికావుతలదించుకొని నేడు చితికావుతాపీ పడితేనే భవనాలు నిలబడెబొచ్చ..పార ఉంటేనే ఇల్లు పూర్తయ్యెపది అంతస్తులు కూడా నీ ముందు మోకరిల్లెఅపార్టుమెంట్లైనా సలాము చేసేఇంటిలోన పెళ్లాము బిడ్డలునీకోసము చూసేకరోనా సమయంలో  ఆకలితో అలమటించేఈ కోవిడ్‌కు కరుణలేదు.. జాలిలేదుచైనా దేశము నుంచి పగబట్టి వచ్చేనుఎప్పటికి పోతుందో ఈ జాడ్యముఎన్నటికి నశిస్తుందో ఈ దారిద్య్రము

ఒంగోలు వన్‌టౌన్‌: అందమైన భవనాలు, రంగుల మేడలు, అబ్బుర పరిచే నిర్మాణాల నైపుణ్యం వెనుక తాపీ మేస్త్రీ కృషి, కష్టం ఎంతో ఉంటుంది. లాక్‌డౌన్‌ ముందు చేతినిండా పని.. క్షణం తీరిక లేని వారి జీవితాల్లోకి కరోనా మహమ్మారి రావటంతో వారి బతుకులు తలకిందులయ్యాయి. ప్లాస్టింగ్‌ చేసినంత సాఫీగా వారి జీవితాలు లేవు. జిల్లా వ్యాప్తంగా కూలీలు, గుంతలు తీసేవారు, తాపీ మేస్త్రీలు, రాడ్‌బెండింగ్‌ పనులు చేసేవారు, సెంట్రింగ్‌ పనులు చేసేవారు. ప్లంబ్లర్లు, పెయింటర్లు, చెక్క పని చేసేవారు, ఎలక్ట్రీషియన్లు, గ్రిల్స్‌ చేసేవారు.. సీలింగ్‌ వర్క్‌ చేసేవారు, ఇలా రకరకాల పనులు చేసే కార్మికులున్నారు. ఇలాంటివారు మన జిల్లాలోనే 1, 47, 614 మంది పేర్లు సమోదు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నమోదు చేసుకోని వారు మరో 10 వేల మంది వరకు ఉండవచ్చుని అంచనా. కూలీలుగా ఇతర రాష్ట్రలకు పనులు నిమిత్తం వెళ్లేవారు 40 వేల మంది వరకు ఉంటారు. ప్రకాశం జిల్లాలో నిన్న మొన్నటి వరకు ఆర్బన్‌ ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మాణాలు జరిగేవి. ఎక్కువగా ఒంగోలు, కందుకూరు, చీరాల, మార్కాపురం ప్రాంతాల్లో గడిచిన 10 సంవత్సరాల నుంచి అపార్టుమెంట్‌ కల్చర్‌ బాగా పెరగడంతో కూలీలకు మేస్త్రీలకు చేతినిండా పని దొరుకుతోంది.

గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు మేస్త్రీలు కూలీలను తీసుకొని పనులకు వచ్చేవారు. ఎక్కువ రోజుల పని అయితే ఇతర జిల్లాలకు కూడా వెళుతుంటారు. ప్రస్తుతం పనులు లేక వారి జీవితాలు పూట గడవని పని కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా ముందు ప్రారంభమైన భవనాలు ప్రస్తుతం ప్రారంభించడానికి భవనా యజమానులు, బిల్డర్లు జంకుతున్నారు. కరోనాకు తోడు వర్షాకాలం కావడంతో నిర్మాణాలు చేపట్టరు. ఒకవేళ కట్టినా యజమానులకు, బిల్డర్లకు నష్టం తప్ప లాభాముండదు. దీంతో ప్లాస్టింగ్‌ పనులకే పరిమితమవుతారు. ప్రతిఏటా నవంబర్‌ నుంచి మే నెల వరకు భవనాలు నిర్మిస్తుంటారు. వార్షాకాలంలో భవనం లోపల పనులు చేపడుతుంటారు. ఇలా మూడు పువ్వులు, ఆరు కాయలుగా బతికిన జీవితాలు ఇప్పుడు పనుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. జనం దగ్గర నగదు లభ్యత లేక సిమెంట్‌ ఇటుక ధరలు పెరగటంతో నిర్మాణ రంగంపై భారం పడింది. వాటికి తోడు కరోనా వైరస్, వర్షాకాలం తోడవడంతో కార్మికుల భవిష్యత్తు మీద భరోసా కోల్పోయేలా చేసింది. ఇటుక మీద ఇటుక నిలబెట్టి అందమైన భవనాన్ని నిర్మించిన చేతులు ఈ రోజు పనికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. లాక్‌డౌన్‌ సడిలింపుల తర్వత దేశవ్యాప్తంగా భవన నిర్మాణం మొదలు కాలేదు. కరోనా భయం పెరగటంతో ఇప్పుడు బిల్డర్లు కన్‌స్ట్రక్షన్‌ ఊసే ఎత్తటం లేదు. మేస్త్రీలను నమ్ముకుని రోజూ కూలీలకు వెళ్లే కూలీల పరిస్థితి దారణంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నెలలో వారం రోజుల పని కూడా దొరకటం కష్టంగా మారింది.

అప్పులతో కుస్తీ..
ప్రస్తుతం కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి పనులు దొరికినప్పుడు అప్పులు తీర్చుకుందాములే అన్న ఆశతో బతుకుతున్నారు. భవనాల నిర్మాణంలో క్షణం తీరిక లేకుండా పని చేసిన చేతులు నేడు పని కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొద్దిగా స్థిర పడిన వారి పరిస్థితి పర్వలేదు గానీ.. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు, వ్యాపారస్తులు నిర్మాణాలపై కాకుండా ఇంటి ఖర్చులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో చిన్న రిపేర్లు వస్తే మేస్త్రీ వచ్చేదాకా అదేపనిగా ఫోన్లు చేసేవారు. కానీ ఇప్పుడు ఒక్క కూలీ, ఒక్క మేస్త్రీతో మాత్రమే చేయించుకుంటున్నారు. ఈ కరోనా కష్టం వర్షాకాలం తర్వాత అయినా పోదా అని ఎదురు చూస్తున్నారు.

మరి కొంత సమయం పడుతుంది
నిత్యం పనులతో సంతోషంగా ఉండే మేస్త్రీలు, కూలీల పరిస్థితి ప్రస్తుతం ఆశా జనకంగా లేదు. కరోనా ముందు పనుల కోసం మేస్త్రీ ఇంటికి వచ్చి తీసుకొని వెళ్లేవారు. ఒక్క అపార్టుమెంట్‌ పనికి వెళ్తే సుమారు 6 నెలల వరుకు చేతి నిండా పని ఉంటుంది. ప్రస్తుతం పనులు కోసం కూలీలు, మేస్త్రీ ఎదురు చూస్తున్నారు.

కూలీలను ప్రభుత్వమే ఆదుకోవాలి
రెక్కాడితే డొక్కాడని పరిస్థితి కూలీలది. 4 నెలలుగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రేషనే దిక్కుగా మారింది. కూలీలకు పని ఉంటే ఎంత దూరం అయినా వెళ్లి పని చేసేవారు. ప్రస్తుతం చేద్దామన్న పని దొరకటం లేదు. ప్రభుత్వమే పనులు కల్పించేల చర్యలు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు