ఆంధ్రప్రదేశ్‌లో అద్భుత పథకాలు

12 Mar, 2020 04:48 IST|Sakshi
బుధవారం కెనడా కాన్సుల్‌ జనరల్‌ నికోల్‌ గిరార్డ్‌కు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు అభినందనీయం

సీఎం వైఎస్‌ జగన్‌తో కెనడా కాన్సుల్‌ జనరల్‌ నికోల్‌ గిరార్డ్‌ బృందం భేటీ  

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని కెనడా కాన్సుల్‌ జనరల్‌ నికోల్‌ గిరార్డ్‌ ప్రశంసించారు. వివిధ రంగాల్లో అవకాశాలను గుర్తించి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. స్మార్ట్‌ సిటీ, ఫార్మా రంగాలపై ఆసక్తి వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కెనడా కాన్సుల్‌ జనరల్‌ నికోల్‌ గిరార్డ్, కాన్సుల్‌ సీనియర్‌ ట్రేడ్‌ కమిషనర్‌ మార్క్‌ ష్రోటర్, ట్రేడ్‌ కమిషనర్‌ విక్రం జైన్‌ సమావేశమయ్యారు.
ముఖ్యమంత్రి నివాసంలో వైఎస్‌ జగన్‌తో భేటీ అయిన కెనడా కాన్సుల్‌ జనరల్‌ నికోల్‌ గిరార్డ్‌ బృందం 

కెనడా, ఏపీలో శక్తివంతమైన నాయకత్వం
భారత్, కెనడాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని, వాణిజ్యాన్ని పెంచుకోవడంతోపాటు వాతావరణ మార్పులపై ఇరు దేశాలు ఇప్పటికే కలసి పని చేస్తున్నాయని గిరార్డ్‌ గుర్తు చేశారు. భారత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌తో తమ బంధాన్ని దృఢం చేసుకునేందుకు వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని, వ్యాపార సంబంధాలను పెంచుకుని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అటు కెనడాలో ఇటు ఏపీలో ఉన్న డైనమిక్‌ లీడర్‌షిప్‌ దీనికి దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో ముఖ్యమంత్రి జగన్‌ చేపడుతున్న కార్యక్రమాల గురించి మీడియా ద్వారా తెలుసుకున్నానని గిరార్డ్‌ పేర్కొన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా ఈ బాటలో నడుస్తుండడం అభినందనీయమన్నారు. ‘అమ్మ ఒడి’ ద్వారా 82 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరడం చాలా మంచి కార్యక్రమమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి సీఎంని అడిగి తెలుసుకున్నారు. అధికారం చేపట్టిన 9 నెలల వ్యవధిలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పథకాల గురించి ముఖ్యమంత్రి జగన్‌ వారికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం ఏం చెప్పారంటే...
- విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలే ప్రాధాన్యతగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. 
- పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించేందుకు ‘అమ్మ ఒడి’ అమలు చేశాం.
- ‘నాడు–నేడు’ ద్వారా స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో మౌలిక వసతులను మెరుగుపరచి ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నాం.
నిరక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించడం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికను పెంచే లక్ష్యంతో పని చేస్తున్నాం.
- మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పెంచాం.
- ప్రభుత్వ పథకాలు, సేవలను ఇంటివద్దే అందచేసేందుకు గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ప్రవేశపెట్టి సమూల మార్పులు తెచ్చాం.
వచ్చే 1–2 సంవత్సరాల్లో గ్రామ సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలుపెడతాం.
ఆస్పత్రుల్లో నాడు –నేడు కార్యక్రమంతోపాటు చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు, ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా 24 గంటల వైద్య సేవలు పెను మార్పులకు నాంది పలుకుతాయి.
రానున్న పదేళ్లలో హైదరాబాద్‌ లాంటి నగరాలతో పోటీపడేలా విశాఖను తీర్చిదిద్దుతాం.
- ఐటీ, అత్యాధునిక టెక్నాలజీని ప్రోత్సహించేందుకు విశాఖతోపాటు సెంట్రల్‌ ఆంధ్రా, అనంతపురం, తిరుపతిని అభివృద్ధి చేస్తాం.
- రాయలసీమలో కరువు నివారణ చర్యలతోపాటు సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను కృష్ణాకు తరలించే భారీ ప్రాజెక్టుపై కసరత్తు ప్రారంభించాం.

ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: సీఎస్‌ 
సుదీర్ఘ తీరప్రాంతమున్న ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని, వీటిని వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కెనడా ప్రతినిధి బృందాన్ని కోరారు. కెనడా కాన్సుల్‌ జనరల్‌ నికోల్‌ గిరార్డ్‌ సచివాలయంలో సీఎస్‌ను కలిశారు. విద్య, వైద్య రంగాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని సీఎస్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు