మల్టీప్లెక్స్‌లకు మొట్టికాయ

10 Aug, 2018 03:14 IST|Sakshi

అధిక ధరలకు అమ్మడంపై వినియోగదారుల ఫోరం ఆగ్రహం

కూల్‌డ్రింక్స్‌ కంపెనీలకు రూ.25 లక్షల జరిమానా 

ఐదు సంస్థలకు రూ.ఐదేసి లక్షల చొప్పున వడ్డింపు

బయటి తినుబండారాలను లోపలికి అనుమతించాలని ఆదేశం  

విజయవాడ లీగల్‌: మల్టీప్లెక్స్‌లలో అధిక ధరలకు కూల్‌డ్రింక్స్‌ అమ్మకాలు సాగించడంపై కృష్ణా జిల్లా వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్కెట్‌లో ఒక ధరతో, మల్టీప్లెక్స్‌లో మరో ధరతో కూల్‌డ్రింక్స్‌ అమ్మినందుకు వాటి తయారీ సంస్థలకు భారీ జరిమానా విధించింది. రూ.ఐదేసి లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని ఐదు కూల్‌డ్రింక్స్‌ తయారీ కంపెనీలను ఆదేశించింది. అదే సమయంలో మల్టీప్లెక్స్‌లకు సైతం మొట్టికాయలు వేసింది. తినుబండారాలు, మంచి నీళ్ల బాటిళ్లను లోపలికి అనుమతించాలని.. వినియోగదారులకు మంచి నీరు అందుబాటులో ఉంచాలని మల్టీప్లె్లక్స్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు కృష్ణా జిల్లా వినియోగదారుల ఫోరం–2 అధ్యక్షుడు సీహెచ్‌ మాధవరావు గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. తినుబండారాలు, కూల్‌డ్రింక్స్, వాటర్‌ బాటిళ్లను ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని గతేడాది ఏప్రిల్‌ 2న విజయవాడకు చెందిన గరికపాటి ప్రభాకరరావు గాంధీనగర్‌లోని ఐనాక్స్‌ థియేటర్‌పై, వేమూరి వెంకట శ్రీరామ్‌కుమార్‌ పటమటలోని ఐనాక్స్‌ థియేటర్‌పై, లింగారెడ్డి విద్యాప్రకాష్‌.. ట్రెండ్‌సెట్‌పై, బి.నరసింహమూర్తి పీవీఆర్‌పై, చెన్నుపాటి మణినాగేందర్‌ పీవీపీ మాల్స్‌పై వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశారు.

మల్టీప్లెక్స్‌లతో పాటు కోకోకోలా, పెప్సీ, కిన్లే, రెడ్‌ బుల్, పల్పీ ఆరెంజ్‌.. అలాగే తూనికలు, కొలతల శాఖ అధికారులను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఫిర్యాదును విచారించిన వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు.. కూల్‌డ్రింక్స్‌ కంపెనీలు, మల్టీప్లెక్స్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలు వసూలు చేసిన కోకోకోలా, పెప్సీ, కిన్లే, రెడ్‌బుల్, పల్పీ ఆరెంజ్‌ కంపెనీలకు రూ.ఐదేసి లక్షల చొప్పున మొత్తం రూ.25 లక్షల  జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని స్పష్టం చేశారు.

సెలెక్ట్‌ చానల్‌ పేరిట తినుబండారాలు, పానీయాలపై మార్కెట్‌ ధర కంటే అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని.. 9 శాతం వడ్డీతో సహా ఫిర్యాదుదారులకు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ధరల పట్టిక అందరికీ కనిపించాలని, వినియోగదారులు ఫిర్యాదు చేయడం కోసం అధికారుల నంబర్లు ఏర్పాటు చేయాలని.. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్‌కు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు