ఒప్పందం మేరకే రుణమివ్వాలి

28 Feb, 2014 00:50 IST|Sakshi

రియాల్టీ రంగంపై బ్యాంకులకు స్పష్టం చేసిన ఫోరం  
ఐసీఐసీఐకి మొట్టికాయ
 
 సాక్షి, హైదరాబాద్: రియల్టర్, వినియోగదారుడు, బ్యాంకు చేసుకున్న ఒప్పందం మేరకు నిర్మాణ దశకు అనుగుణంగా మాత్రమే రుణం మొత్తాన్ని విడుదల చేయాలని రాష్ట్ర వినియోగదారుల ఫోరం బ్యాం కులకు స్పష్టం చేసింది. అలా కాకుండా రియల్టర్ పరపతి మేరకు నిర్మాణ దశను పట్టించుకోకుండా విడుదల చేసిన మొత్తాన్ని విని యోగదారుని నుంచి వసూలు చేసే అధికారం బ్యాంకులకు ఉండదని తేల్చిచెప్పింది. వినియోగదారునితో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా, నిర్మాణ దశను పరిశీలించకుండా హిల్‌కౌంటీ యాజమాన్యానికి రూ.63.90లక్షలు విడుదల చేసిన ఐసీఐసీఐ తీరుపై ఫోరం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి బ్యాంకు రుణం మంజూరు చేయడాన్ని సేవల్లో లోపంగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. ఒప్పందానికి విరుద్ధంగా విడుదల చేసిన రుణానికి ఈఎంఐలను వసూలు చేసే హక్కు సదరు బ్యాంకుకు ఉండదని తెలిపింది.

 

అయితే పిటిషనర్ బ్యాంకును ప్రతివాదిగా పేర్కొనని కారణం గా.. రూ.63.90 లక్షలను 12 శాతం వడ్డీతో, పరిహారంగా మరో రూ.లక్షను నాలుగు వారాల్లో చెల్లించాలని మేటాస్ హిల్‌కౌంటీ యాజమాన్యాన్ని ఆదేశించింది. హిల్‌కౌంటీతో చేసుకున్న ఒప్పందం మేరకు తాను ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణం తీసుకొని డబ్బు చెల్లించినా ఫ్లాట్ నిర్మాణం పూర్తి చేయలేదని, తాను చెల్లించిన రూ.63.90 లక్షలను తిరిగి ఇప్పించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన కృష్ణచైతన్య దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఫోరం ఈ మేరకు తీర్పునిచ్చింది. 2009 ఫిబ్రవరి నాటికి నిర్మాణం పూర్తిచేసి అప్పగించాల్సి ఉందని, అయితే సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు అరెస్టుతో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందని పిటిషనర్ ఆరోపించారు.
 

>
మరిన్ని వార్తలు