సేవా లోపంపై ‘కొటక్‌’కు భారీ వడ్డన

31 Jul, 2019 08:35 IST|Sakshi

ఇల్లు అప్పగించడంతోపాటు రూ.4 లక్షల జరిమానా చెల్లించాలి

 వినియోగదారుల మండలి సంచలన తీర్పు  

సాక్షి, విశాఖ ‌: వినియోగదారునికి సేవా లోపం కలిగించినందుకు నష్టపరిహారం చెల్లించాలని నగరంలోని 2వ వినియోగదారుల మండలి అధ్యక్షురాలు చావలి సూర్య భాస్కరం మంగళవారం తీర్పునిచ్చారు. వినియోగదారుడు తనఖా పెట్టిన ఇంటిని తక్షణమే విడుదల చేయాలని, చెల్లించిన లక్షా 15వేలు తిరిగి చెల్లించాలని, నష్టపరిహారం కింద రూ.4 లక్షలు, కోర్టు ఖర్చులకు మరో 2,500 ఇవ్వాలని నగరంలోని వాల్తేరు ప్రాంతంలోని కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌ని ఫోరం ఆదేశించింది. బాధితులు ఎస్‌.వినీత్‌ (3) విజయశ్రేయల్‌(4)ల తరఫున వారి పెద్దనాన్న డాక్టర్‌ ఎస్‌. శ్రీనివాసరావు ఫిర్యాదు దాఖలు చేశారు. 

కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. చిన్నారుల తండ్రి ఎస్‌.విజయ్‌కుమార్‌ (శ్రీనివాసరావు సోదరుడు) మధురవాడ దగ్గర ఎఆర్‌ ఎన్‌క్లేవ్‌లో 2015 నవంబర్‌ నెలలో ఫ్లాట్‌ కొనుగోలు చేశారు. ఇందుకోసం కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌ వాల్తేరు శాఖలో రూ.22 లక్షలు అప్పుగా తీసుకున్నారు. పూచీకత్తుగా విజయ్‌కుమార్‌ భార్య ఎన్‌.శాంతిరత్నం ఉన్నారు. ఇంటిపై అప్పు తీసుకున్నప్పుడే ఐసీఐసీఐ లంబా బీమా కంపెనీలో బీమా చేయించారు. ఈ నేపథ్యంలో శాంతిరత్నం 2017 ఫిబ్రవరి 11వ తేదీన గుండె పోటుతో మరణించారు. తర్వాత నెల రోజులకే విజయ్‌కుమార్‌ కూడా తనువు చాలించాడు. ఇద్దరు పిల్లలకు  పెద్దనాన్న శ్రీనివాసరావే ఆసరా అయ్యారు. రుణం వాయిదాలు చెల్లించాల్సిందేనంటూ బ్యాంక్‌ సిబ్బంది చేసిన ఒత్తిడితో అతను లక్షా 15వేలు చెల్లించారు.

ఇంటిని బీమా చేయించిన విషయం తెలియడంతో సంబంధిత పత్రాలను తన న్యాయవాది ఏవీసీఎన్‌ నాగేశ్వరరావు ద్వారా ఫోరంకి సమర్పించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇంటిపై అప్పుతీసుకుని, తనఖా పెట్టినప్పుడు బీమా కలిగి ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. బీమా అమల్లో ఉన్న సమయంలో రుణగ్రహీత, జామీనుదారురాలు మృతి చెందినందున బీమా కంపెనీయే రుణం చెల్లించాలన్నారు. బీమా కంపెనీ నుంచి బ్యాంక్‌ డబ్బులు తీసుకోవాలన్నారు. ప్రధాన వ్యక్తులు ఇద్దరూ మృతి చెందిన నాటికి బీమా అమల్లో ఉన్నా ఆ విషయాన్ని బ్యాంకు దాచిపెట్టడాన్ని ఫోరం ఆక్షేపించింది. తాకట్టులో ఉన్న ఇంటిని తక్షణమే రద్దుచేసి బాధితులకు అప్పగించాలని తీర్పులో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు