అభివృద్ధిలో సింగపూర్‌తో పోటీ: సీఎం

18 Nov, 2017 01:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: అభివృద్ధిలో దూసుకుపోతున్న సింగపూర్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు సింగపూర్‌ ముఖద్వారంగా వుందని, అక్కడ అమలు చేసే ఉత్తమ విధానాల్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు. సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి ఈశ్వరన్‌తో కలసి శుక్రవారం సచివాలయంలో స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టుపై నిర్వహించిన జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ(జేఐఎస్‌సీ) రెండో సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని పేరుతో ఒక కాంక్రీట్‌ జంగిల్‌ నిర్మించాలనుకోవట్లేదని, ఇక్కడి సహజసిద్ధమైన వనరుల్ని ఉపయోగించుకుంటూనే ఆధునిక టెక్నాలజీతో అద్భుత రాజధాని నిర్మించాలనేది తమ ప్రయత్నమని చెప్పారు. రాబోయే రోజుల్లో అమరావతిలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. త్వరలో 1,500 ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. 

విమాన సర్వీసులు ప్రారంభించండి.. 
సింగపూర్‌–విజయవాడ మధ్య వారంలో కనీసం మూడు విమాన సర్వీసులు ప్రారంభించాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సింగపూర్‌ ప్రభుత్వాన్ని కోరారు. అమరావతిలో ఉష్ణోగ్రతల్ని తగ్గించే డిస్ట్రిక్‌ కూలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సింగపూర్‌ డిస్ట్రిక్‌ కూలింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జిమ్మీ ఖూకు సూచించారు.
 

మరిన్ని వార్తలు