కొలువుల కోలాహలం

24 Jul, 2019 08:02 IST|Sakshi

డీఎస్సీ–18 పోస్టుల భర్తీకి కొనసాగుతున్న కసరత్తు 

ఆన్‌లైన్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టుల ఎంపిక జాబితా విడుదల

ధ్రువపత్రాల అప్‌లోడింగ్‌ నేడు, రేపు

26, 27 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన

జిల్లాలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. కొత్త ప్రభుత్వం ఆవిర్భావం నుంచి వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల్లో నియామకాలకు చర్యలు తీసుకుంటోంది.  గ్రామీణ, వార్డు స్థాయిలో వలంటీర్ల నియామకం... మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కల్పన... ఇంకోవైపు పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న బిల్లు ఆమోదానికి సిద్ధమవడం... ఇలా నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా పాలన సాగుతోంది. తాజాగా పెండింగ్‌లో ఉన్న డీఎస్సీల పరిష్కారానికీ చర్యలు తీసుకుంటుండగా... 2018 డీఎస్సీలో ఎంపికైనవారి నియామకాలకు చర్యలు ఊపందుకున్నాయి. 

సాక్షి, విజయనగరం అర్బన్‌: జిల్లాలో భర్తీ కానున్న కొత్త గురువుల నియామక కసరత్తు కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లోనే ఉపాధ్యాయ నియామకాల షెడ్యూల్‌కు పచ్చ జెండా ఊపింది.  అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే మోడల్‌ స్కూళ్లకు చెందిన నియామకాల ప్రక్రియ సాగింది. ఆ తరువాత నిర్వహించాల్సిన స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్ల షెడ్యూల్‌ తేదీల్లో స్వల్ప మార్పుతో పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రాథమిక జాబితాను జిల్లాలకు పంపి రోస్టర్‌ పాయింట్లతోపాటు ఇతర సాంకేతిక పరమైన అంశాలను సరిచేయించుకొని తుది పరిశీలన చేసుకుంది. అనంతరం తిరిగి తుది జాబితాను ‘ఏపీడీఎస్‌సీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఐఎన్‌’ వెబ్‌ సైట్‌లో మంగళవారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తరువాత ప్రక్రియ కొనసాగించే షెడ్యూల్‌ను ప్రకటించింది.

నేడు, రేపు ధ్రువపత్రాల అప్‌లోడింగ్‌
డీఎస్సీ జిల్లా కమిటీ పరిశీలన తరువాత ఎంపికైన తుది జాబితా అభ్యర్థుల వివరాలు పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్‌ కార్యాలయం మంగళవారం సంబంధిత వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ ప్రక్రియను ఈ నెల 24, 25వ తేదీల్లో అభ్యర్థులు పూర్తి చేయాలి. తొలుత దరఖాస్తు చేసుకున్న సమయంలో నమోదు చేసిన విద్యార్హతలు, ఇతర ధ్రువపత్రాల ఒరిజినల్‌ కాపీలను స్కాన్‌ చేసి సంబంధింత వెబ్‌సైట్‌లో క్రోడీకరించాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ నెల 24, 25వ తేదీల్లో అవకాశం కల్పించారు. వాటిని పాఠశాల విద్యా కమిషనరేట్‌ పరిశీలించాక చివరి రోజున తిరిగి మరో జాబితాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.

అర్హత ధ్రువపత్రాలు తప్పనిసరి
డీఎస్సీ–2018 నోటిఫికేషన్‌ విడుదల తరువాత తొలుత దరఖాస్తు చేసుకున్న సమయంలో అభ్యర్థి నమోదు చేసుకున్న విద్యార్హత, ఇతర అర్హతల ధ్రువపత్రాలను విధిగా స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థికి చెందిన సంబంధిత ధ్రువపత్రాల్లో ఏ ఒక్కటి లేకపోయినా తరువాత ప్రకటించిన తుది జాబితా నుంచి తీసేస్తారు. ధ్రువపత్రాలు అందుబాటులో లేని పరిస్థితుల్లో గడువు కావాలంటే పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ కార్యాలయానికి నేరుగా కలిసి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. గతంలో  ఇలాంటి అనుమతులను ఇచ్చే అధికారం జిల్లా స్థాయి డీఎస్సీ కమిటీకి ఉండేది. గత డీఎస్సీల్లో ఇలాంటి వ్యవహారంలో పలు అక్రమాలు చోటు చేసుకోవడంతో దానిని దృష్టిలో పెట్టుకొని ఈ నియామకాల్లో జిల్లా స్థాయి డీఎస్సీ కమిటీకి ఆ అధికారం ఇవ్వలేదని తెలుస్తోంది.

26, 27 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన
ధ్రువపత్రాల అప్‌లోడింగ్‌ ప్రక్రియను    రెండు రోజుల్లో పూర్తి చేసుకున్న తరువాత చివరి రోజు రాత్రి మరోసారి ఎంపిక జాబితాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఆ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 26, 27 తేదీల్లో ధ్రువపత్రాలను జిల్లా విద్యాశాఖ నేరుగా పరిశీలిస్తుంది. ఈ ప్రక్రియను స్థానిక సెయింట్‌ ఆన్స్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఆయా తేదీల్లో నిర్వహిస్తామని డీఈఓ జి.నాగమణి తెలిపారు. పరిశీలన కోసం సంబంధిత ధ్రువపత్రాల ఒరిజినల్స్‌తోపాటు గెజిటెడ్‌ అటెస్టెడ్‌ జెరాక్స్‌ సెట్‌లు మూడు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు రెండింటిని తీసుకొని అభ్యర్థులు హాజరుకావాలని ఆదేశించారు.ఎవరు ఎప్పుడు హాజరుకావాల్సి ఉంటుందన్నది వారి మొబైల్స్‌కు సమాచారం అందజేస్తామని వివరించారు.

జిల్లాలో 377 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు
డీఎస్సీ నియామకాల్లో భర్తీ అయ్యే కేటగిరీల్లో అన్నీ కలిపి 377 ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ యాజమాన్యాలలో 170, మున్సిపాలిటీల్లో 64, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 143 ఉన్నాయి. ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ కేటగిరీ పోస్టులను భర్తీ చేసేందుకు షెడ్యూలును విడుదల చేశారు. ఇది పూర్తయిన తరువాత తదుపరి ఎస్‌జీటీల నియామక ప్రక్రియ ఆరంభం కానుంది. 

కోర్టు కేసుల్లో ఉన్నవి మినహాయించి...
ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టుల్లో గణితం, ఆంగ్లం, భౌతిక, జీవశాస్త్రాలు, సాంఘిక శాస్త్ర సబ్జెక్టులకు సంబంధించి భర్తీ చేస్తారు. కోర్టు కేసుల్లో ఉన్న భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను ప్రస్తుతం భర్తీ చేయరు. వీటి విషయంలో స్పష్టత వచ్చిన తరువాత మాత్రమే చర్యలు చేపడతారు.  

మరిన్ని వార్తలు