కొనసాగిన ఆక్రమణల తొలగింపు

1 Feb, 2015 02:28 IST|Sakshi

విజయనగరం క్రైం: జిల్లా కేంద్రంలో రోడ్డు ఆక్రమణల తొలగింపు పనులు మూడో రోజైన శనివారం కూడా కొనసాగాయి. రైల్వే స్టేషన్ రోడ్డు, జిల్లా పరిషత్ కార్యాలయం పక్కనున్న బడ్డీలు, సున్నంబట్టి, సీఎంఆర్ ఎదురుగా ఉన్న తాటాకులు ఇళ్లు,   నాయుడు ఫంక్షన్ హాల్ నుంచి ఎన్‌సీఎస్ థియేటర్ మీదుగా రూరల్ పోలీసు స్టేషన్‌కు వరకున్న ఆక్రమణలను ప్రొక్లయినర్లతో తొలగించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ స్థలాలను ఆక్రమించిన షాపులను టౌన్ ప్లానింగ్ అధికారులు రాజేశ్వరరావు, ఎ.లక్ష్మణరావు ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రూరల్ సీఐ ఎ.రవికుమార్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ ఎస్సై టి.కామేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్సై ఎస్.అమ్మినాయుడు, ఏఎస్సై ఎ.ఎం.రాజు, టూటూన్ ఏఎస్సై ఎల్.ఈశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. జిల్లా పరిషత్  కార్యాలయం నుంచి లీలామహల్ వరకు రోడ్డుపై ఉన్న షాపులను యజమానులే స్వచ్ఛందంగా తొలగించారు.  
 
 ప్రజల సౌకర్యార్థమే..
 ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రజల సౌకర్యార్థమే ఆక్రమణలను తొలగిస్తున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారి రాజేశ్వరరావు తెలిపారు. చాలామంది కాలువలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల మురుగు నీరు నిల్వ ఉండిపోతోందన్నారు. ప్రభుత్వ స్థలాలను ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవన్నారు.
 
 ప్రత్యామ్నాయం  చూపించాలి  
 తొలగింపు పనులు చేపడుతున్న అధికారులు తమకు ప్రత్యామ్నాయం చూపించాలని దళిత సంక్షేమ సంఘ అధ్యక్షుడు జి. సత్యనారాయణ, పళ్ల దుకాణాలు నిర్వహించే  పలువురు మహిళలు కోరుతున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆర్. సోమనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది ఆర్టీసీ కాంప్లెక్స్  ఎదురుగా తోటపాలానికి వెళ్లే రోడ్డుపై ఆక్రమణలు తొలగించారు. దీంతో వారందరూ కమిషనర్ వద్దకు చేరుకుని తమకు ప్రత్యామ్నాయం చూపించకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ నిబంధనల మేరకే ఆక్రమణలు తొలగిస్తున్నామని చెప్పారు.  
 

మరిన్ని వార్తలు