మూడ్రోజులు భారీ వర్షాలు

18 Sep, 2019 08:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ నెల 18న  కోస్తాంధ్రలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ నెల 20, 21 తేదీల్లో కోస్తాంధ్రలోని  తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది. దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.  కాగా, ఆళ్లగడ్డలో 18 సెం.మీ, ఒంగోలులో 14,  రుద్రవరంలో 13, దోర్నిపాడు, బత్తులపల్లిలో 12, శింగనమలలో 10, సింహాద్రిపురంలో 9, నంద్యాల, కోయిలకుంట్లలో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

మరిన్ని వార్తలు