వైఎస్‌ జగన్‌ ఎదుట సమస్యల వెల్లువ

13 Oct, 2018 11:58 IST|Sakshi
వైఎస్‌ జగన్‌ను కలిసిన సాక్షర భారత్‌ కోఆర్డినేటర్లు

సాక్షి, గజపతినగరం: ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎదుట ప్రజలు తమ సమస్యల్ని ఏకరువు పెట్టారు. రాజకీయ కారణాల వల్ల తమను ఉద్యోగాల నుంచి తొలగించడం వల్ల ఉపాధి లేకుండా పోయిందని, కోర్టు ఆదేశాలను సైతం అమలు చేయడం లేదని ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. అలాగే సాక్షరభారత్‌ కోఆర్డినేటర్లు కూడా తమ సమస్యల్ని వైఎస్‌ జగన్‌ ముందుంచారు. ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమను ఉద్యోగాల నుంచి తొలగించారని జగన్‌కు చెప్పుకున్నారు.

పెండింగ్‌ జీతాలు కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఎన్నిసార్లు ధర్నాలు, ఆందోళనలు చేసినా ప్రభుత్వం హామీ ఇవ్వడం తప్ప ఫలితం లేకుండా పోయిందని సాక్షర భారత్‌ కోఆర్డినేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.  అన్ని అర్హతలున్నా ప్రస్తుత ప్రభుత్వంలో ఫించన్లు రావడం లేదని, కేవలం రాజకీయ కారణాల వల్ల తమకు ఫించన్లు రాకుండా చేస్తున్నారని వృద్ధులు, వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో తమకు పింఛన్లు సక్రమంగా వచ్చేవని, ఆ మంచి రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నట్లు వైఎస్‌ జగన్‌ని కలిసి చెప్పారు.
 

మరిన్ని వార్తలు