కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం

13 Dec, 2017 13:25 IST|Sakshi

వైఎస్ఆర్ హయాంలో 7,114 మందిని రెగ్యులరైజ్ చేశారు

అనంతరం ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు

ఉద్యోగుల సర్వీస్‌ను బట్టి రెగ్యులరైజ్‌ చేస్తాం

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఔట్‌సోర్సింగ్‌లో చంద్రబాబు భారీ స్కాం

సాక్షి, అనంతపురం: ట్రాన్స్‌కో, జెన్‌కోలో ఏపీ సీఎం చంద్రబాబు విపరీతమైన స్కాంలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కార్మికుల పొట్టకొడుతూ.. విచ్చలవిడిగా దోచుకుతింటున్నాడని విమర్శించారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కుక్కాలపల్లి క్రాస్ వద్ద విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని వైఎస్ జగన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు వివరించారు.

అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల అనుభవాన్ని బట్టి దశల వారిగా రెగ్యులరైజ్‌ చేస్తానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని, ఆయన మరణాంతరం ఎవరూ పట్టించుకోవడం లేదంటే రాజకీయ వ్యవస్థ ఏ విధంగా దిగజారిందో అర్థం చేసుకోవాలన్నారు. 2008లో వైఎస్ఆర్ హయాంలో 7114 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. మిగతావారిని రెగ్యులరైజ్ చేసే క్రమంలో ఆయన మనకు దూరమయ్యారన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్ న్యాయమైనదే అయినప్పటికీ వారి సమస్యలను చంద్రబాబు సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మనందరి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల అనుభవం, విద్యార్హతను బట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చి దారుణమైన స్కాం చేస్తున్నారని జగన్‌ మండిపడ్డారు. సబ్‌స్టేషన్‌లను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చే దాంట్లో సగం డబ్బుతో ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయవచ్చన్నారు. చంద్రబాబు చేసే ప్రతి పనిలో దోచుకోవడం తప్ప మరేమీ జరగడం లేదన్నారు. బొగ్గు కొనుగోలులో స్కాం జరుగుతోంది. తెలంగాణ, గుజరాత్ కంటే ఏపీలో ఎక్కువ ధరకు విద్యుత్ కొంటున్నారు. ఒక్కో మెగావాట్‌కు రూ.1.4 కోట్ల దోపిడీ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. మనం అధికారంలోకి రాగానే కార్మికులకు అనుకూలంగా సంస్కరణలను తీసుకొచ్చి ట్రాన్స్‌కో, జెన్‌కో పనితీరును మెరుగు పరుస్తామని వైఎస్ జగన్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు భరోసా కల్పించారు.

మరిన్ని వార్తలు