కాంట్రాక్టు పనులిస్తాం రండహో..!

22 Nov, 2013 02:27 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: ‘ఏం సుబ్బాడ్డీ యాడికి పోతాండావ్.. రమేశన్న కాడికిపో చెక్ డ్యాం కావాలని ఆర్జీ ఈపో... సీఎం వచ్చాండాడు చేయిచ్చాడు... ఓ రామిరెడ్డన్న ఈమధ్య కన్పించడం లేదే... అటుమన్నాడు రచ్చబండ పెడ్తాండారు కదా... ఏదన్నా పని చూసుకోపో.. చేయిచ్చారు. ఎంతకాలమని ఊరికే తిరుగుతాంటావ్...హలో లక్ష్యుమయ్యా! మీ ఊర్లో చెరువు కట్ట తెగిపోయిందంటా కదా... ఊర్లో జనంతో సంతకాలు చేయించుకోనిరా..సీఎంకు చెప్పి పనిచేయిస్తాం...అదేందన్నా మేమంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదా...పార్టీలతో పనేముంది లక్షుమయ్య నువ్వు నాచేతికి ఆర్జీ తెచ్చియ్యి... ఆపని నీకు మంజూరయ్యేలా చూసుకునే బాధ్యత నాది’..ఇటీవల కాలంలో రాయచోటి నియోజకవర్గంలో నిత్యం చోటుచేసుకుంటున్న సంభాషణ ఇది.
 
 నియోజకవర్గ నాయకులు మొదలుకొని వారి అనుచరుల దాకా గ్రామస్థాయి నాయకులతో ప్రతిరోజు ఇలా మాట్లాడటం దినచర్యగా మారింది. ప్రస్తుతం ఈ పరిణామం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈనెల 25న సోమవారం రాయచోటిలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకొని వర్గ సమీకరణ చేసేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, పీసీసీ మెంబర్ రాంప్రసాద్‌రెడ్డి ఇరువురు ఎవరికివారు తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు ఊవ్విళ్లూరుతున్నారు.
 
 ముఖ్యమంత్రి తమ నాయకున్నే రచ్చబండ సభ నిర్వహణ ఏర్పాట్లను చూడమన్నారు, మీకేం కావాలో ముందే చెప్పండి. ప్రతిపాదనల్లో ఆ పనులు చేర్చుతారంటూ ముందుగా మాజీ ఎమ్మెల్యే రమేష్ అనుచరులు తెరపైకి వచ్చారు. ఈ పరిణామంతో తాము వెనుకబడి పోతామని భావించిన రాంప్రసాద్ అనుచరులు కూడా ఎవ్వరికి ఏం కావాలో చెప్పండంటూ పనులు రూపొందించే ప్రక్రియలో నిమగ్నమైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఒకరిపై మరొకరు ఫిర్యాదులు సైతం చేసుకోవడం తెలిసిందే.

 మునిసిపాలిటీకే రూ.4కోట్లతో
 ప్రతిపాదనలు..
 ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, పీసీసీ మెంబర్ రాంప్రసాద్‌రెడ్డి ఒక్క రాయచోటి మున్సిపాలిటికే వివిధ పనుల నిమిత్తం రూ.4 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం. రిటైర్డు ఇంజనీర్లచే పనులు రూపొందిస్తూ ఎవ్వరికి వారు విడివిడిగా జాబితాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మండలాల వారిగా ఎవ్వరి కోర్కెల జాబితాను వారు తయారుచేస్తున్నట్లు సమాచారం. గ్రామస్థాయి నాయకుల విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని మరీ తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా చెరువుల మరమ్మతులు, చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ చేసినట్లు సమాచారం. ఇలా ఇరువురి నాయకుల కోర్కెలు తీర్చాలంటే సుమారు రూ.25కోట్లు వెచ్చించాల్సి వస్తోందని సమాచారం. ప్రతిపాదనలు పంపే పనులు మంజూరైనా, కాకపోయినా ముందుజాగ్రత్తగా రిజర్వు చేసుకోవడమే మంచిదనే ఉద్దేశంలో నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.  
 
 రాజకీయ సమీకరణలో భాగంగానే...
  రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల రాజకీయ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎవ్వరికి వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి పర్యటనను సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు పోటీ పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
 
 రచ్చబండలో పనులు చేజిక్కినా, చేజిక్కక పోయినా ‘మేము మీకు, మీ గ్రామానికి  అవసరమైన పనులు చేయించాలనుకున్నాం’, అని చెప్పుకునేందుకు ఆరాట పడుతున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టులు దక్కితే మా సిఫార్సు వల్లేనని, దక్కకపోతే ప్రభుత్వంపై నెపం నెట్టేందుకు యోగ్యంగా ఉంటుందని ఎవరి ఎత్తుగడల్లో వారు ఉన్నట్లు సమాచారం. గతంలో ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాయచోటికి ఇండోర్ స్టేడియం ఏర్పాటు, రోడ్డు విస్తరణ పనులకు హామీ ఇచ్చారు. దానిని అమలు చేయడంలో స్థానిక నాయకులు కానీ, సీఎం కానీ ఏమాత్రం చొరవ చూపలేదన్న విషయం జగమెరిగిన సత్యం.
 
 అయినప్పటికీ ఇరువురు నాయకులు కూడా భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకొని సరికొత్త జాబితా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇరువురు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడేందుకే సుముఖంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే చురుగ్గా పావులు కదుపుతూనే అధికారంలో ఉండగా పనులు చక్కబెట్టుకోవాలనే తపనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకే కాంట్రాక్టు పనుల పేరుతో గ్రామస్థాయి నాయకులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని పలువురు పేర్కొంటున్నారు. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా కూడా గ్రామీణులను ప్రోత్సహించడం వెనుక అసలు కారణం ఇదేనని పరిశీలకులు భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు