పదోన్నతుల్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌.!

8 Oct, 2018 13:55 IST|Sakshi
కౌన్సెలింగ్‌కు హాజరైన ఉద్యోగులు (ఫైల్‌)

అక్రమంగా ‘ఒప్పంద’ బదిలీ

సీనియర్లకు అన్యాయం..వెలుగు చూస్తున్న అవకతవకలు

చేతులు మారిన లక్షలాదిరూపాయలు

వైద్య  ఆరోగ్య శాఖఆర్డీ కార్యాలయంతీరుపై ఆరోపణలు  

కడప రూరల్‌: కడప పాత రిమ్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం తీరుపై మరో మారు అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తాయి. గత శనివారం ఆ శాఖలో 40 మందికి ఎంపీహెచ్‌ఎస్‌ (మల్టీ పర్పస్‌ హెల్త్‌ సూపర్‌వైజర్‌) నుంచి ఎంపీహెచ్‌ఈఓ (మల్టీ పర్పస్‌ హెల్త్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌) పదోన్నతులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అందుకు సంబంధించిన అక్రమాల సంగతులు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు చేపట్టారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

అసోసియేషన్‌ నేతకు గోల్‌మాల్‌ పదోన్నతి..
పదోన్నతుల జాబితాలో ప్రకటించిన విధంగా  సీనియారిటీ కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే సీరియల్‌ నంబరు ప్రకారం అవకాశం కల్పించాలి. ఉదాహరణకు జాబితాలో 1వ నంబరులో ఉద్యోగి పేరు ఉంటే అతను కోరిన చోటికి పదోన్నతి కల్పించి బదిలీ చేయాలి. ఇక్కడ చాలా మంది సీనియర్ల విషయంలో అలా జరగలేదు. పైన ఉన్న వారిని కింద పడేశారు. కింద ఉన్న వారిని పైకి తెచ్చారు. అంతవరకు  బాగానే ఉంది. మరో బదిలీ జరిగిన తీరు గమనిస్తే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జిల్లాలోని ఒక నియోజకవర్గ కేంద్రంలో అతనొక అసోసియేషన్‌ నేత. అతను ఆ ప్రాంతంలో ఉంటేనే ఆ సంఘంలో కొనసాగుతాడు. అలా కొనసాగాలంటే ఆ ప్రాంతంలోనే ఉండాలి. కాగా అతను సీనియారిటీ జాబితాలో 15వ నెంబరు పైన ఉన్నాడు. అతను ఆ ప్రాంతంలోనే ఒక పీహెచ్‌సీలో ఎంపీహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో మరొక పీహెచ్‌సీలో  పదోన్నతి  పొందే ఎంపీహెచ్‌ఈఓ పోస్టు ఖాళీగా ఉంది. అక్కడికి వెల్లగలిగితే అసోసియేషన్‌లో తన పదవి పదిలంగా ఉంటుంది. అయితే సీనియారిటీ ప్రకారం అతను ఆ ప్రాంతానికి వెళ్లడానికి అనర్హుడు. ఎందుకంటే అతని కంటే ముందు వరుసలో సీనియర్లు ఉన్నారు. అందువలన అతను తప్పని సరిగా అనంతపురం  జిల్లాలోని ఒక మండల కేంద్రానికి వెళ్లాలి. అలా వెళితే కొనసాగే సంఘంలో పదవి ఉండదు. దీంతో అతని కన్ను తన కంటే ముందు వరుసలో ఉన్న ఒక సీనియర్‌పై పడింది.

అతను సీరియల్‌ నంబరులో చాలా ముందు వరుసలో ఉన్నారు. ఆ ఉద్యోగి అనంతపురం జిల్లాలోని ఒక ప్రాంతంలో పనిచేస్తున్నారు. వెంటనే అతనితో సంప్రదింపులు జరిపి ఓ పథకం రచించాడు. అందుకు అనంతపురం జిల్లా ఉద్యోగి కూడా ఒప్పుకున్నాడు. సీనియర్‌ అయినందున అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి ముందుగానే కౌన్సెలింగ్‌కు వెళ్లాడు. పథకం ప్రకారం వైఎస్సార్‌ జిల్లాలోని ఆ అసోసియేషన్‌ నేత విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో ఖాళీగా పోస్టు ఉన్న ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. దీంతో సీనియారిటీ  జాబితాలో వారిద్దరికి మధ్య ఉన్న ఉద్యోగులను పక్కదారి పట్టించారు. తరువాత ఆ సంఘం నేత కూడా కౌన్సెలింగ్‌కు వెళ్లి అనంతపురం జిల్లాకు వెళతానని సంతకం కూడా చేశారు. తరువాత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం కాగానే అనుకున్న ఒప్పందం ప్రకారం ప్రాంతాలను మార్చుకున్నారు. అంటే ఎవరెవరి జిల్లాల్లో వారే పనిచేసే విధంగా తారుమారు చేశారు. దీంతో సదరు జిల్లాకు చెందిన ఆ సంఘం నేత పక్కనే ఉన్న పీహెచ్‌సీకి పదోన్నతిపై బదిలీ కావడం గమనార్హం. పైగా ఆ ఉద్యోగ సంఘం నేత పదోన్నతిపై తాను ఫలానా ప్రాంతానికి బదిలీ అయినట్లుగా వాట్సప్‌ల ద్వారా  సందేశం పంపడం ఆ శాఖ ఉద్యోగులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వ్యవహారంలో దాదాపు రూ. 3 లక్షలకు పైగా చేతులు మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ ఉద్యోగి స్పెషల్‌...
నిబంధనల ప్రకారం దివ్యాంగులైన ఉద్యోగులను ముందుగానే కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. వారు కోరిన ఖాళీగా ఉన్న ప్రాంతాలను కేటాయిస్తారు. అలాగే ఇక్కడ కూడా అలాగే పిలిచారు. ఆ మేరకు అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో పనిచేస్తున్న ఒక దివ్యాంగుడు చిత్తూరు జిల్లాలోని ఒక ప్రముఖ ప్రాంతాన్ని  కోరారు. అందుకు అధికారులు నిరాకరించారు. ఆ స్థానాన్ని జిల్లాలోని మైదుకూరు ప్రాంతంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి కేటాయించారు. ఇందులో కూడా డబ్బు చేతులు మారినట్లు తెలుస్తోంది. అలాగే ‘స్పౌస్‌’ (భార్యా భర్తలు ఉద్యోగులైతే) కింద చేపట్టిన బదిలీలు కూడా విమర్శలకు దారి తీస్తున్నాయి. ఒక ఉద్యోగి పులివెందుల పరిధిలో పనిచేస్తున్నారు. ఆయన భార్య మైలవరం ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే అతన్ని మాత్రం లక్కిరెడ్డిపల్లె ప్రాంతానికి బదిలీ చేశారు. ఇలా తప్పుల తడకగా పదోన్నతులు సాగాయని అంటున్నారు. వీటిపై సమగ్ర విచారణ చేపట్టి తప్పులు సరిదిద్దాలని శాఖ ఉద్యోగులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు