ఫిబ్రవరిలో కాంట్రాక్టు కార్మికుల రెగ్యులర్

13 Jan, 2015 03:38 IST|Sakshi

 శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీలోని కాంట్రాక్టు కార్మికులను ఫిబ్రవరి నెలలో రెగ్యులర్ చేస్తారని, అటు తర్వాత ఆర్టీసీలో కాంట్రాక్ట్ వ్యవస్థే ఉండదని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్  రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.అప్పారావు అన్నారు. ఆర్టీసీ విభజనపై త్వరితగతిన నివేదికలు తెప్పించేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. శ్రీకాకుళంలోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ప్రయాణికులు, ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యంతో ఈనెల 6, 7తేదీలలో రెండు రోజులపాటు జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయన్నారు.
 
 జనవరి 12న 50శాతం డీఏ ఏరియర్స్ ఇచ్చేందుకు, మిగిలిన 50 శాతం మార్చి నెల జీతంలో ఇచ్చేందుకు, సీసీఎస్‌కు సంబందించి రూ.30కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. పాత టిమ్ముల స్థానంలో కొత్త టిమ్స్ మెషీన్‌లు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. రాబోయే 10వ పీఆర్‌సీలో రాష్ట్ర ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు కూడా వేతనాలు ఇచ్చేందుకు పోరాడుతామన్నారు. ఫిబ్రవరి 7నఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఇన్‌ఛార్జి ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు. ఈయూ సాధించిన విజయాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో ఈయూ ప్రతినిధులు కొర్లాం గణేశ్వరరావు, కె.శంకరరావు (సుమన్), పీపీ రాజు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు