కాంట్రాక్టర్‌ దురుసు ప్రవర్తన

20 Mar, 2018 09:40 IST|Sakshi
కార్పొరేటర్‌ బోయ గిరిజమ్మ, స్థానికులతో మాట్లాడుతున్న వన్‌టౌన్‌ సీఐ విజయభాస్కర్‌గౌడ్‌

అనుమతి లేకుండా జేసీబీతో గుంతల తవ్వకం

తరగతి గదులు దెబ్బతింటాయన్న కార్పొరేటర్‌ గిరిజమ్మ

అతి చేయొద్దంటూ కాంట్రాక్టర్‌ శ్రీనివాసచౌదరి ఆగ్రహం

పనులు ఆపాలన్నందుకు కార్పొరేటర్‌పై దాడికియత్నం

ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితులపై సీఐ మండిపాటు

అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అడ్డదిడ్డంగా పనులు చేస్తుండటాన్ని నిలదీసిన వారిపై కాంట్రాక్ట్‌ పనులు చేస్తున్న నేత దౌర్జన్యానికి దిగుతున్నారు. మహిళా కార్పొరేటర్‌ అన్న గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అంతటితే ఆగకుండా దాడికి యత్నించాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే వారు కూడా.. కాంట్రాక్టర్‌కే వత్తాసు పలకడం విమర్శలకు తావిచ్చింది.

అనంతపురం న్యూసిటీ: ప్రహరీగోడ నిర్మాణం కోసం అనుమతి లేకుండా జేసీబీతో గుంతలు తీయరాదని అభ్యంతరం తెలిపిన వైఎస్సార్‌సీపీ మహిళా కార్పొరేటర్‌ బోయ గిరిజమ్మపై టీడీపీకి చెందిన కాంట్రాక్టర్‌ శ్రీనివాస్‌చౌదరి దురుసుగా వ్యవహరించాడు. మూడవ డివిజన్‌ పరిధిలోని వైఎస్సార్‌ నగరపాలక ప్రాథమిక పాఠశాల ప్రహరీగోడ నిర్మాణాన్ని రూ.40 లక్షల వ్యయంతో ఎస్‌.వి. ఇన్‌ఫ్రా కంపెనీ చేపడుతోంది. సోమవారం ఉదయం కాంట్రాక్టర్‌ శ్రీనివాస్‌ చౌదరి జేసీబీని తెప్పించి గుంతలు తీయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని ఈఈ దుశ్యంత్, డీఈ సుధారాణికి కార్పొరేటర్‌ గిరిజమ్మ ఫిర్యాదు చేశారు. జేసీబీతో గుంతలు తీస్తే తరగతి గదులు దెబ్బతింటాయని, అధికారుల అనుమతి లేకుండా ఏ విధంగా చేస్తారంటూ కాంట్రాక్టర్‌ను నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన కాంట్రాక్టర్‌ శ్రీనివాస్‌చౌదరి ‘కార్పొరేటర్‌ అయితే మీ ఇంట్లో చూసుకో. ఇక్కడకు వచ్చి అతి చేయవద్దు’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. పనులు ఆపండి అని వర్క్‌ఇన్‌స్పెక్టర్లు ఆదేశించినా పట్టించుకోలేదు. చివరకు కార్పొరేటర్‌పై దాడికి యత్నించాడు. విషయం తెలుసుకున్న డివిజన్‌ ప్రజలు రత్నమ్మ, లలిత, లక్ష్మి, మణి అక్కడికి చేరుకుని కాంట్రాక్టర్‌ను చుట్టుముట్టి నిలదీయడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

బాధితులపై పోలీసుల మండిపాటు
కార్పొరేటర్‌ గిరిజమ్మ, డివిజన్‌ మహిళలను దూషించి, దురుసుగా వ్యవహరించిన కాంట్రాక్టర్‌కే వన్‌టౌన్‌ పోలీసులు వత్తాసు పలికారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోండి అని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన కార్పొరేటర్, మహిళలపై ‘మీరు అసలు ఇక్కడకు ఎందుకొచ్చారు’ అంటూ సీఐ విజయభాస్కర్‌గౌడ్‌ మండిపడ్డారు. మఫ్టీలో ఉన్న జయరాం అనే కానిస్టేబుల్‌ అయితే ‘ఏం.. ఎక్కువ మాట్లాడుతున్నారంటూ’ మహిళలపై వీరంగం వేశాడు. చివరకు ఏఈ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను ఆరా తీయగా తామొచ్చేసరికి పనులు జరుగుతున్నాయని, నిబంధనలకనుగుణంగా మాన్యువల్‌గా గుంతలు(ట్రెంచ్‌) తీయాలని కాంట్రాక్టర్‌కు చెప్పినట్లు సీఐకు తెలిపారు.

మరిన్ని వార్తలు