కాంట్రాక్టు జగన్నాథునికెరుక!

28 Apr, 2019 07:58 IST|Sakshi
సర్వజనాస్పత్రిలోని మెడికల్‌ రికార్డ్స్‌ గదిలో ఆస్పత్రి ఫర్నిచర్‌నే వాడుతున్న దృశ్యం

అనంతపురం న్యూసిటీ : సర్వజనాస్పత్రిలో అవినీతి, అక్రమాలు తారస్థాయికి చేరాయి. డబ్బు ముట్టజెబితే చాలు.. ఇక్కడ ఎలాంటి పని చేసేందుకైనా వెనుకాడని పరిస్థితి. మెడికల్‌ రికార్డు, ఓపీ, ఐపీ నిర్వహణ బాధ్యతను పరిశీలిస్తే అధికారులు ఏ స్థాయికి దిగజారినారో అర్థమవుతోంది. ఏడాదిన్నరగా కర్నూలుకు చెందిన ఓ ప్రయివేట్‌ సంస్థకు ఓపీ, ఐపీ, రికార్డుల నిర్వహణ బాధ్యతను అనధికారికంగా కట్టబెట్టారు. ఇందుకోసం ప్రతినెలా రూ.3.25లక్షలు చెల్లిస్తున్నారు. ఇందులో ఆసుపత్రిలోని కీలక అధికారికి భారీగా ముడుపులు ముడుతున్నట్లు చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఏడాదికి పైగా అదే కంపెనీని కొనసాగిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ప్రతి నెలా కలెక్టర్‌కు ఫైల్‌ పంపి కాంట్రాక్టును కొనసాగిస్తున్నట్లుగా తెలిసింది.

ఇదీ సంగతి
2017లో ఎంసీఐ సర్వజనాస్పత్రిని తనిఖీ చేసి మెడికల్‌ రికార్డ్స్‌ నిర్వహణ సరిగా లేదని, డిజిటలైజేషన్‌ పక్కాగా ఉండాలని స్పష్టం చేసింది. దీన్ని ఆసరాగా చేసుకొని ఆస్పత్రిలోని కీలక అధికారి ఎలాంటి టెండర్‌ లేకుండానే ఓ కంపెనీకి ఐపీ, ఓపీ, రికార్డ్స్‌ నిర్వహణ బాధ్యతను కట్టబెట్టారు. అప్పట్లో ఈ విషయమై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కానీ అధికార పార్టీ నాయకల అండతో కాంట్రాక్ట్‌ను కొనసాగిస్తూ వచ్చారు. కంపెనీ నిర్వాహకులు ఆస్పత్రిలో పూర్తి స్థాయి సామగ్రిని కూడా సమకూర్చుకోలేదు. ఓపీ, ఐపీ, మెడికల్‌ రికార్డ్‌ రూంలో తూతూమంత్రంగా కంప్యూటర్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటిలోనూ సర్వజనాస్పత్రికి చెందిన కంప్యూటర్లే ఉన్నాయి. ప్రతి నెలా కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉన్నా.. ఆస్పత్రిపైనే భారం వేస్తున్నారు.

రూ.1.50లక్షకు పైనే లబ్ధి 
కంపెనీకి ప్రతి నెలా రూ.3.25 లక్షలు చెల్లించేలా ఆస్పత్రి యాజమాన్యం కాంట్రాక్ట్‌ను అప్పగించింది. ఇక్కడ 10 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వారికి ప్రతి నెలా రూ.6వేలు చొప్పున చెల్లిస్తున్నారు. ఈ లెక్కన రూ.60వేలు సిబ్బందికి ఖర్చవుతుంది. ఇక మెడికల్‌ రికార్డ్స్‌ పేపర్లకు రూ.లక్ష కూడా ఖర్చు కాదని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. అంటే.. కంపెనీ ప్రతి నెలా రూ.1.50లక్షకు పైగానే లబ్ధి పొందుతోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులతో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సిబ్బందికి అందని వేతనాలు 
ఐపీ, ఓపీ, మెడికల్‌ రికార్డ్‌ సెక్షన్‌లో విధులు నిర్వర్తించే సిబ్బందికి గత నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. కంపెనీకి ప్రతి నెలా రూ.3.25 లక్షలు వస్తున్నా వేతనాలు ఇవ్వకపోవడం పట్ల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం విధులకు హాజరైనట్లు వ్యాట్సాప్‌లో ఫొటోలు ఉంచడం మినహా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వేతనాల విషయమై కంపెనీ నిర్వాహకులను ఆరా తీస్తే ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నట్లుగా సమాచారం.
 
నిబంధనలకు పాతర 
సర్వజనాస్పత్రిలో ఓ కీలక అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనిలోనూ కమీషన్‌ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా పని జరగాలంటే ఆ అధికారిని కలిస్తే చాలని ఆసుపత్రిలోనే బహిరంగ చర్చ జరుగుతోంది. రూ.వెయ్యి మొదలు రూ.లక్షల వరకు ఆయన దేన్నీ వదలడం లేదని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్‌ పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.

>
మరిన్ని వార్తలు