చేసిందంతా చేసి..

2 Jun, 2016 04:18 IST|Sakshi
చేసిందంతా చేసి..

ఎస్‌ఈను బుజ్జగించే పనిలో మేయర్
►  నిర్ణయం మార్చుకునేది లేదని తేల్చిచెప్పిన ఇమాముద్దీన్

 
నెల్లూరు సిటీ: ‘మీ పార్టీ నేతల నుంచి ఇబ్బందులు వస్తున్నాయి.. కొందరు కార్పొరేటర్లు టెండర్లు, బిల్లుల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని’ ఎస్‌ఈ ఇమాముద్దీన్ పలుమార్లు మేయర్ అజీజ్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు స్పందించని మేయర్ అజీజ్ ఇమాముద్దీన్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన్ను బుజ్జగించే పనిలో పడ్డారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో ఎస్‌ఈగా ఒకటన్నర ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎటువంటి మచ్చలేకుండా పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నారు.

ఆయన టెండర్లు, బిల్లులు మంజూరు, పనులు నాణ్యతపై ఎక్కడా రాజీపడకుండా పనిచేశారు. అయితే అధికార పార్టీ కార్పొరేటర్లు తమ సంపాదనే ముఖ్యంగా, ఇతర మనోభావాలతో పనిలేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఈ పరిస్థితులను తట్టుకోలేక  ఎస్‌ఈ స్చచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. దీంతో పెద్ద ఎత్తున దూమారం రేగడంతో మేయర్ అజీజ్ పార్టీకి, తనకు ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనని ఎస్‌ఈ ఇమాముద్దీన్‌ను బుధవారం బుజ్జగించే పనిలో పడ్డారు. అయితే ఒకసారి తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవడం కుదరదని ఇమాముద్దీన్ తేల్చిచెప్పినట్లు సమాచారం.  


పర్సంటేజీలపై  కాంట్రాక్టర్లకు ఆదేశాలు
ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు నాణ్యతతో కూడిన పనులు చేయాలని ఎస్‌ఈ ఇమాముద్దీన్ ఆదేశాలు ఇచ్చారు. దానికి తగ్గట్లు పనులు పై ఎప్పటికప్పుడు ఫొటోలను పరిశీలిస్తూ వచ్చారు. అయితే ఎస్‌ఈ ఇమాముద్దీన్ తీసుకున్న నిర్ణయంతో అవినీతి అధికారులు, అధికార పార్టీ కార్పొరేటర్లు పర్సంటేజీలు పెంచాలని, నాణ్యత లేకపోయినా పర్సంటేజీలు తగ్గకూడదని కాంట్రాక్టర్లకు ఆదేశించినట్లు సమాచారం.
 
 
 ఇక నుంచి అంతా మన ఇష్టం
 
కొందరు అవినీతి అధికారులకు ఇంతకాలం అడ్డుగా నిలిచిన ఎస్‌ఈ ఇమాముద్దీన్ స్వచ్ఛంద విమరణ చేయడంతో వారిలో సంతోషం వ్యక్తం అవుతుంది. పైకి మాత్రం ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం బాధాకరంగా ఉందని వ్యక్తం చేస్తుండగా, తమ సన్నిహితుల వద్ద మాత్రం ‘ఇక నుంచి మనం ఆడిందే ఆటగా సాగుతుందని, ఆదాయం పెరుగుతుందని చెప్పడం’ గమనార్హం.
 

మరిన్ని వార్తలు