పతులు ఉద్యోగులు.. సతులు డీలర్లు 

8 Nov, 2019 10:12 IST|Sakshi
నాగాయపల్లెలో సరుకుల పంపిణీలో భార్య వెంకటరాజ్యంకు సహాయం చేస్తున్న టీచర్‌ హజరత్‌రెడ్డి

ఖాజీపేటలో ఆర్‌అండ్‌బీ ఉద్యోగి భార్య

మొర్రాయిపల్లెలో టీచర్‌ భార్య  చౌక దుకాణం డీలర్‌గా కొనసాగుతున్న వైనం 

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమంటున్న అధికారులు 

విచారించి చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ 

సాక్షి, చాపాడు: భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా అతని భార్య చౌక దుకాణం నిర్వహించడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. అయినా ఈ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయకుండా గత కొన్నేళ్లుగా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల భార్యలు చౌక దుకాణం డీలర్లుగా కొనసాగుతున్న సంఘటన మైదుకూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళితే.. 
చాపాడు మండలం మొర్రాయిపల్లెకు చెందిన కుమ్మితి వెంకటరాజ్యం షాపు నెంబరు 1114010 చౌకదుకాణం డీలర్‌గా ఉంటోంది. ఈమె భర్త హజరత్‌రెడ్డి అదే మండలంలోని బద్రిపల్లె దళితవాడ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భర్త టీచర్‌గా ఉంటూ భార్య చౌకదుకాణం డీలర్‌గా కొనసాగటం నిబంధనలకు వ్యతిరేకం. హజరత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా తన భార్య వెంకట రాజ్యం దగ్గరే ఉంటూ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుండటం గమనార్హం. మొర్రాయిపల్లె పేరుతో చౌకదుకాణం ఉండగా వెంకటరాజ్యం నాగాయపల్లెలో ఓ ఇంటిలో రేషన్‌ పంపిణీ చేస్తోంది.

గతంలో బినామీ డీలర్‌ ద్వారా సరకులు పంపిణీ చేయిస్తుండగా, ఈ నెలలో వీరిరువురే సరుకులు పంపిణీ చేస్తుండటం గమనార్హం. వీరు మాత్రం మైదుకూరులో నివాసం ఉంటున్నారు. గత సెపె్టంబర్‌ నెలలో రెవెన్యూ అధికారులు జరిపిన తనిఖీల్లో తూకాల్లో వ్యత్యాసాలు రావటంతో చౌకదుకాణంపై కేసు నమోదు చేశారు. అయితే వీరు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. నవంబరు నెలలో వీరే రేషన్‌ పంపిణీ చేసేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నవంబరు నెల సరుకులను తెచ్చుకున్నారు.
 
తహసీల్దారు ఏమన్నారంటే.. 
మండలంలోని మొర్రాయిపల్లె చౌకదుకాణం డీలర్‌గా ఉంటున్న కుమ్మితి వెంకటరాజ్యం భర్త హజరత్‌రెడ్డి ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్నా చౌకదుకాణం నిర్వహించటంపై తహసీల్దారు శ్రీహరిని వివరణ కోరగా.. ప్రభుత్వ ఉద్యోగి భార్య చౌకదుకాణం డీలర్‌గా ఉండకూడదన్నారు. సరుకుల పంపిణీలో టీచర్‌ ఉండకూడదని, దీనిపై విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఖాజీపేటలోనూ ఇలాంటి పరిస్థితే..
ఖాజీపేట: పట్టణంలోని 16వ నంబర్‌ చౌకదుకాణం డీలర్‌  లక్షి్మదేవి భర్త కొండయ్య ఆర్‌ఆండ్‌బీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమె మాత్రం కొన్నేళ్లుగా డీలర్‌గా కొనసాగుతోంది. సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడుతోందంటూ ఆమెపై అందిన ఫిర్యాదుల మేరకు ఇటీవల విజిలెన్స్‌ అధికారులు ఆ చౌక దుకాణంపై దాడులు నిర్వహించి 6ఏ కేసు నమోదు చేశారు. అలాగే షాపును సీజ్‌ చేశారు. ఈ దుకాణం తనే నిర్వహించాలంటూ ఆమె కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సీజ్‌ చేసిన సరుకును స్వా«దీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులను సైతం ఆమె అడ్డుకుని నానా హంగామా సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగుల భార్యలు చౌక దుకాణం డీలర్లుగా కొనసాగుతుండటం.. వారికి భర్తలు చేదోడు వాదోడుగా ఉంటుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనపై ఖాజీపేట తహసీల్దార్‌ సూర్యనారాయణరెడ్డిని వివరణ కోరగా ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి అనే విషయం తమకు ఇప్పుడే తెలిసిందని, విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా