‘కాలుష్య నియంత్రణ మండలి’ నిధులకు రెక్కలు!

30 Sep, 2018 04:43 IST|Sakshi

రూ.200 కోట్లు బందరు పోర్టుకు..

మరో రూ.100 కోట్లు అమరావతి కార్పొరేషన్‌కు ..సమకూర్చాలని పీసీబీకి బాబు సర్కారు లేఖ

నిబంధనలకు విరుద్ధంగా ‘కేంద్రం’ నిధులు మళ్లింపు

మరో వైపు ఉద్యోగుల పీఎఫ్‌ నిధుల బకాయిలు కోట్లలో

సాక్షి, అమరావతి: కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిధులపైనా సర్కారు కన్నేసింది. ఇవి పూర్తిగా కేంద్రం నిధులు. ఏ రాష్ట్రంలోనూ పీసీబీ నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇది తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిసినా.. నిధులను మింగేసేందుకు  చంద్రబాబు సర్కార్‌ బరి తెగించింది.  మరోవైపు రాష్ట్రంలో వాయు కాలుష్యం, జల కాలుష్యం తీవ్రమై జనం రోగాల బారిన పడి అల్లాడుతుంటే.. రీసెర్చ్‌ కేంద్రాలు గానీ, జలశుద్ధి చర్యలు గానీ, సీవరేజీ ట్రీట్‌మెంటు ప్లాంట్ల ఏర్పాటు తదితర చర్యలేవీ పీసీబీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడేమో ఉన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం గద్దలా తన్నుకుపోతున్నా.. పీసీబీ చైర్మన్, సభ్య కార్యదర్శి నోరు మెదపకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. తాజాగా  కాలుష్య నియంత్రణ మండలి నిధులు రూ.200 కోట్లను బందరు పోర్టుకు మళ్లించడంపై పీసీబీ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ)కి వంద కోట్లు ఇస్తున్నారన్న వార్తలు పీసీబీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే బందరు పోర్టుకు నిధులు మంజూరు చేయగా, ఏడీసీకి రేపోమాపో రూ.100 కోట్లు ఇస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. పీసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు.

వడ్డీలేదు..తిరిగి చెల్లింపులు ఎప్పుడో చెప్పలేదు
నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించడమే కాకుండా, ఈ సొమ్ముకు వడ్డీ ఎంత, తిరిగి ఎప్పుడు చెల్లింపులు చేస్తారు అన్నది చెప్పలేదు. విచిత్రమేమంటే పీసీబీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి చెల్లించాల్సిన ప్రావిడెంట్‌ ఫండ్‌ తదితర సొమ్ము కోట్లలో బకాయిలున్నా చెల్లించని పీసీబీ.. బందరు పోర్టుకు మాత్రం ఉదారంగా ఎలా ఇస్తోందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని, ఈ లేఖ రాగానే రూ.200 కోట్లు చెల్లింపులు చేశారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా పీసీబీ నిధులు అంతర్గత సర్దుబాటుకు మాత్రమే తీసుకున్నట్టు బందరు పోర్టు అధికార వర్గాలు తెలిపాయి.

పీసీబీ చేపట్టాల్సిన చర్యలు..
- రాష్ట్రంలో వాయు కాలుష్యం, జల కాలుష్యం నివారణకు చర్యలు తీసుకోవాలి
పరిశోధనా కేంద్రాలు (రీసెర్చ్‌ సెంటర్లు) ఏర్పాటు చేయాలి
బయో వ్యర్థాల వల్ల గానీ, మున్సిపాలిటీల్లో వచ్చే వ్యర్థాల వల్లగానీ జబ్బులు రాకుండా, వ్యర్థాల నిర్వీర్యానికి చర్యలు తీసుకోవాలి
పరిశ్రమల నుంచి వచ్చే వాయు కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోవాలి
పరిశ్రమలు, లేదా నీటిసెస్సు ఇలా పన్నుల రూపేణా వసూలు చేసే సొమ్మును కాలుష్య నియంత్రణకే ఖర్చు చేయాలి
ప్రతి ఏడాదీ జల, వాయు కాలుష్యంపై అంచనాలు వేసి దానికి తగిన నియంత్రణ చేపట్టాలి

మరిన్ని వార్తలు