ధనాధన్ భూదాన్

25 Mar, 2016 10:16 IST|Sakshi
ధనాధన్ భూదాన్

అస్మదీయులకు ‘ముందస్తు పందేరం’!
నిబంధనలకు విరుద్ధంగా భూముల అప్పగింతలు
నచ్చిన సంస్థలకు భూములు ఇచ్చేస్తూ జీవోలు
పరిశీలించాల్సిన పనిలేదు..
కేబినెట్ నిర్ణయాలతో నిమిత్తమే లేదు..
పొజిషన్ ఇచ్చిన తర్వాత ఇక చేసేదేముంటుంది?
{పజా ప్రయోజనాలు, ఉపాధి కల్పన షరతులు గాలికి
సర్కారు తీరుపై అధికారుల్లోనూ అసహనం..


హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ భూమిని ఏదైనా ప్రైవేటు సంస్థకు కేటాయించాలంటే అనేక షరతులు వర్తిస్తాయి. సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. ప్రజా ప్రయోజనాలు నెరవేరతాయో లేదో చూడాలి. ఉపాధి కల్పనకు ఉపకరిస్తుందో లేదో పరిశీలించాలి. సదరు సంస్థ ట్రాక్ రికార్డునూ తనిఖీ చేయాలి. ఇలా ఎన్నో అంశాలు ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకున్న తర్వాత.. ఎన్నో కార్యాలయాల అనుమతులు సంపాదించాక మంత్రివర్గం ముందుకు ఆ ప్రతిపాదన వెళుతుంది. కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం భూముల కేటాయింపులో సరికొత్త సాంప్రదాయానికి తెరతీసింది. అస్మదీయ సంస్థకు అడిగినంత భూమిని ముందుగానే పందేరం చేస్తోంది. భూ కేటాయింపు నిబంధనలకు తిలోదకాలిచ్చి ‘ముందస్తు అప్పగింత’లు చేస్తోంది. ఒకసారి భూమిని స్వాధీనం చేస్తే ఇక న్యాయపరంగా దానిని వెనక్కు తీసుకోవడం సాధ్యం కాదు. ఈ భూములకు సంబంధించి ఎలాంటి వివాదం తలెత్తినా న్యాయస్థానాలు పొజిషన్‌లో ఉన్నవారి పక్షం వహిస్తాయి. అన్నీ తెలిసినా ఎలాంటి పరిశీలనా లేకుండానే.. కనీసం రేటు కూడా నిర్ణయించకుండానే ప్రైవేటు సంస్థలకు విలువైన భూములను అప్పగించేస్తుండడం అధికారులను సైతం విస్మయపరుస్తోంది. అడ్డగోలుగా భూములు అప్పగిస్తూ  హడావిడిగా జీవోలు జారీ అయిపోతుండడం గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగూ అనుకున్న సంస్థలకు నామమాత్రపు ధరకు భూములు కేటాయిస్తూ కేబినెట్‌లో నిర్ణయాలు చేస్తున్న రాష్ర్టప్రభుత్వం దొడ్డిదోవన భూములను  అప్పగిస్తూ జీవోలు జారీ చేస్తోంది.

 
విధానం ఇదీ...

నిజానికి పరిశ్రమల ఏర్పాటుకోసం ఏదైనా ప్రైవేటు సంస్థకు భూముల్ని కేటాయించాలంటే.. అందుకు ప్రభుత్వపరంగా సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. ఎవరైనా భూ కేటాయింపుకోసం సీఎంకో, మంత్రులకో విజ్ఞాపన పత్రమందిస్తే వారి కార్యాలయ అధికారులు ఫైల్ ప్రాసెస్ చేయాలంటూ జిల్లా కలెక్టర్‌కో, జాయింట్ కలెక్టర్‌కో పంపడం రివాజు. వారు తహసీల్దారు, రెవెన్యూ డివిజనల్ అధికారి ద్వారా ప్రతిపాదన తెప్పించుకుని రాష్ట్ర ప్రధాన భూపరిపాలన కమిషనర్(సీసీఎల్‌ఏ)కి పంపుతారు. సీసీఎల్‌ఏ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భూ నిర్వహణ సంస్థ(ఏపీఎల్‌ఎంఏ) ఆమోదించి రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శికి పంపుతుంది. ఆయన ఆమోదం తర్వాత రెవెన్యూ మంత్రికి, తదుపరి సీఎం కార్యాలయానికి, రాష్ట్ర కేబినెట్‌కు వెళుతుంది.

 
నిబంధనలకు తిలోదకాలు..

అయితే ఈ ప్రక్రియతో నిమిత్తం లేకుండానే.. ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన వారికి అడిగిందే తడవుగా అడ్డగోలుగా ఆగమేఘాలపై ఏకంగా భూముల్ని ముందస్తుగా అప్పగిస్తూ ఉత్తర్వులిప్పిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు ఆశ్రీత పక్షపాతం చూపుతూ కావాల్సిన వారికి అడిగిందే తడవుగా భూములు స్వాధీనం చేయాలంటూ మౌఖిక ఆదేశాలిస్తున్నారు. తద్వారా నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ఏదైనా సంస్థకు భూమి కేటాయించేందుకు అనుసరించాల్సిన ప్రక్రియను కాదని ముందస్తుగా స్వాధీనం చేయడం అంటే.. భూమిని ఆ సంస్థకు కేటాయించినందుకు అంగీకరించినట్టే అవుతుందని, మరలాంటప్పుడు ఏపీఎల్‌ఎంఏ, కేబినెట్ నిర్ణయాలకు విలువ ఏముంటుందని స్వయంగా అధికారులే ప్రశ్నిస్తుండడం గమనించాల్సిన అంశం.

 
అధికారుల్లో ఆందోళన: ప్రభుత్వ శాఖలకు భూముల్ని ముందుగా అప్పగించడంలో తప్పులేదని, దీనికి పూర్తి భిన్నంగా ఎవరికి పడితే వారికి భూముల్ని ముందే స్వాధీనం చేస్తూ ఉత్తర్వులిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లాభాపేక్షతో పరిశ్రమలు ఏర్పాటుచేసే ప్రైవేటు సంస్థలకు ఇలా ఇవ్వాల్సిన అత్యవసరం ఏముందని అధికారవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పెద్ద సంస్థలు ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తామనే హామీతో భూమి కోరితే సింగిల్ విండో విధానంలో త్వరితగతిన కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేయాలేగానీ అడ్డగోలుగా ‘ముందస్తు అప్పగింతలు’ చేయరాదని అధికారులు అంటున్నారు. భూకేటాయింపులు, ముందస్తు స్వాధీనాల విషయంలో ప్రభుత్వ పెద్దలనుంచి వస్తున్న ఒత్తిళ్లపట్ల రెవెన్యూ అధికారులు భయపడుతున్నారు. అడ్డగోలు వ్యవహారాల వల్ల భవిష్యత్తులో కేసులొస్తే తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయోనని వారు ఆందోళన చెందుతున్నారు. ‘‘ప్రజాప్రయోజనాలు లేకుండా ప్రైవేటు సంస్థలకు భూముల్ని ముందుగా అప్పగించడం ఏమాత్రం సమంజసంకాదు. ఇలా ఇచ్చిన దాఖలా లు నా సర్వీసులో లేవు...’’ అని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒకరు అన్నారు.

 

 
అన్నీ అనామక సంస్థలే...

చంద్రబాబు సర్కారు ముందస్తుగా భూములు అప్పగిస్తూ జీవోలు జారీ చేసిన సంస్థలన్నీ చాలా చిన్నవే. వీటివల్ల అత్యవసర ప్రజాప్రయోజనమూలేదు. ఉపాధి కల్పనా లేదు. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో సీపీ ఆక్వాకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 30 ఎకరాలు స్వాధీనం చేయాలని రెవెన్యూశాఖ ఈనెల 11న జీవో 262 జారీ చేసింది. విశాఖకు సమీపంలోని కాపుల ఉప్పాడలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని విశాఖ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌కు స్వాధీనం చేస్తూ ప్రభుత్వం గతేడాది నవంబరు 6న జీవో 411 జారీ చేసింది. మార్కెట్ విలువ ప్రకారం 15 ఎకరాల్ని లీజుకిస్తున్నట్లు పేర్కొంది. ఆ విలువ ఎంతనేది కూడా పేర్కొనలేదు. సిలికాన్ ఆంధ్ర సంస్థకు కృష్ణా జిల్లా కూచిపూడిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి అడిగిన రెండోరోజే 1.08 ఎకరాల భూమిని అప్పగిస్తూ జీవో నంబర్ 1080(నవంబర్ 4న) జారీచేసింది.ఇవన్నీ అనామక సంస్థలే.వ్యాపార ప్రయోజనాలకోసమే ఇవి భూములు కోరాయి. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను దోచుకునే కార్పొరేట్ ఆసుపత్రి నిర్మాణానికి  భూమిని అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చిందో బాబుకే ఎరుకని అధికారులు అంటుండడం గమనార్హం.

 

అస్మదీయ సంస్థకు 50 ఎకరాల భూదానానికి రంగం సిద్ధం
అస్మదీయ సంస్థకు భూముల్ని అప్పనంగా దోచిపెట్టేందుకు రాష్ట్రప్రభుత్వ పెద్దలు ఎంతకైనా తెగిస్తారనేందుకు ఇది మరో నిదర్శనం. రాష్ట్ర పారిశ్రామిక రాజధానిగా పేరుగాంచిన విశాఖ నగరంలోని మధురవాడలో ప్రభుత్వ మార్కెట్ విలువల ప్రకారమే రూ.363 కోట్ల విలువ చేసే 50 ఎకరాల భూమిని కేవలం రూ.25 కోట్లకు ఐటీ కంపెనీకి ధారాదత్తం చేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ మిత్రుడికి చెందిన ఈ-సెంట్రికల్ సొల్యూషన్స్‌కు కట్టబెట్టేందుకు ఈ భూమిని పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ)కి ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర భూ పరిపాలన ప్రధానాధికారి(సీసీఎల్‌ఏ) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ(ఏపీఎల్‌ఎంఏ) ఎకరా 7.26 కోట్ల మార్కెట్ విలువ సిఫార్సు చేయగా కేబినెట్ దీనిని బుట్టదాఖలు చేసి ఎకరా రూ.50 లక్షలకే కేటాయించాలని తీర్మానించడం గమనార్హం.

 

మరిన్ని వార్తలు