కంట్రోల్ రూమ్‌కు అదనపు సిబ్బంది

16 Apr, 2016 01:06 IST|Sakshi
కంట్రోల్ రూమ్‌కు అదనపు సిబ్బంది

విజయవాడ : విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్‌ను అంచెలంచెలుగా బలోపేతం చేస్తున్నారు. పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ పోలీస్ వ్యవస్థను పరోక్షంగా నడుపుతున్న కంట్రోల్ రూమ్ బలోపేతంపై నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తాజాగా దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించారు. తద్వారా మరికొన్ని ప్రత్యేక సేవలు అందించాలని భావిస్తున్నారు.

 
అదనంగా 53 మంది కేటాయింపు

కమిషనరేట్ బలోపేతంలో భాగంగా కొత్త వింగ్‌లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి కోసం 471 మంది సిబ్బందిని కేటాయించారు. వారితో పాటు మరో 378 మంది కానిస్టేబుళ్లను డిప్యుటేషన్‌పై తీసుకురానున్నారు. వారిలో 53 మంది కానిస్టేబుళ్లను కంట్రోల్ రూమ్‌కు కేటాయించనున్నారు.

 
మాస్టర్ కంట్రోల్ రూమ్‌గా సేవలు
విజయవాడ నగరంలో ల్యాండ్ మార్క్‌గా నిలిచే పోలీస్ కంట్రోల్ రూమ్ కమిషనరేట్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మారింది. కమిషనరేట్‌లో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కంట్రోల్ రూమ్‌కు సమాచారం వస్తుంది. ఆ వెంటనే సిబ్బంది దానిని ఏసీపీ స్థాయి అధికారి నుంచి కమిషనర్ వరకు చేరవేస్తారు. దీంతో పాటు సంబంధిత స్టేషన్‌కు సమాచారం ఇచ్చి గంట తర్వాత అప్‌డేట్ సమాచారం కూడా తీసుకుంటారు.

 
వీటితోపాటు ఇతర సేవలను కూడా కంట్రోల్ రూమ్ సిబ్బంది కొనసాగిస్తున్నారు. వాస్తవానికి కంట్రోల్ రూమ్‌ను గతేడాదే కొంత అభివృద్ధి చేసి, దానికి మరమ్మతులు నిర్వహించారు. ప్రత్యేక చాంబర్లు కూడా ఏర్పాటు చేశారు. అదనంగా సిబ్బందిని మాత్రం నియమించలేదు. దీంతో సీఐతో కలిపి 45 మంది సిబ్బంది రోజూ మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కార్యకలాపాల్ని సీఐ స్థాయి అధికారి పర్యవేక్షిస్తుండగా నలుగురు ఎస్‌ఐలు, 40 మంది కానిస్టేబుళ్లు 24 గంటలూ షిఫ్టుల వారీగా విధుల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో నగరంలో బ్లూకోట్స్ వాహనాల సంచారం, రక్షక్ వాహనాల కదలికలను మానిటరింగ్ చేసి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సూచనలు కంట్రోల్ రూమ్ ద్వారా చేస్తుంటారు. నైట్ రౌండ్స్, పెట్రోలింగ్, వివిధ సందర్భాల్లో స్టేషన్లను అప్రమత్తం చేయటం తదితర పనులు కంట్రోల్ రూమ్ ద్వారా జరుగుతున్నాయి.

 
ఫిర్యాదుల వెల్లువ

రెగ్యులర్ విధులతో పాటు కంట్రోల్ రూమ్‌లోనే డయల్ 100ను మానిటరింగ్ చేస్తారు. నెలకు సగటున 3500కు పైగా వివిధ రకాల ఫిర్యాదులు అందుతున్నాయి. కమిషనరేట్ పోలీసులు నిర్వహిస్తున్న ఫోర్త్ లయన్ యాప్ ద్వారా నెలకు 150 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని పూర్తిగా కంట్రోల్ రూమ్ పోలీసులే పర్యవేక్షిస్తుంటారు. ఈ క్రమంలో పని భారం పెరగటంతో పోలీసులు కొంత ఇబ్బంది పడుతున్నారు. దీంతో అదనంగా 53 మంది సిబ్బందిని కేటాయించి సీఐతో పాటు ఒక ఏసీపీ స్థాయి అధికారి పూర్తిగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు