ఎందుకిలా..?

28 May, 2018 09:06 IST|Sakshi

జేఎన్‌టీయూ ఫార్మసీ ప్రిన్సిపాల్‌ నియామకం వివాదాస్పదం

అనుమతి లేకుండా నియమించిన వైనం

ఫార్మసీలో పీహెచ్‌డీ లేకుండానే పదవి

జేఎన్‌టీయూ: జేఎన్‌టీయూ అనంతపురంలో నూతనంగా ఫార్మసీ కళాశాలకు ప్రిన్సిపాల్‌ను నియమించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నియామకం జరగడంతో వివాదస్పదమవుతోంది. పాలక మండలి అనుమతి లేకుండానే ఏకంగా ప్రిన్సిపాల్‌ను నియమించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిర్ణయాత్మకమైన పదవి కావడంతో నిబంధనలు అనుసరించకుండా భర్తీ చేయడం అనుమానాలకు తావిస్తోంది.

పొంతన లేని పీహెచ్‌డీ
ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌కు తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ ఉండాలి. కానీ తాజాగా ఎంపిక చేసిన ప్రిన్సిపాల్‌కు బయోటెక్‌లో పీహెచ్‌డీ చేశారు. సాధారణంగా ఇంజినీరింగ్‌ , ఫార్మసీ అధ్యాపకులకే ఎంటెక్, ఎంఫార్మసీ కచ్చితంగా ప్రథమ శ్రేణితో ఉత్తీర్ణులైనవారిని ఎంపిక చేస్తారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియామించే వ్యక్తికి కచ్చితంగా ఎంఫార్మసీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై, పీహెచ్‌డీ ఫార్మసీ సబ్జెక్టు మీదే పూర్తీ చేసి ఉండాలి.  కానీ ఎంఫార్మసీ రెండో శ్రేణిలో ఉత్తీర్ణులై, బయోటెక్‌లో పీహెచ్‌డీ పూర్తీ చేసిన వారిని ప్రిన్సిపాల్‌గా ఎంపిక చేశారు. ఏదైనా కీలక నియాయం చేసేటపుడు తప్పనిసరిగా పాలక మండలి అనుమతితోనే నియామక పత్రాన్ని అందచేయాలి. కనీసం పాలక మండలికి సమాచారం ఇవ్వకుండానే నేరుగా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించారు.

గడువు ముగియకుండానే పీహెచ్‌డీలు
జేఎన్‌టీయూ (ఏ)లో నిబంధనలకు విరుద్ధంగా, అర్హత లేని వారిని ప్రిన్సిపాల్‌గా నియమించారు. మరోవైపు  పీహెచ్‌డీ కోర్సు అంశంలోనూ అక్రమాలకు తెరలేపారు. సాధారణంగా ప్రీపీహెచ్‌డీ సెమినార్‌ మూడేళ్ల కనీస కాలవ్యవధి పూర్తయిన తరువాత నిర్వహించాలి. కానీ గడువుకు ముందే సెమినార్లు నిర్వహించుకోవడానికి అనుమతి మంజూరు చేశారు. కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌ సబ్జెక్టులకు సంబంధించి ముగ్గురు పీహెచ్‌డీ అభ్యర్థులకు మూడేళ్ల కోర్సు కాల వ్యవధి పూర్తీ కాకుండానే అవకాశం కల్పించారు. కోర్సు మార్గదర్శకాలు, నియమ నిబంధనల ప్రకారం కచ్చితంగా నిర్ధేశించిన విధివిధానాలు పాటించాలి. నాణ్యమైన పరిశోధనలే విశ్వవిద్యాలయం గుర్తింపుకు గీటురాయి. ఈ క్రమంలో పీహెచ్‌డీ కోర్సు అంశంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. గడువు ముగియకుండానే పీహెచ్‌డీ థీసీస్‌ సమర్పించడానికి అవకాశం కల్పించడంపై పరిశోధన విద్యార్థులు అందరూ తమకూ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దీంతో ఉన్నతాధికారులు నివ్వెరపోతున్నారు.

పరిశీలిస్తాం
గడువుకు ముందే ప్రీపీహెచ్‌డీ సెమినార్, సబ్‌మిషన్‌కు అవకాశం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. అలా జరిగి ఉంటే వాటిని పరిశీలిస్తాము. గతంలో జరిగిన అంశాలు కాబట్టి సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తాం.
–ఏ. ఆనందరావు, నూతన రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌

మరిన్ని వార్తలు