మూడు రాష్ట్రాల మధ్య తెగని పంచాయితీ

19 Jul, 2014 01:10 IST|Sakshi

 కర్నూలు(రూరల్):  ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) వివాదం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఆధునికీకరణ పనుల సాకుతో ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక నీటిపారుదల శాఖ అధికారులు యత్నించడం వివాదానికి కారణమైంది. ఈ వివాదం ముగియక మునుపే మహబూబ్‌నగర్ జిల్లాలో చివరి ఆయకట్టుకి నీరందడం లేదని, ఆనకట్ట ఎత్తు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకుపోయింది.

 దిగువకు నష్టం వచ్చేంత స్థాయిలో ఎత్తు పెంచడం లేదని, మహబూబ్‌నగర్ రైతులను అదుకునేందుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమకు ఇటీవల తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు. ఆ లేఖకు సమాధానం ఇవ్వాలని మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించింది. ఆర్డీయస్ ఆనకట్ట ఎత్తు పెంచితే సీమ ప్రాంత ఆయకట్టు రైతులకు మిగిలేది కన్నీళ్లేనని, హైడ్రలాజికల్ క్లియరెన్స్ లేకుండా పనులు చేయకూడదని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు నీటిపారుదల శాఖ అధికారులు నివేదిక అందజేశారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదం మూడు  రాష్ట్రాలకు చేరింది.

 హరీష్‌రావు లేఖలోని  అంశాలు ఇవి..
ఆర్డీఎస్ ఆనకట్ట మధ్యలో అక్కడక్కడ స్తంభాలు ఏర్పాటు చేసుకొని నీటి నిల్వ సామర్థ్యం పెంచుకుంటాం.

హెడ్ రెగ్యులేటర్‌కు ప్రస్తుతం ఉన్న గేట్లను తొలగించి పవర్ క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు  అనుమతివ్వాలి.

బురద తొలగించే గేట్ల స్థానంలో పవర్ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేస్తాం.

ఆనకట్ట కింద ఉన్న పైపులను తీసేసి పూర్తి స్థాయి  మరమ్మతులు చేస్తాం.

{పస్తుతం దిగువకు నీరు వస్తున్న స్లూయిజ్‌ను  మూసి వేస్తాం.

ఆనకట్టను అడుగు ఎత్తు పెంచుకొని, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాం.
 
అధికారుల నివేదిక ఇదీ..
కర్నూలు జిల్లాలో 4 గ్రామాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 15 గ్రామాలకు సాగు, తాగునీరు అందించేందుకు ఆర్డీఎస్‌ను నిర్మించారు.

42.60 కి.మీ నుంచి 143 కి.మీ వరకు ఆర్డీఎస్ కాల్వ ఏపీ పరిధిలోకి వచ్చింది. మిగిలిన 0 కి.మీ నుంచి 42.60 కి.మీ వరకు రాయచూరు జిల్లాలోకి వెళ్లింది.

42 కి.మీ వరకు 5,879 ఎకరాలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాల ఆయకట్టు ఉంది.

ఆర్‌డీఎస్ ఆయకట్టు దిగువకు పోయే నీటిపైనే కేసీ ఆయకట్టు ఆధారపడి ఉంది. ఆనకట్ట మద్యలో స్తంభాలు, హెడ్ రెగ్యులేటర్ గేట్లను, బురద తొలగించే గేట్ల స్థానంలో పవర్ క్రస్ట్ గేట్లు ఏర్పాటుతో దిగువకు చుక్క నీరందదు.

ఆధునికీకరణ సాకుతో ఎత్తు పెంచేందుకు తెలంగాణ పాలకులు, అధికారులు  కుట్ర చేస్తున్నారు.

ఇప్పటీకే ఆనకట్టకు ఉన్న 19 పైపులు మూతపడ్డాయి. ప్రస్తుతం ఒక వెంట్ ద్వారానే దిగువకు నీరు వస్తోంది. దీన్ని కూడా మూసి వేస్తే నీరంతా హెడ్ వర్క్స్ వైపు పోతుంది. నీటి నిల్వ పెంచితే కేసీ ఆయకట్టుకు సాగు నీరు అందక 2.65 లక్షల ఎకరాలు బీళ్లుగా మారుతాయి.

హైడ్రలాజికల్ క్లియరెన్స్ లేకుండా, కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండా పనులు చేయడం చట్ట విరుద్ధం.

మరిన్ని వార్తలు