వైవీయూలో ఏం జరుగుతోంది..?

26 Aug, 2019 08:33 IST|Sakshi

యోగివేమన విశ్వవిద్యాలయంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓవైపు విద్యార్థులు, మరోవైపు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది చేస్తున్న ఆందోళనలు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అవసరమైన వనరులను ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించుకోవడంలో వైవీయూ యంత్రాంగం విఫలం కావడంతో విద్యార్థినులు వసతిలేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 

సాక్షి, వైవీయూ(కడప) : యోగివేమన విశ్వవిద్యాలయం.. ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, మరెన్నో అవార్డులను కైవసం చేసుకుని రాష్ట్రస్థాయిలో ప్రత్యేకత చాటిచెప్పింది. గత ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ జిల్లా పట్ల సవతిప్రేమను కొనసాగిస్తున్నప్పటికీ అధికారులు చాకచక్యంగా నిధులు రాబట్టుకుని విశ్వవిద్యాలయ ప్రగతిలో భాగస్వాములయ్యారు. దీంతో పాటు విశ్వవిద్యాలయాన్ని అకడమిక్‌గా ప్రగతిపథంలో నడుపుతుండటంతో విశ్వవిద్యాలయం పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగి ఈ యేడాది పెద్దసంఖ్యలో ప్రవేశాలు సైతం జరిగాయి.

వరుస ఘటనలతో..
గత రెండేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విశ్వవిద్యాలయం ఇటీవల జరిగిన పదవుల పంపకం తర్వాత ఆందోళనలకు నిలయంగా మారుతోంది. దీనికి తోడు వైస్‌ చాన్స్‌లర్‌ పదవీకాలం మరో 40 రోజుల్లో ముగియనుండటంతో కొందరు అధ్యాపకులు తెరవెనుక రాజకీయాలకు తెరలేపారు. ఇటీవల 10 మంది ఆచార్యులకు సంబంధించిన ఇంక్రిమెంట్ల వ్యవహారం విషయంలో అధికారులు, అధ్యాపకుల మధ్య పోరు నడిచింది. ఎట్టకేలకు ఇది సమసిపోయిందనుకునేలోపు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది నాయకులు అక్రమంగా నియమితులైన కొందరు సిబ్బందిని తొలగించాలని ఆందోళనకు దిగారు. బోధనేతర సిబ్బంది నాయకులు వీరిని కొనసాగించండని లేఖ ఇవ్వడంతో వీరి మధ్య వివాదం రేగింది.

దీంతో పాటు అధ్యాపకులు సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో అధికారులు సర్క్యులర్‌ జారీ చేసి సమయపాలన పాటించాలని ఆదేశించే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  పదవుల పందేరంలో పదవులు ఆశించిన కొందరు ఆచార్యులు అసంతృప్తిగా ఉంటూ తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు గతంలో పనిచేసిన కీలకాధికారి పేషీలో ల్యాప్‌టాప్‌తో పాటు మరికొన్ని సామాన్లు కనిపించలేదు. ఈ విషయమై చూసుకోవాల్సిన ఇంజినీరింగ్‌ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపైనా దుమారం రేగుతోంది. మరోవైపు విశ్వవిద్యాలయ వసతిగృహంలో  నెలకొన్న సమస్యలపై కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా విద్యార్థులు శనివారం 6 గంటల పాటు వైవీయూ ప్రధానద్వారం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు.  ఇది చదవండి : యోగి వేమన యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు

వనరులు ఉన్నా వినియోగం సున్నా..
వైవీయూలోని మహిళా వసతిగృహంలో పెద్దసంఖ్యలో విద్యార్థినులు చేరారు. దీంతో ఒక్కో గదిలో నలుగురు ఉండాల్సిన చోట 8 మందిని సర్దుబాటు చేసినట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. వాస్తవానికి మహిళా వసతిగృహం వెనుకవైపున పెన్నా వసతిగృహం ఉంది. ఇది గత ఐదేళ్లుగా నిరుపయోగంగా ఉంది. దీనిని వినియోగించుకుంటే విద్యార్థినుల వసతి సమస్య తీరుతుందన్న విషయం అధి కారులకు తెలియంది కాదు. అయితే పక్కనే ఉన్న భవనం పరిశోధక విద్యార్థులకు కేటాయించారు. కాగా ఇటీవల పరిశోధక విద్యార్థులను ఆహ్లాద్‌ గెస్ట్‌హౌస్‌ ప్రాంతంలోకి మారాలని సూచించారు. అయితే ఆ గెస్ట్‌హౌస్‌లో కొందరు అధ్యాపకులు నివాసం ఉంటుండటంతో అక్కడికి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు.

కొందరు పరిశోధక విద్యార్థులు మాత్రం అధికారుల ఆదేశాలను కూడా పట్టించుకోకుండా అక్కడే ఉండటంతో పక్కనే ఉన్న మరో భవనాన్ని మహిళలకు కేటాయించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు పే ర్కొంటున్నారు. ఇక మహిళల వసతిగృహంలో భోజనం చేసే విద్యార్థినులకు రూ.1400 నుంచి రూ.1800 వరకు నెలకు మెస్‌ బిల్‌ వస్తోంది. అదే బాలుర వసతిగృహంలో మాత్రం రూ.2,200 మొ దలు రూ.3 వేల వరకు వస్తోంది. దీంతో మెస్‌చార్జీలు తగ్గించాలని, దీని వెనుక జరుగుతున్న అవి నీతిని వెలికితీయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి.  అయితే వసతిగృహాల్లో అతిథుల పేరుతో పూర్వ విద్యార్థులు, విద్యార్థి నాయకులు తిష్టవేశారని, వారికోసం కొందరు విద్యార్థులు భోజనం గదుల్లోకి తీసుకెళ్తుండటంతో ఆ భారం విద్యార్థులందరిపై పడుతోందని అధికారులు, హాస్టల్‌ సిబ్బంది పేర్కొంటున్నారు. కాగా శనివారం జరిగిన ఆందోళనలపై వైస్‌ చాన్స్‌లర్‌ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని మరోసారి ఇలా జరగకుండా చూడాలని ఆదేశించారు. మొత్తానికి వైవీయూలో చోటుచేసుకున్న పరిణామాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా