గంటల్లోనే పట్టుబడ్డారు

14 May, 2015 23:22 IST|Sakshi

నెల్లూరు(కావలి): బంగారు వ్యాపారుల వద్ద నుంచి రూ.82 లక్షలు దోపిడీ చేసి వెళ్లిన నలుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు గంటల తేడాలోనే పట్టుకున్నారు. వారు ముగ్గురు ప్రకాశం జిల్లాలో పోలీస్‌ కానిస్టేబుళ్లగా పనిచేస్తున్నట్లు సమాచారం. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన బంగారు వ్యాపారులు వేమూరి రాము, సునీల్ రూ.82 లక్షల నగదుతో కావలి రైల్వే స్టేషన్ నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు వెళ్తున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చి తాము పోలీసులమని తుపాకిని చూపి బెదిరించారు. మీపై అనుమానంగా ఉందని చెప్పి పడుగుపాడు స్టేషన్ సమీపంలో రైలు నెమ్మదిగా వెళుతున్న సమయంలో ఇద్దరు వ్యాపారులను కిందకు దించారు. వారిని నెల్లూరు ఆత్మకూరు బస్టాండు వద్దకు తీసుకెళ్లారు.

అక్కడ నుంచి అంబాసిడర్ కారును బాడుగకు తీసుకుని, దగదర్తి మండలం దామవరం వద్ద వ్యాపారులను వదిలేశారు. అక్కడ నుంచి నలుగురు వ్యక్తులు వెళ్లిపోయారు. బంగారు వ్యాపారులు కావలి ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు విచారణ చేపట్టి వారు ప్రయాణించిన అంబాసిడర్ కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద ఓ కారులో వెళ్తుండగా వారిని వెంబడించి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. స్టువర్టుపురానికి చెందిన మరో నిందితుడు పరారయ్యాడు. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాలకు చెందిన ఏఆర్‌కానిస్టేబుళ్లుగా అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు