కూల్‌వాటర్‌తో అనారోగ్య సమస్యలు

20 Apr, 2019 12:09 IST|Sakshi

గొంతుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం

ఇన్‌ఫెక్షన్లబారిన పడితే గుండె,ఊపిరితిత్తులకు దెబ్బ

కూల్‌డ్రింక్స్,ఫ్రిజ్‌వాటర్‌కుపిల్లలను దూరంఉంచా ల్సిందే..

కాచి చల్లార్చిన గోరువెచ్చనినీరు బెస్ట్‌

వేసవి కాలంలో కొద్దిసేపటికే గొంతెండుతూ ఉంటుంది. కాస్త ఎండలో వెళ్లి ఇంటికి వస్తే చాలు.. వెంటనే ఫ్రిజ్‌ తీసి గటగటమంటూ కూల్‌ వాటర్‌ తాగేస్తాం.. అప్పటికి ఉపశమనం కలగడంతో కాస్త సాంత్వన పొందుతాం. కానీ ఈ కూల్‌ వాటర్‌తో ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్‌ వాటర్‌ తాగిన వారిలో ఎక్కువ శాతం మంది గొంతు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో కూలింగ్‌ వాటర్‌ తాగడం ఫ్యాషన్‌గా కూడా మారిందని, ఇది ఆరోగ్యానికి చేటని స్పష్టం చేస్తున్నారు.

గుంటూరు, తాడేపల్లి రూరల్‌ :రోజుకి కనీసం ఐదు నుంచి ఆరు లీటర్ల నీరు తాగాలి. శరీరంలోని కాలుష్యాన్ని కడిగేందుకు నీరు ఎంతో ఉపకారం చేస్తుంది. అయితే జాగ్రత్తలు పాటించకుంటే అదే నీరు మన ప్రాణాల మీదకు తెస్తుంది. సమస్యలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముఖ్యంగా ఫ్రిజ్‌ వాటర్‌కు ఆమడ దూరంలో ఉండాలి. ఎందుకంటే నేరుగా గొంతుపై దీని ప్రభావం పడుతుంది. గొంతులోని భాగాలు ప్రభావితమైతే గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలకు ముప్పు తెస్తుంది. గత ఏడాది ఈ సీజన్‌లో గొంతు వ్యాధులు గణనీయంగా పెరిగాయి. ఇందుకు అతి చల్లని నీరే కారణం. ఈ వ్యాధులకు గురయ్యే వారిలో ఎక్కువ మంది చిన్న పిల్లలుంటున్నారు. ఆస్పత్రులకు వచ్చే ప్రతి నలుగురిలో ముగ్గురు పిల్లలు కూలింగ్‌ వాటర్‌ తాగి సమస్యలు కొని తెచ్చుకున్నవారే.  వీరంతా 14 ఏళ్లలోపు చిన్నారులే. వీటితోపాటు వేసవిలో వివిధ ఫ్లేవర్లలో లభించే ఐస్‌క్రీమ్‌లు తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గొంతులోని పొరలు చల్లదనం బారిన పడి రోగ నిరోధక శక్తి కోల్పోతాయి. ఈ కారణంగా ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. గాలిలో ఉన్న రైనో, ఎడినో, ఇన్‌ఫ్లూయంజాలాంటి బ్యాక్టీరియాలు, వైరస్‌లు గొంతుపై ప్రభావం చూపిస్తాయి. జ్వరం రావడం, గొంతు మంట, బొంగురు పోవడం, వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. చల్లనినీళ్లు తాగితే దగ్గు కూడా వస్తుంది. గొంతు ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా ఊపిరితిత్తులపై ప్రభావం పడి న్యూమోనియా వచ్చే అవకాశం ఉంది. ఒళ్లు, కీళ్ల నొప్పుల సమస్య ఏర్పడుతుంది. గుండె, కిడ్నీలకు ఇన్‌ఫెక్షన్‌ చేరే ప్రమాదం ఉంది.

పాటించవలసిన జాగ్రత్తలు
కాచి వడపోసిన వేడి నీరు మాత్రమే తాగాలి. ఆరోగ్య సమస్యలున్న వారికి ఇది తప్పనిసరి. పెరుగు, పండ్లు ఫ్రిజ్‌లో తీసిన వెంటనే కాకుండా కాసేపు ఉంచి గది ఉష్ణోగ్రతకు చేరాక తినాలి. కలుషిత నీటి వల్లే కలరా, టైఫాయిడ్, అతిసార వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలుతా యి. బయటకు వెళ్లినప్పుడు కూడా వేడి నీటిని తీసుకెళ్లాలి.

చిన్న పిల్లలపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు
3 నుండి 12 ఏళ్ల చిన్నారుల గొంతుల్లో టాన్సిల్స్, ఎడినాయిడ్‌ గ్రంథులు అతి త్వరగా ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంటాయి. వీరికి చల్లని నీటికి దూరంగా ఉంచాలి. జ్వరం సమయంలో భోజనం చేసేందుకు గొంతు సహకరించదు. దాదాపు 18 డిగ్రీల సెల్సియస్‌కంటే తక్కువ చల్లదనాన్ని గొంతు తట్టుకోవడం కష్టం. ఒక గ్లాస్‌ చల్లని నీళ్లు తాగగానే గొంతులోని రక్తనాళాలు బాగా బిగుసుకుపోతాయి. కొద్ది సమయానికి గొంతులోని రక్తనాళాలు ఉబ్బి, గొంతు గోడలకుండే పొరలు దెబ్బతింటాయి. గొంతు భాగం నుంచి శరీరంలోని ఇతర భాగాలకు వెళ్లే రక్తనాళాల్లో రక్త ప్రవాహ వేగం 20 నుంచి 30 శాతానికి పడిపోతుంది.–రమేష్‌ నాయక్,  తాడేపల్లి ప్రభుత్వ వైద్యాధికారి

మరిన్ని వార్తలు