అంతరిక్ష ప్రయాణం చేస్తా.. సహకరించండి

21 Sep, 2019 12:01 IST|Sakshi
2016లో ఎవరెస్టు శిఖరంపై భద్రయ్య (ఫైల్‌)

చింతూరు(రంపచోడవరం): ఎంతో సాహసోపేతమైన అంతరిక్ష యాత్రకు వెళ్లేందుకు మన్యానికి చెందిన ఓ అడవిబిడ్డ ఆరాట పడుతున్నాడు. తద్వారా దేశ, రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠ ఇనుమడింపజేస్తానన్నాడు. తను ఆర్థికంగా ఆదుకుని యాత్రకు అవకాశంతో పాటు అనుమితినివ్వాలని వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. చింతూరు మండలం కొత్తపల్లికి చెందిన గిరిబిడ్డ దూబి భద్రయ్య 2016లో రాష్ట్రం తరఫున ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి విజేతగా నిలిచాడు. అనంతరం అరకు స్పోర్ట్స్‌ పాఠశాలలో కన్సల్టెంట్‌గా పనిచేశాడు. అధికారుల విన్నపం మేరకు ఎవరెస్ట్‌ కోచ్‌గా అవతారమెత్తి గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లోని విద్యార్థులకు ఎవరెస్ట్‌ అధిరోహణలో శిక్షణ ఇస్తున్నాడు. భద్రయ్య శిక్షణలో రాటుదేలిన గురుకుల విద్యార్థులు 2017లో 14 మంది, 2018లో 10 మంది ఎవరెస్టును అధిరోహించారు. 

అంతరిక్షంపై ఆశ
గతంలో నాసా ద్వారా అంతరిక్ష యాత్రకు వెళ్లిన భారత్‌కు చెందిన కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్‌ స్ఫూర్తితో తాను అంతరిక్ష యాత్ర చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు భద్రయ్య ‘సాక్షి’కి తెలిపాడు. గిరిజన ప్రతిభను ఆకాశానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నానని, దీనికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించి అవకాశం కల్పించాలన్నారు. ఈ మేరకు ఐటీడీఏ పీవో అభిషిక్త్‌ కిశోర్‌ను కలిసి తనకు ప్రభుత్వ ద్వారా సాయం చేయాలని కోరాడు. స్పందించిన ఆయన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానన్నారు. 

గిరిబిడ్డల సత్తా చాటుతా
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సమయంలోనే అంతరిక్ష యాత్ర చేయాలని నిర్ణయించుకున్నా. కానీ ఆర్థికంగా అది ఎంతో వ్యయ, ప్రయాసలతో కూడుకున్నది కావడంతో వేచి చూస్తున్నాను. ప్రభుత్వం సాయం చేస్తే గిరిబిడ్డల సత్తా చాటుతాను.  – దూబి భద్రయ్య 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా