బ్యాంకులో.. నగలు ఏమయ్యాయి?

22 Apr, 2018 09:26 IST|Sakshi
సిద్దవటంలోని సహకార బ్యాంకు బ్రాంచ్‌ కార్యాలయం

సిద్దవటం : సిద్దవటంలోని సహకార బ్యాంకు బ్రాంచ్‌లో ఉంచిన బంగారు ఆభరణాలు మాయమవడంతో ఖాతాదారులు, నగలను లాకర్లలో ఉంచిన వారు బెంబేలెత్తుతున్నారు. బ్యాంకులోనే భద్రత లేకపోతే ఎలా అని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర సహకార శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత జిల్లాలోనే ఇటీవల సొసైటీ బ్యాంకుల్లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నా.. ఆయన పట్టించుకోక పోవడం గమనార్హం. మొన్న రాజంపేట, ఆ మొన్న అట్లూరు, నిన్న అలిరెడ్డిపల్లె, ఖాజీపేట అగ్రహారం, సిద్దవటం సహకార సొసైటీ బ్యాంకుల్లో నగదు, నగలు మాయం అయ్యాయి. సిద్దవటంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అనుబంధంగా డీసీసీ బ్యాంకు బ్రాంచ్‌ ఉంది. దీని నుంచి రైతులు, సంఘ సభ్యులు రుణాలు తీసుకుంటున్నారు. అందులో కొందరు బంగారును తాకట్టు పెట్టి నగదును రుణంగా తీసుకున్నారు. 377.5 గ్రాముల బంగారు 
నగలు మాయం

గతేడాది 34 మంది రైతులు తమ పంటల సాగు కోసం నగలను తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. ఇందులో అట్లూరు మండలం రెడ్డిపల్లెకు చెందిన పాటూరి విజయభాస్కరరెడ్డి 221 గ్రాముల బంగారును తాకట్టు పెట్టి రూ.3.28 లక్షలు, సిద్దవటం మండలం జ్యోతి గ్రామానికి చెందిన పిన్నపురెడ్డి సుబ్బమ్మ 28.5 గ్రాముల నగలు కుదువ పెట్టి రూ.40 వేలు, అదే మండలం పి.కొత్తపల్లెకు చెందిన రూపురెడ్డి ఎల్లారెడ్డి మొదటి సారి 62.5 గ్రాములకు రూ.95 వేలు, రెండో సారి 65.5 గ్రాముల నగలను తాకట్టుపెట్టి రూ.99 వేలు నగదును తీసుకున్నారు. ఇందులో ప్రతి నెల పాటూరి విజయభాస్కరరెడ్డి మాత్రమే రూ.3250 వడ్డీ చెల్లిస్తున్నారు. మిగతా వారు జూన్, జూలైలలో చెల్లించి నగలు తీసుకోవడమో, రెన్యూవల్‌ చేయడమో చేద్దామని అనుకున్నారు. ఇంతలోనే అధికారులు ఆ నగలపై కన్ను వేశారు. 

ఈ నెల 17న బయపడిన వ్యవహారం

ఈ నెల 7న బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ బదిలీపై రాజంపేట బ్రాంచ్‌కి వెళ్లారు. ఆ తరువాత ఈ నెల 17న నగల లాకర్‌ను బ్యాంకు మేనేజర్‌ రవిచంద్రరాజు అనుమానం వచ్చి పరిశీలించారు. 34 మంది ఖాతాదారుల నగలు రికార్డు ప్రకారం ఉండాలి. అయితే అందులో నలుగురికి చెందిన నగల సంచులు కనిపించకపోవడంతో ఆయన ఆందోళనకు గురయ్యాడు. వెంటనే అధికారులను సమావేశ పరచి చర్చించారు. వారు ఎలాంటి సమాచారం తెలపలేదు. బ్రాంచ్‌ మేనేజర్‌ జిల్లా కేంద్ర బ్యాంకు అధికారులకు విషయం తెలిపారు. జిల్లా కేంద్ర బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ వచ్చి సీసీ కెమరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్‌ను జిల్లా కేంద్ర బ్యాంకు అధికారులు సస్పెండ్‌ చేశారు. అయితే నగల మాయంపై బ్యాంకర్లు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

మరిన్ని వార్తలు