సుగర్స్ చేదుగీతం

3 Nov, 2014 01:57 IST|Sakshi
సుగర్స్ చేదుగీతం
  • చెరకు నీటమునగడంతో రికవరీ తగ్గిపోయే ప్రమాదం
  •  క్రషింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం
  •  తుఫాన్ దెబ్బనుంచి తేరుకోని మిల్లు యాజమాన్యాలు
  • జిల్లాలోని సహకార చక్కెర మిల్లులు చేదుగీతం ఆలపిస్తున్నాయి. చెరకు గానుగాట అయోమయంలో పడింది. ముందుగానే చేపట్టి లక్ష్యానికి మించి క్రషింగ్ జరపాలన్న వారి ఆశలు గల్లంతయ్యాయి. రికవరీ తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. హుదూద్ ధాటికి కర్మాగారాల్లోని గోడౌన్లు, మిల్లు హౌస్‌లు ధ్వంసమయ్యాయి. ఆ నష్టం నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాయి. నీట మునిగిన చెరకును మరో రెండు నెలల వరకు క్రషింగ్ జరపలేని పరిస్థితి. ఇవన్నీ యాజమాన్యాలకు పెనుభారం కానున్నాయి.
     
    చోడవరం: సహకార చక్కెర ఫ్యాక్టరీల క్రషింగ్ పరిస్థితి అయోమయంలోపడింది. గడిచిన పదేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది జిల్లాలో చెరకు విస్తీర్ణం భాగా పెరిగిందని మురిసిపోయినప్పటికీ.. అంతలోనే తీవ్ర నిరాశ మిగిలింది.పెరిగిన పంట విస్తీర్ణంతో ఈ సారి ఇటు పంచదార, అటు బెల్లం దిగుబడి బాగా పెరుగుతుందని అంతా ఆశించారు. జిల్లాలోని చోడవరం, ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలు ఈసీజన్‌లో 11ల క్షల టన్నులకు మించి క్రషింగ్ చేయగలమని ధీమా వ్యక్తం చేశాయి.

    ఒక్క గోవాడ ఫ్యాక్టరీయే గతేడాది 5.48లక్షల టన్నుల క్రషింగ్ చేపట్టింది. ఈ ఏడాది పెరిగిన చెరకు విస్తీర్ణం దృష్ట్యా 6లక్షల టన్నుల వరకు క్రషింగ్ చేయగలమని ధీమాను వ్యక్తం చేసింది. ఇందు కోసం ముందుగానే క్రషింగ్ ప్రా రంభించాలని నిర్ణయించింది. గోవాడ ఈ నేల 15వ తేదీ నుంచి మిగతా ఫ్యాక్టరీలు కూడా డిసెంబరు ఆరంభంలోనే గానుగాటకు సిద్ధమయ్యాయి. ఇందుకు ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇంతలో హుదూద్ ఫ్యాక్టరీలకు పెద్ద నష్టాన్ని చేకూర్చింది.

    తుఫాన్ తాకిడి ఇటు ఫ్యాక్టరీల్లో ఉన్న గోడౌన్లు, మిల్లు హౌస్‌లు ధ్వంసమయ్యాయి. అటు చెరకు పంట ఘోరంగా దెబ్బతింది. ఇది మిల్లుల యాజమాన్యాలకు కోలుకోలేని పరిణామం. అత్యధికంగా చెరకు పండించే చోడవరం, మాడుగుల, యలమంచిలి, అనకాపల్లి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోనే తుపాన్ తీవ్రతో చెరకు తోటలు పెద్ద విస్తీర్ణంలో నేలమట్టమయ్యాయి. గోవాడ ఫ్యాక్టరీ వాస్తవానికి మరో 13రోజులుల్లో గానుగాట ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం పక్వానికి వచ్చిన 2లక్షల టన్నుల చెరకు కటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. తుఫాన్‌కు ఆయా తోటలన్నీ నేలకొరిగి నీరుపట్టాయి. దీంతో రికవరీ పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది.

    జడచుట్టు దశలో ఉన్న వేలాది ఎకరాల్లో తోటలు నీటమునిగి, నేలమట్టమవ్వడంతో చెరకు గెడ ఎదుగుదల తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలోని మిగతా మూడు ఫ్యాక్టరీల పరిధిలోనూ నెలకొంది. తాండవకు కొంతమేర ఫర్వాలేకపోయినా ఏటికొప్పాకకు కూడా దెబ్బతిన్న చెరకు పంటతో తీవ్ర నష్టమే పొంచివుంది. మరో పక్క తుఫాన్‌కు దెబ్బతిన్న మిల్లుహౌస్. గోడౌన్లను మునుపటి స్థితికి తెచ్చుకోవడం యాజమాన్యాలకు తలకు మించిన భారమవుతుంది.

    దెబ్బతిన్న మిషనరీ, పంచదారకు ఇన్సూరెన్సు కోసం ఆయా కర్మాగారాల అధికారులు నానా తంటాలు పడుతున్నారు. వీలైనంత తొందరగా మరమ్మతులు చేపట్టేందుకు యత్నిస్తున్నారు. ఆగమేఘాలమీద వీటన్నింటిని చేపట్టినా పూర్తికావడానికి కనీసం రెండు నెలలైనా పడుతుంది. ప్రస్తుతం చెరకు తోటల్లో నీరున్నందున క్రషింగ్‌ను కొంత ఆలస్యం చేస్తే తప్పా రికవరీ వచ్చే అవకాశం లేదని కూడా యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో డిసెంబరు 20 తర్వాతే గోవాడ, మిగతా ఫ్యాక్టరీల క్రషింగ్ ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక వేళ క్రషింగ్ మరింత ఆలస్యమైతే పక్వానికి వచ్చి నేలకొరిగిన చెరకు తోటల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇన్ని అవాంతరాల మధ్య ఈ ఏడాది క్రషింగ్ ఫ్యాక్టరీలకు పెనుభారం కానుంది.  
     

మరిన్ని వార్తలు