ఆగ్రహించిన అంగన్‌వాడీలు

14 Mar, 2015 02:38 IST|Sakshi

కనీస వేతనాలను సాధించుకుందామంటూ జిల్లాలో అంగన్‌వాడీలు కదంతొక్కారు. ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్‌తోపాటు కందుకూరు సబ్ కలెక్టరేట్, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముట్టడి కార్యక్రమాలు జరిగాయి.ఒంగోలులో ఉదయం పదకొండు గంటలకు రెండు ప్రధాన గేట్లను ముట్టడించి బైఠాయించారు.
 - కలక్టరేట్ రెండు గేట్ల ముందు రెండున్నర గంటలపాటు బైఠాయింపు


- పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట
- అరెస్టులను నిరసిస్తూ పోలీసు స్టేషన్‌వరకు ప్రదర్శన
- జిల్లాలో పలు ప్రాంతాల్లో నిరసనలు

ఒంగోలు టౌన్: ఐసీడీఎస్ సంరక్షణే ధ్యేయంగా..కనీస వేతనాలను సాధించుకొనేందుకు అంగన్‌వాడీలు కదం తొక్కారు. ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఉదయం పదకొండు గంటల నుంచి రెండున్నర గంటలపాటు కదలకుండా అక్కడే బైఠాయించారు. ఉద్యోగులు ద్విచక్ర వాహనాల ద్వారా బయటకు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో అలాగే ఉండిపోయారు. పోలీసులు గమనించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.

దీంతో పోలీసులకు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండటంతో పోలీసు వాహనాలతోపాటు ఒక ప్రైవేట్ స్కూల్ బస్సును కూడా అత్యవసరంగా రప్పించి  పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ ఒంగోలు వన్‌టౌన్, టూటౌన్ పోలీసు స్టేషన్ల వరకు ప్రదర్శన నిర్వహించారు. ముందుగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కారుసాల సుబ్బరావమ్మ మాట్లాడుతూ ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ధ్వజమెత్తారు. వేలాది మంది అంగన్‌వాడీలు దశాబ్దాల తరబడి పనిచేస్తున్నప్పటికీ వారికి ఎలాంటి ప్రోత్సాహకాలు అందించడం లేదన్నారు.

కనీస వేతనం చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరితే ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ బీద పలుకులు పలుకుతున్నారన్నారు. ఈనెల 17వ తేదీ జరగనున్న చలో హైదరాబాద్‌కు జిల్లా నుండి అధిక సంఖ్యలో అంగన్‌వాడీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీఎల్‌ఓ విధులు, స్మార్ట్ సర్వేలు, మరుగుదొడ్ల నిర్మాణాలు ఇలా రకరకాల సర్వేలు చేయిస్తూ వారిని ప్రశాంతంగా ఉండనీయకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. అనేకమంది అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత అంగన్‌వాడీలపై రాజకీయ వేధింపులు పెరిగిపోయాయన్నారు.

యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఈదర అన్నపూర్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్ష, కార్యదర్శులు దామా శ్రీనివాసులు, బీ వెంకట్రావు, నాయకులు శ్రీరాం శ్రీనివాసరావు, హనుమంతరవు, బాబూరావు, ప్రతాప్, మహేష్, సునీల్ తదితరులు నాయకత్వం వహించారు. అంగన్‌వాడీలు రెండు ప్రధాన గేట్ల ముందు బైఠాయించడంతో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం. హరిజవహర్‌లాల్, ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్‌లు గేటు పక్కనే ఉన్న చిన్న మార్గం ద్వారా లోపలికి వెళ్లారు. తమ వాహనాలను బయటనే వదిలే శారు.

మరిన్ని వార్తలు