కాపీ బాబు

16 Feb, 2015 03:57 IST|Sakshi
కాపీ బాబు
  • కాపీ కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఏపీ సీఎం
  • కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాల అనుకరణ
  • సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్లపాటు సీఎంగా పనిచేశానని, మరో పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించానని, తన అనుభవం ముందు మిగతావారు దిగదుడుపేనని తరచూ చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడెందుకనో.. అనుకరణ మంత్రం పఠిస్తున్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన గడచిన ఎనిమిది నెలల పాలనలో కాపీ కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అటు కేంద్రపభుత్వం.. ఇటు తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలను ఒక్కొక్కటిగా అనుసరిస్తున్నారు.

    ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వచ్ఛ భారత్’ అనగానే ఈయన స్వచ్ఛాంధ్ర అనడం.. కేంద్రం స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేస్తామనగానే ఈయన మరో అడుగు ముందుకేసి స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు అని చెప్పడం కాపీ కార్యక్రమాలకు ఉదాహరణలు. తాజాగా తెలంగాణ సర్కారు పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచగా ఆ తర్వాత నాలుగురోజులకే చంద్రబాబు ఏపీలోనూ వ్యాట్ పెంచి జనంపై భారం మోపారు. అయితే అనుకరణలోనూ చంద్రబాబు ఒకడుగు ముందుండాలని తెలంగాణ ప్రభుత్వం పెంచినదానికన్నా కొంచెం ఎక్కువగానే పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచారు.

    ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెప్పుకున్న చంద్రబాబు ఇలా అనుకరణ ఎజెండాతో ముందుకెళుతుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎనిమిది నెలల పాలనలో సొంత మార్కు అంటూ ఏదీ లేకుండా కాపీ సిద్ధాంతాన్ని బాగా వంటబట్టించుకున్న ఆయన పాలన తీరుపై రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం ఆశ్చర్యపోతోంది. ఇలా అనుకరణ బా టలో పయనిస్తున్న అధినేతపై టీడీపీ వర్గాల్లోనూ సందేహాలు నెలకొన్నాయి.
     
     ఈ విధంగా ముందుకు పోదాం...
     
    1- పధాని మోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని చంద్రబాబు అనుకరించారు. గతేడాది అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించగా, చంద్రబాబు సెప్టెంబర్ 25 నుంచే స్వచ్ఛాంధ్ర పేరుతో రాష్ట్రంలో వారోత్సవాలు నిర్వహించారు.
     
    2- దేశవ్యాప్తంగా వంద స్మార్ట్ సిటీల పథకాన్ని కేంద్రం ప్రకటించిందో లేదో.. వెంటనే చంద్రబాబు అందుకున్నారు. రాష్ట్రంలోనూ స్మార్ట్ సిటీలతోపాటు స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు అంటూ మొదలుపెట్టారు. ఎంపీలు విధిగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రధాని నిర్దేశిస్తే, బాబు కొంత ముందుకెళ్లి రాష్ట్రంలోని గ్రామాలు, వార్డులూ అధికారులు దత్తత తీసుకోవాలన్నారు.
     
    3- తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.పది కోట్లిచ్చింది. దీనిని చూసి చంద్రబాబు సంక్రాంతిని అధికారిక సంబరాలుగా ప్రకటించారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నాయని చెబుతున్న ఆయన ఈ ఉత్సవాలకోసం 13 జిల్లాలకు రూ.13 కోట్లు మంజూరు చేశారు.
     
    4- తెలంగాణలో చెరువుల నిర్మాణం, వాటర్‌గ్రిడ్ అనగానే.. ఆంధ్రప్రదేశ్‌లోనూ వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు.
     
    5- తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తమ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇవ్వగానే.. రాష్ట్రంలోనూ అంతే మొత్తంలో అధికారులకు పీఆర్సీ ఇచ్చారు.
     
    6- యోగాను ప్రభుత్వాధికారులకు అనుసంధానిస్తే సత్ఫలితాలు ఉంటాయని ప్రధాని మోదీ ఇటీవలే అన్నారు. ఇంకేముంది.. చంద్రబాబు జనవరి 29 నుంచి 31 వరకు మూడ్రోజులపాటు హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో రూ.3 కోట్ల ఖర్చుతో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లు, మంత్రులకు యోగా శిక్షణ నిర్వహించారు.
     
    7- పేదలకోసం తమిళనాడులో అమలు చేస్తున్న ‘అమ్మ క్యాంటీన్ల’ను కాపీకొట్టి రాష్ట్రంలో ‘అన్న క్యాంటీన్లు’ పెడతామని చెప్పారు. ఇప్పుడదే తమిళనాడు తరహాలో మద్యం విక్రయాలు మొదలుపెట్టాలన్న యోచనలో ఉన్నారు.
     
    8- తెలంగాణ శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా సీఎం కేసీఆర్ రూ.350 కోట్లతో గతేడాది ఆగస్టులో అధునాతన ఇన్నోవాలు, బొలేరో, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి పోలీసులకు అందించారు. దీనినీ సీఎం చంద్రబాబు ఫాలో అయ్యారు. గత డిసెంబర్‌లో రూ.106 కోట్లతో 2,400 వాహనాలను కొనుగోలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వాహనాలకు వాడిన రంగుల్నే వీటికి అనుకరించడం విశేషం.
     
    9- కేంద్రం నదుల అనుసంధానంపై ప్రకటించగానే చంద్రబాబు రాష్ట్రంలో నదుల అనుసంధానం చేస్తామని పేర్కొనడం మరో ఉదాహరణ.
     
    10- తెలంగాణ సీఎం కేసీఆర్ గతేడాది అక్టోబర్‌లో రాష్ట్రంలోని అసైన్డ్ భూములు, ఆక్రమిత స్థలాలను సర్వే చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. తాజాగా చంద్రబాబు కూడా రెవెన్యూపై సమీక్షించి ఏపీలోని మొత్తం అసైన్డ్, ఆక్రమిత భూములపై సర్వేకు ఆదేశాలిచ్చారు.
     
    11- కొత్త రాజధాని నిర్మాణం విషయంలోనూ చంద్రబాబు అదే పంథాను అనుసరిస్తున్నారు. ఏకంగా సింగపూర్‌కు తీసిపోని ప్రపంచానికే తలమానికంగా ఉండే నదీముఖ రాజధానిని నిర్మిస్తామని ప్రకటించారు.

మరిన్ని వార్తలు