రూ.14.23 కోట్లు వృథా

27 Nov, 2018 12:37 IST|Sakshi
పూడికతో ఉన్న పంట కాలువలు 

సమస్యల వలయంలో పీబీ చానల్‌

బలహీనంగా ఉన్న చెరువు కట్టలు

చిల్లచెట్లు, పూడికతో నిండిన వైనం

రిజర్వాయర్‌లో పేరుకున్న ఇసుక మేటలు

ఈ ఏడాది ఒక్కరోజూ నీరు పారని కాల్వలు

వృథాగా మారిన జపాన్‌ నిధులు

ఆందోళనలో ఆయకట్టు రైతాంగం

సాక్షి, సింగరాయకొండ: నిధులు మంజూరయ్యాయి.. ఇక తమ కష్టాలు తీరతాయి.. పుష్కలంగా పంటలు పండుతాయనుకున్న రైతన్న ఆశలు నెరవేరలేదు. అధికారులు, కాంట్రాక్టర్ల అవినీతి అన్నదాతలకు నిరాశే మిగిల్చింది. సింగరాయకొండ ప్రాంత రైతాంగానికి ప్రధాన నీటి వనరు అయిన  పీబీ (పాలేరు–బిట్రగుంట) సప్లయ్‌ చానల్‌కు కాంగ్రెస్‌ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14.23 కోట్ల రూపాయల జపాన్‌ నిధులు మంజూరయ్యాయి. కానీ,ఆ ప్రభుత్వ హయాంలో 50 శాతం కూడా పని జరగలేదని, తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఒక్క శాతం కూడా పని చేయలేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగం పనులు కూడా జరగ లేదని రైతులంటుండగా ఇరిగేషన్‌శాఖ అధికారులు మాత్రం 10 శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్టు చెబుతుండటం విశేషం.

పీబీ సప్లయ్‌ చానల్‌ ఆయకట్టు..
ఈ చానల్‌ పరిధిలో సింగరాయకొండ, జరుగుమల్లి మండలాలలోని తొమ్మిది మీడియం ఇరిగేషన్‌ చెరువులకు పాలేరు పై జిల్లెళ్లమూడి వద్ద నిర్మించిన రిజర్వాయర్‌ ద్వారా సాగు నీరు సరఫరా అవుతుంది. రిజర్వాయర్‌ నుంచి సుమారు 30 కిలోమీటర్లు ఉన్న ఈ చానల్‌ ద్వారా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట చెరువుకు, సింగరాయకొండ మండల పరిధిలోని కలికవాయ పంచాయితీలో చవిటిచెరువు, మూలగుంటపాడు పంచాయతీలో జువ్వలగుంట చెరువు, పాకల పంచాయతీ పరిధిలోని కొత్తచెరువు, పాంచ్‌ చెరువు, సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని రాజు చెరువు, మర్రిచెరువు, కొండ్రాజుగుంట చెరువు, బింగినపల్లి పంచాయతీలోని బింగినపల్లి చెరువుకు నీరు సరఫరా అవుతుంది. ఈ చెరువుల పరిధిలో సుమారు 7 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా సుమారు 10 వేల ఎకరాలలో అనధికారికంగా  సాగవుతోంది. ఈ చానల్‌ పరిధిలోని చెరువుల కింద ప్రధానంగా రబీలో వరి సాగు చేస్తారు.  చెరువులు ఏటా రెండు సార్లు నిండితేనే ఆయకట్టులో పంట పూర్తిగా పండుతుంది.

పూడికతో ఉన్న చానల్,రిజర్వాయర్‌..
రిజర్వాయర్‌ వద్ద ఇసుక మేట కారణంగా వర్షపునీటిని రిజర్వాయర్‌లో నిల్వ చేసే పరిస్థితి లేదు. రిజర్వాయర్‌లో పూడిక తీయాలని ఆయకట్టు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు. రిజర్వాయర్‌ కందుకూరు నియోజకవర్గ పరిధిలో ఉండటంతో పాటు రిజర్వాయర్‌ చుట్లూ చుట్టు పక్కల గ్రామాల రక్షిత మంచినీటి పధకం బోర్లు ఉండటంతో తమ మంచినీటి స్కీములు దెబ్బతినే అవకాశం ఉందని ఆ ప్రాంత ప్రజలు అడ్డుపడటంతో రాజకీయ ప్రాబల్యం కారణంగా పూడికతీయక పోవటంతో చానల్‌ సక్రమంగా పారక ఆయకట్టు సక్రమంగా పండటం లేదని రైతులు వాపోతున్నారు.

నాడు రెండు పంటలు..
పీబీ చానల్‌లో పూడిక పేరుకు పోయి ఉండటంతో సుమారు పాతికేళ్ల క్రితం ప్రభుత్వం పై ఆధారపడకుండా ఆయకట్టు రైతులు నడుంబిగించి సొంతంగా చానల్‌లో పూడిక తొలగించుకుని రెండు పంటలు పండించారు. తరువాత చానల్‌లో పూడికపేరుకు పోవడం, వర్షాభావ పరిస్థితులు తోడవటంతో ఒక్క పంటే పండిస్తున్నారు.
 
జపాన్‌ నిధులు మాయం..

చానల్‌ అభివృద్ధికి 14.23 కోట్ల రూపాయల జపాన్‌ నిధులు మంజూరయ్యాయి. అయితే కాంట్రాక్టర్‌ పనులు నాసిరకంగా చేయడంతో పాటు 50 శాతం పనులు కూడా చేయలేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. చివరికి నిధుల వినియోగానికి కాలపరిమితి ముగిసే లోపు 90 శాతం పనులు చేసినట్లు అధికా>రులు ప్రకటించడంతో రైతాంగం విస్తుపోయింది. 

ప్రశ్నార్థకంగా వరిసాగు..
పీబీ చానల్‌ పరిధిలోని ఆయకట్టు రైతాంగం గత మూడేళ్లగా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవడంతో ఆయకట్టు రైతులు వరిసాగు కన్నా జామాయిల్‌ సాగుపై ఆశక్తి చూపుతున్నారు. వర్షాభావ పరిస్థితులు కారణంగా నిరుడు కేవలం 600 ఎకరాలలో వరిసాగు చేయగా, ఈ సంవత్సరం కేవలం 100 ఎకరాలలో వరి కాకుండా వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఏటా చానల్‌లో సుమారు 10 నుంచి 15 రోజుల పాటు పారగా నిరుడు 5 రోజులు మాత్రమే నీరు పారింది. ఈ సంవత్సరం ఒక్కరోజు కూడా  పారలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇరిగేషన్‌ ఏఈ విజయలక్ష్మి మాట్లాడుతూ రిజర్వాయర్‌ వద్ద ఆనకట్ట అభివృద్ధికి 20 లక్షల రూపాయలు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఇతర పనులకు ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదని చెప్పారు.

>
మరిన్ని వార్తలు