‘మొక్కజొన్న’ భారం రాష్ట్రానికే

5 Jan, 2015 02:46 IST|Sakshi
‘మొక్కజొన్న’ భారం రాష్ట్రానికే
  • సెంట్రల్‌పూల్ నుంచి తొలగింపు   
  • కేంద్ర ఆహార,  ప్రజా పంపిణీ శాఖ స్పష్టీకరణ
  • సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జరిగే మొక్కజొన్న క్రయవిక్రయాల నుంచి కేంద్రం పూర్తిగా తప్పుకుంది. నిర్ణీత సమయంలోగా మొక్కజొన్న కొనుగోలు ప్రణాళిక అందివ్వకపోవడం, కేంద్రం నుంచి తీసుకోవాల్సిన అనుమతుల్లో జాప్యం కారణంగా.. ఇప్పటి వరకు కొనుగోలు, అమ్మకం ధరకు మధ్య ఉన్న నష్టాన్ని భరించిన కేంద్రం, ఇకపై రాష్ట్రమే ఆ భారాన్ని భరించాలని స్పష్టం చేసింది.

    ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ, భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ద్వారా ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రం కొనుగోలు చేసే మొక్కజొన్న సెంట్రల్‌పూల్ కిందకు రాదని, లాభనష్టాలను రాష్ట్రమే భరించాలని స్పష్టం చేసింది. కేంద్ర నిబంధనల మేరకు ఆర్థిక సంవత్సరంలో జరిపే మొక్కజొన్న కొనుగోళ్లపై రాష్ట్రం ముందుగానే కేంద్రానికి తన కార్యాచరణ ప్రణాళికను అందిం చి, దానికి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.

    కేంద్రం ఆమోదం లభించిన పక్షంలో కొనుగోలు జరిపే ధరకు, అమ్మకం చేసే ధరకు మధ్య వ్యత్యాసాలు ఉంటే ఆ భారాన్ని రాష్ట్రంపై మోపకుండా కేంద్రమే భరిస్తుంది. ఎఫ్‌సీఐ విధించే నిర్ణీత సమయంలోగా ఆ విక్రయాలను రాష్ట్ర మార్క్‌ఫెడ్ పూర్తి చేయాలి. లేని పక్షంలో నష్టాన్ని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది.  2013-14లో క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.1,300 వరకు చెల్లించి 2.87లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ జరిపారు.

    అయితే గత ఏడాది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అంతర్జాతీయంగా తగ్గిన డిమాండ్ నేపథ్యంలో నిల్వలు పేరుకుపోవడంతో లక్ష మెట్రిక్ టన్నులను క్వింటాలుకు రూ.1,050 వరకు ధర తగ్గించి విక్రయించింది. మిగిలిన 1.87లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలో లక్ష మెట్రిక్ టన్నులను టన్నుకు రూ.10,850మేర కొనుగోలు చేసినా రూ.10వేలకే టన్ను చొప్పున విక్రయించింది.

    ఈ వ్యత్యాస భారం రూ. 10కోట్ల నుంచి రూ.12కోట్ల మేర కేంద్రమే భరించాల్సి వచ్చింది. ఇక ప్రస్తుత ఏడాదిలో సైతం సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న మార్క్‌ఫెడ్ ఇప్పటివరకు 2.8 లక్షల టన్నుల మొక్కజొన్నను రూ.1,310 మద్దతు ధరకు కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుత ఏడాది కొనుగోలు ప్రణాళికను కేంద్రానికి సమర్పించకపోవడంతో సెంట్రల్ పూల్ నుంచి మొక్కజొన్నను తొలగించారు.
     

మరిన్ని వార్తలు