కలిసికట్టుగా యుద్ధం !

8 Apr, 2020 12:44 IST|Sakshi
ఒంగోలులోని పాతమార్కెట్‌ రోడ్డుపై అడ్డంగా ఉంచిన బారికేడ్లు, తోపుడుబండ్లు

జిల్లాలో రోజురోజుకూ తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

పది రోజుల్లో ఏడు మాత్రమే పాజిటివ్‌ కేసులు.. ఒకరు డిశ్చార్జి

మంగళవారం పంపిన 90 శాంపిల్స్‌లో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాని వైనం

కలెక్టర్, ఎస్పీల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు

ఢిల్లీ, విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలింపు

కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టడంలో సఫలీకృతం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం కలిసికట్టుగా చేస్తున్న యుద్ధం సత్ఫలితాలనిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ జిల్లాలో మాత్రం తగ్గుతుండటం ఆనందించదగ్గ విషయం. గత పదిరోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా జిల్లాలో 7 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదు కావడం, లండన్‌ నుంచి వచ్చిన యువకుడు కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన సంఘటనతో జిల్లాలో వైద్యారోగ్య శాఖ, జిల్లా అధికార యంత్రాంగంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది.  

జిల్లాలో ఇప్పటి వరకు 24 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అందులో లండన్‌ నుంచి వచ్చిన యువకుడు కరోనాను జయించి ఒంగోలు జీజీహెచ్‌ ఐసోలేషన్‌ వార్డు నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. మిగతా 23 మందిలో ఒకరి పరిస్థితి కొంచెం విషమంగా ఉండటంతో నెల్లూరు వైద్యశాలలో చికిత్స అందిస్తుండగా ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా ఒంగోలు కిమ్స్‌ ఆస్పత్రిని స్వాధీనం చేసుకున్న జిల్లా అధికారులు అందులో 10 మంది కరోనా పాజిటివ్‌ కేసులను ఉంచారు. మిగతా 12 మంది ఒంగోలు జీజీహెచ్‌ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఒంగోలు జీజీహెచ్‌లోని క్వారంటైన్‌ కేంద్రంలో పాజిటివ్‌ కేసులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారు సుమారు 153 మంది అనుమానితులున్నారు. కోవిడ్‌–19 వచ్చినప్పటి నుంచి ఒంగోలు జీజీహెచ్‌లో డాక్టర్‌ జాన్‌ రిచర్డ్స్‌ను నోడల్‌ ఆఫీసర్‌గా నియమించి 30 మంది వైద్యులు సుమారు 100 మంది రెవెన్యూ సిబ్బంది నిరంతరం కరోనా బాధితులకు వైద్య చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఉన్న క్వారంటైన్‌ కేంద్రాలకు వెళ్లి అనుమానితుల శాంపిల్స్‌ను సేకరించి ప్రతిరోజు ల్యాబ్‌లకు పంపుతూ రిపోర్టులు తెప్పించుకుని పాజిటివ్‌ కేసులుగా ఉన్న వారిని జీజీహెచ్‌కు తరలించి చికిత్స చేస్తున్నారు. మంగళవారం ఒంగోలు జీజీహెచ్‌ వైద్యులు 90 మంది కరోనా పాజిటివ్‌ అనుమానితుల శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడంతో జిల్లా అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

ప్రణాళికంగాబద్ధంగా ముందుకు..
కలెక్టర్‌ పోల భాస్కర్‌ నేతృత్వంలో నియోజకవర్గానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించి కరోనా నియంత్రణపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదైన ఒంగోలు, చీరాల, కారంచేడు, కందుకూరు, కనిగిరి, చీమకుర్తి, కొనకనమిట్ల మండలం యు.వెలిగండ్ల గ్రామాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించి పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల మేర ప్రతిరోజు పరీక్షలు నిర్వహిస్తూ అనుమానితులను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారికి కరోనా పాజిటివ్‌ అధికంగా ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులను వారితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ క్వారంటైన్‌ కేంద్రాలలో అత్యంత వేగంగా చేర్చగలిగారు. ఇందు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగించడం విశేషం. దీనివల్ల కరోనా ఎక్కువ మందికి వ్యాప్తి చెందకుండా అరికట్టగలిగారు.   

లాక్‌డౌన్‌ మరింత కఠినతరం
జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నప్పటికీ పూర్తిగా నివారించేందుకు జిల్లా అధికార యంత్రాంగం నడుం బిగించింది. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ నేతృత్వంలో 4 వేల మంది పోలీసు సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ఒంగోలు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం చెక్‌పోస్టులు, ప్రధాన కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి కొత్త వ్యక్తులు  జిల్లాలోకి రాకుండా చర్యలు చేపట్టారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఆ తరువాత రోడ్లపైకి ఎవరూ రాకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు